డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తల్లి గీతా భాస్కర్
‘ఈ రోజుల్లో పిల్లలను అన్ని విషయాల్లోనూ అదే పనిగా పట్టుకొని ఉండటం వల్ల వారి ఎదుగుదలలో సమస్యలు వస్తున్నాయి’ అంటున్నారు సినీ దర్శకుడు తరుణ్ భాస్కర్ తల్లి గీతా భాస్కర్. ‘‘అమ్మను భూమాతతో పోల్చుతాం. భూమి ఎక్కడా ఆగిపోకుండా, తిరుగుతూనే ఉంటుంది. కానీ, పిల్లలమైన మనల్ని పడిపోకుండా నిలబెడుతుంది. అమ్మ కూడా అంతే. పిల్లలు వారి జీవితంలో నిలదొక్కుకోవడానికి తిరుగుతూనే ఉండాలి. కానీ, అతిగా పట్టుకోకూడదనేది నా ఆలోచన.
ఆ(హా)ర్ట్ ఫుల్‌గా!
నేను ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు మా వారు నన్ను ఆర్ట్స్ నేర్చుకోమని ప్రోత్సహించారు. ఆ సమయంలోనే పెయింటింగ్, మ్యూజిక్, డ్యాన్స్ నేర్చుకున్నాను. ఇంగ్లిష్, కమ్యూనికేషన్ స్కిల్స్ బుక్స్ చదివేదాన్ని. వేవిళ్లతో ఉన్నప్పుడు అవి నేర్చుకోవడం కష్టమనిపించేది. కానీ, తప్పేది కాదు. బాబు పుట్టాక వాడి కోసం మా ఆయన కేరింగ్ మరింత ఎక్కువయ్యింది. ‘ఇంత పొసెసివ్‌గా ఉండటం ఎందుకు?’ అనేదానిని. మా బంధువుల్లో కూడా చాలా మంది అంటుండేవారు. కానీ, ఆయన పట్టించుకునేవారు కాదు. నేను అది పొసెసివ్‌నెస్ అనుకున్నాను. అలాంటిది 6వ తరగతిలో ఉన్న బాబును స్టేట్ ఆర్ట్ కాంపిటీషన్‌కు మైసూరుకు ఒక్కణ్ణే పంపించారు. ఆ సమయంలో నేను భయపడ్డాను చిన్నపిల్లాడు కదా అని. కానీ, తను వినలేదు. తరుణ్ ఆ కాంపిటిషన్‌లో పాల్గొన్నాడు, ప్రైజ్ కూడా తీసుకొచ్చాడు.
బాబు కోసం ఫుల్‌టైమ్ జాబ్ వద్దనుకున్నాను. దీనికి కూడా మావారే కారణం. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి తల్లినే ముందుగా వెతుక్కుంటారు. వారు ఒక దశకు వచ్చేవరకు తల్లితో ఉన్న అటాచ్‌మెంట్ దూరం అవకూడదు అనేవారు. దీంతో ఆర్ట్ టీచర్‌గా ఫుల్‌టైమ్ జాబ్ చేసే నేను పార్ట్ టైమ్‌కి షిఫ్ట్ అయ్యాను.
ఈజీ ఫీలింగ్ వద్దు
డబ్బులు పొదుపు, సంపాదన గురించి ఎప్పుడూ చెప్పలేదు. అలాగని, ఎప్పుడూ కండిషన్స్ పెట్టలేదు. ప్రతి తల్లీతండ్రీ సాధ్యమైనంత వరకు పిల్లల అవసరాలు తీర్చడానికే ప్రయత్నం చేస్తారు. మేం ఆర్థికంగా కష్టపడిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ, అవేవీ బాబుకు చెప్పలేదు. కానీ, నన్ను డబ్బులు అడిగితే మాత్రం నేరుగా ఇచ్చేదాన్ని కాదు. మావారికి డబ్బులు ఇచ్చి, ఆయననే ఇవ్వమనేదానిని. ‘అమ్మ సంపాదిస్తుంది. నేను అడిగితే ఈజీగా ఇచ్చేస్తుంది’ అనే ఫీలింగ్ బాబులో రాకూడదనుకున్నాను. డబ్బు గురించి కాదు ఆనందించే సందర్భాలు కోల్పోకూడదు అని తాపత్రయపడేదాన్ని. ఎందుకంటే మళ్లీ ఆ రోజులు, ఆ సందర్భాలు తిరిగి రావు.
కథలా చెప్పాలి
నాకు ప్రతీదానితో కనెక్ట్ చేసి కథలు చెప్పడం అలవాటు. అలాగే సోలార్ ఎనర్జీతో మనకున్న బంధం, మన శరీరంలో ఉన్న అవయవాలతో బంధం ఎలా ఉంటుందో చెప్పేదాన్ని. నాన్న దేవాలయం, అమ్మ అందులో దేవత, బ్రదర్ పూజారి, ప్రసాదం అందరం కలిసి తినేది.. ఇలా ఒక కథలా చెబితే పిల్లలు ఆనందంగా వింటారు, ఆలోచిస్తారు. ఆ కుటుంబ బంధం కూడా బాగుంటుంది. పిల్లల ముందు బంధువుల్లో ఎవరి గురించీ చెడుగా చెప్పకూడదు.
సరి చేయాలనుకోకూడదు
పిల్లల మెదళ్లలో ఎన్నో ఆలోచనలు ఉంటాయి. పెయింటింగ్‌లో అయినా, ఏ సృజనాత్మక పనులు అయినా వారు చేసింది మనం సరిచేయవద్దు అనేది నా ఆలోచన. వారి మైండ్‌లో ఏముందో అది మన ముందు పెడతారు. దానిలో మనం కల్పించుకోవద్దు. మా అబ్బాయి ఎక్కడా పెయింటింగ్ నేర్చుకోలేదు. కానీ, పోర్ట్రయిట్స్ చాలా బాగా వేస్తాడు. తబలా వాయిస్తాడు. ఇన్‌స్ట్రుమెంటల్ మ్యూజిక్‌లో కాలేజీ స్థాయిలో ఫస్ట్ ప్రైజ్‌లు వచ్చాయి. నేను ఆర్ట్ టీచర్‌ని. కానీ, ఏదీ బాబు చేయిపట్టి నేర్పలేదు. కాలేజీ రోజుల్లోనే షార్ట్ ఫిల్మ్‌లు ప్లాన్ చేస్తుండేవాడు. అందుకు వాడి స్నేహితులు కూడా ఇంటికి వచ్చేవారు. వారందరికీ కావల్సినవి అమర్చిపెట్టేదాన్ని. తరుణ్ స్నేహితులు నాకు కూడా పిల్లలైపోయారు. ఇప్పటికీ వారందరితో స్నేహబంధం బాగుంటుంది.
ఏ కాలానికి ఆ కాలంలో పిల్లల పెంపకంలో వివక్ష ఉంది. ఒత్తిడి ఉంది. ‘ఎక్కడికి వెళ్లావు, ఏం చేస్తున్నావు, అదెందుకు చేస్తున్నావు, ఇలా ఎందుకు ఉన్నావు... ’ అంటూ పదే పదే అంటూనే ఉంటారు. అయితే, పిల్లలకు కూడా బాధ్యత తెలుసు. ఎలా ఉండాలో తెలుసు. మనం ఒక ఫ్రెండ్‌లా గైడ్ చేయాలి. అంతవరకే మన విధి. అంతకు మించి ఎక్కువ పట్టుకోకూడదు’’ అని తెలిపారు.
∙నిర్మలారెడ్డి


