అమ్మానాన్నల హక్కు కాదు..! | Legal Advice: What are Indian Laws on the Custody of a Child | Sakshi
Sakshi News home page

అమ్మానాన్నల హక్కు కాదు..! అది కేవలం పిల్లల హక్కు..

Jun 25 2025 10:27 AM | Updated on Jun 25 2025 10:27 AM

Legal Advice: What are Indian Laws on the Custody of a Child

ఉద్యోగం పురుష లక్షణం.. నాన్న సంపాదిస్తాడు. అమ్మ ఇంటిల్లిపాది అవసరాలను చూసుకుంటుంది. అమ్మ, నాన్న అనగానే ఇంచుమించు ఈ భావనలే కలుగుతాయి అందరిలో!  ఒకవేళ స్త్రీ ఉద్యోగి అయినా.. ఇంటిపని, వంట పని బాధ్యత కూడా ఆమెదే! ఇందులో పురుషుడి భాగస్వామ్యం ఏమీ ఉండదు. కుటుంబ సభ్యుడిగా అది అతని బాధ్యత కూడా కదా.. అనే భావన సమాజానికి రాదు. అది అతని పని కాదనే జడ్జిమెంట్‌తోనే ఉంటాం. బహుశా దీని ఆధారంగానే కావచ్చు సుప్రీంకోర్టు ఇటీవల ఒక తీర్పునిచ్చింది. ఆ కథేంటంటే..

కేరళకు చెందిన ఒక వ్యక్తి సింగపూర్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి ఎనిమిదేళ్ల కూతురు, మూడేళ్ల కొడుకు ఉన్నారు. భార్యతో విడాకులు అయ్యాయి. నెలలో పదిహేను రోజులు కూతురి కస్టడీని తండ్రికి ఇచ్చింది కేరళ హైకోర్టు. కూతురి కోసం ఆ తండ్రి తిరువనంతపురంలో ఒక ఇల్లు అద్దెకు తీసుకుని, నెలలో పదిహేనురోజులు కూతురి దగ్గర ఉండేవాడు. అయితే తల్లి దాన్ని సవాలు చేస్తూ పూర్తి కస్టడీ తనకే ఇవ్వాలని సుప్రీంకోర్టుకు వెళ్లింది. 

తండ్రిని విచారించిన సుప్రీంకోర్టు.. అతను తన బిడ్డకు ఇంట్లో వండిన రుచి, శుచికరమైన భోజనాన్ని అందించలేక΄ోతున్నాడని, ఆ అమ్మాయి తన మూడేళ్ల తమ్ముడికి దూరమవుతోందని, ఆ ఇంట్లో ఆమెకు తండ్రి తప్ప వేరే కుటుంబ సభ్యుల ప్రేమానురాగాలు, తోడు, అండ లాంటివేమీ లేవని.. ఇవన్నీ ఆ అమ్మాయి శారీరక, మానసిక ఆరోగ్యం మీద ప్రభావం చూపించి ఆమె పెరుగుదల కుంటుపడే ప్రమాదం ఉందని తండ్రికి ఇంటెరిమ్‌ కస్టడీని ఆదేశించింది. 

కూతురిని ఆ తండ్రి అల్టర్నేటివ్‌ వీకెండ్స్‌లో కలుసుకోవచ్చు. వారానికి రెండుసార్లు పిల్లలిద్దరితో వీడియోకాల్‌ మాట్లాడుకోవచ్చని చెప్పింది. ఎనిమిదేళ్ల వయసులో పిల్లలకు ఇంట్లో వండిన శుభ్రమైన ఆహారం, కుటుంబ వాతావరణం, తన ఈడు పిల్లల సహవాసం, ఇతర కుటుంబ సభ్యుల సాంగత్యం చాలా అవసరమని.. ఇవన్నీ పిల్లల శారీరక, మానసిక వికాసానికి దోహదపడేవనీ ఆ తీర్పులో సుప్రీంకోర్టు పేర్కొన్నది.

నిజమే కానీ..
ఏ కుటుంబంలో అయినా తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరికే పిల్లలు అత్యంత మాలిమిగా ఉంటారు. విడాకులు పొందిన అమ్మానాన్నల విషయంలోనూ ఇది వర్తిస్తుంది. తండ్రికి వంట రాకపోయినా.. అమ్మ అద్భుతంగా వంట చేసిపెట్టినా నాన్నంటేనే పిల్లలకు వల్లమాలిన ఇష్టం ఉండొచ్చు. ఏది కావాలని అడిగినా  క్షణాల్లో కొనిపెట్టే తండ్రి కన్నా ఏమీ కొనివ్వలేని అమ్మ ఆదరణ పిల్లలకు కొండంత అండగా అనిపించొచ్చు. తీర్పు సమయంలో కోర్టు వీటినీ పరిగణనలోకి తీసుకోవాలి కదా అని కొంతమంది న్యాయవాదుల వాదన. 

దీనికి ఇటీవల ‘వంట మనిషిని/పనిమనిషిని పెట్టుకుని పిల్లలను చూసుకోవడం తప్పేమీ కాదు’ అంటూ తల్లి దగ్గర్నుంచి పిల్లల కస్టడీ తండ్రికి ఇవ్వడం కుదరదని ముంబై హైకోర్టు ఇచ్చిన తీర్పును ఉదాహరణగా చూపిస్తున్నారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు.. కేరళ హైకోర్టు తీర్పును తిరస్కరిస్తూ ఇచ్చిన జడ్జిమెంట్‌లో తండ్రికి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ, ఇంట్లో ఎవరైనా పనివారిని పెట్టుకుని చూసుకోగలుగుతాడా లేదా అని చాన్స్‌ ఇవ్వకపోవడం కరెక్ట్‌ కాదు అంటున్నారు.

హైదరాబాద్‌ హైకోర్టులో.. 
ఈమధ్యే  హైదరాబాద్‌ ఫ్యామిలీ కోర్టు ఇద్దరు చిన్నారుల కస్టడీని ఎన్నారై తండ్రికి ఇచ్చింది. తల్లికి కోపం ఎక్కువ, ఆర్థిక వనరులు లేవు కాబట్టి పిల్లలు తల్లి దగ్గర ఉండటం శ్రేయస్కరం కాదని, ఈ నిర్ణయం తీసుకుంది కోర్టు. తండ్రి దగ్గర నానమ్మ, తాతయ్య కూడా ఉండటం, వారితో చిన్నారులకు అనుబంధం ఉండటం ఈ కేసులో తండ్రి పక్షాన తీర్పు రావడానికి మరో కారణమైంది. 

కేరళ కేసులో పిల్లల కస్టడీ తల్లికే ఇవ్వాలన్న సుప్రీంకోర్టు తీర్పులోనూ సుప్రీం కోర్టు తల్లికి సంబంధించి ఇలాగే ఆలోచించింది. ఆమె కూడా తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది కాబట్టి వాళ్ల సంరక్షణ, ఆప్యాయతానురాగాలు ఆ పిల్లలకు అందుతాయని, పైగా తల్లి వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌లో ఉండటం వల్ల రోజంతా పిల్లల్ని చూసుకోగలదని, పిల్లలకు ఇంటి భోజనం అందుతుందనే కారణాలన్నిటినీ పరిగణనలోకి తీసుకుంది. ఇంకో కేసులో.. తల్లి దగ్గరే పిల్లలున్నారు. తండ్రి ఆర్థికంగా ఉన్నవాడు. 

పిల్లల కస్టడీ తమకు కావాలంటే తమకు కావాలంటూ తల్లిదండ్రులిద్దరూ కేసులు వేశారు. ఇరువురి నేపథ్యాలూ పరిశీలించిన ఫ్యామిలీ కోర్టు పిల్లలు తల్లి దగ్గరే ఉండాలని తీర్పు ఇచ్చింది. పిల్లల అంగీకారంతో తండ్రి వీడియో కాల్‌లో మాట్లాడొచ్చని పేర్కొంది. ఆ పిల్లలకు పదేళ్లు నిండాయి. కనుక వాళ్లు చెప్పిన విషయాలను పరిగణించిన కోర్టు.. తండ్రి బాధ్యతారాహిత్యాన్ని ఎత్తిచూపుతూ పిల్లలు తండ్రి ఆధ్వర్యంలో ఉంటే చెడిపోయే ఆస్కారం ఉందని పేర్కొంది. 

పైన చెప్పిన రెండు అంశాలను పరిశీలీస్తే.. పిల్లలు ఎక్కడ సురక్షితంగా ఉంటారన్న దాన్నే కోర్టులు పరిగణిస్తాయి తప్ప పిల్లలపై హక్కు ఎవరికి ఉందన్నదాన్ని కాదని అర్థమవుతోంది. ఎనిమిదేళ్లు నిండిన పిల్లలు తామెవరి దగ్గర ఉండాలనుకుంటున్నారో జడ్జికి ప్రైవేటుగా వినిపించవచ్చు. వారి మానసిక పరిస్థితిని అంచనా వేసి నిర్ణయం తీసుకుంటారు న్యాయమూర్తి.

అస్త్రంగా మారే ప్రమాదం
తండ్రి దగ్గర పిల్లల మానసిక, శారీరక ఎదుగుదలకు కావల్సిన ఆహారం మొదలు సరైన కుటుంబ పరిస్థితులూ లేవంటూ పిల్లల కస్టడీని తిరస్కరించిన సుప్రీంకోర్టు తీర్పు ఆ కేస్‌ వరకు సమంజసమే. అయితే ఇది కొందరి చేతిలో అస్త్రంగా మారే ప్రమాదం ఉంది. గతంలో సుప్రీంకోర్టు తల్లిదండ్రులిద్దరి ప్రేమకు పిల్లలు అర్హులు, భార్యాభర్తలు విడిపోయినా పిల్లలకు మాత్రం ఇద్దరితోనూ సాన్నిహిత్యం కొనసాగేలా చర్యలు తీసుకోవాలంటూ ఇచ్చిన అనేక తీర్పులకిది భిన్నంగా ఉంది. 

అంతేకాదు స్త్రీ పురుషుల మధ్య భేదాలు, వారి అలవాట్లు, ఏయే పనులు ఎవరు చేయాలనే జెండర్‌ కోణంలో పితృస్వామ్య వ్యవస్థ స్థిరపరచిన పని విభజననూ బలపరుస్తున్నట్టుంది. అయితే పిల్లలు మానసికంగా, శారీరకంగా ఎవరి దగ్గర సురక్షితంగా ఉంటారు, పిల్లలకు అవసరమైన వనరులు ఎవరి దగ్గర ఎక్కువగా ఉన్నాయి, వాళ్లు తమ తల్లిదండ్రులలో ఎవరితో ఎక్కువ అటాచ్‌మెంట్‌తో ఉన్నారనే అంశాలు చైల్డ్‌ కస్టడీ ఎవరికివ్వాలనే తీర్పును నిర్దేశిస్తాయి. ఒక్కమాటలో ఇది పిల్లల హక్కు – తల్లిదండ్రుల హక్కు కాదు! 
– శ్రీకాంత్‌ చింతల, హైకోర్టు న్యాయవాది 

(చదవండి: నటి సమంత ఆరోగ్య చిట్కాలు.. డయాబెటిస్‌ పేషెంట్లు ఇలా చేశారంటే..)

 

Advertisement
 
Advertisement
Advertisement