డ్యాషింగ్‌ అడ్వైజర్‌

Jayati Ghosh Named By UN To Advisory Board On Economic-Social Affairs - Sakshi

సమితికి జయతి

ఐక్యరాజ్య సమితి అంటేనే హై లెవల్‌. అందులోని ‘హై లెవల్‌ అడ్వైజరీ బోర్డ్‌’ (హెచ్‌.ఎల్‌.ఎ.బి.) అంటే ఐక్యరాజ్య సమితి కన్నా హై లెవల్‌! సమితికి ఏ విషయంలోనైనా మార్గదర్శనం చేసేందుకు ఆ బోర్డులోని సభ్యులు తగిన సలహాలు, సూచనలు ఇవ్వగలిగిన మేధావులు, విద్యావంతులు అయి ఉంటారు. ఆ టీమ్‌లో తాజాగా భారతదేశ ఆర్థికవేత్త జయతీ ఘోష్‌కు స్థానం లభించింది! కొన్నాళ్లుగా యూఎస్‌లోనే మసాచుసెట్స్‌లో ఉంటున్నారు జయతి.

ఇప్పుడిక సలహా బృందంలో సభ్యురాలు అయ్యారు అట్నుంచటు విమానంలో అరగంట ప్రయాణదూరంలో ఉండే న్యూయార్క్‌లోని సమితి ప్రధాన కార్యాలయానికి త్వరలోనే ఆమె తన బుక్స్‌ సర్దుకుని వెళ్లబోతున్నారు. ఆ బుక్స్‌ దేశాల ఆర్థిక వ్యవస్థల్ని అర్థం చేసుకోడానికి జయతి అధ్యయనం చేస్తూ వస్తున్నవి మాత్రమే కాదు, జయతి రూపొందించిన వివిధ దేశాల అభివృద్ధి ప్రణాళికల సమగ్ర నివేదికలు కూడా. ప్రభుత్వాలకు అవి పరిష్కార సూచికలు.

ప్రస్తుతం ఆమ్‌హర్ట్స్‌లోని ‘యూనివర్సిటీ ఆఫ్‌ మసాచుసెట్స్‌’లో ఎకమిక్స్‌ ప్రొఫెసర్‌గా ఉన్నారు జయతి ఘోష్‌. అక్కడికి వెళ్లడానికి ముందు ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జె.ఎన్‌.యు.) లో 35 ఏళ్ల పాటు ఆర్థికశాస్త్రాచార్యులుగా ఆమె పని చేశారు. ఇప్పుడు సమితి సలహా బృందానికి ఆమె పేరును ప్రతిపాదించినది వేరెవరో కాదు. ఐక్యరాజ్యసమితిలోని ‘డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌ అండ్‌ సోషల్‌ అఫైర్స్‌’! జయతికి హ్యూమనిస్ట్‌ ర్యాడికల్‌ అనే పేరు ఉన్నప్పటికీ ఆ ర్యాడికల్‌ అనే పేరును పక్కన పెట్టి, ఆమెలోని హ్యూమనిస్టుని మాత్రం సమితి తీసుకున్నట్లుంది.

లేదా, దేశాల ఆర్థికస్థితిని మెరుగు పరిచి సామాజిక జీవనాలను సరళతరం చేయడానికి జయంతి సూచించే కఠినతరమైన ఆర్థిక వ్యూహాలను అనుసరించాలని నిశ్చయించుకుని ఉండొచ్చు. 2030 నాటికి ప్రపంచంలోని పేద దేశాలన్నీ శుభ్రమైన తిండి, బట్ట కలిగి ఉండాలని సమితి ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుంది. అందుకోసం రెండేళ్ల క్రితం ఎకనమిక్స్, సోషల్‌ అఫైర్స్‌ విభాగం ‘యు.ఎన్‌. హై–లెవల్‌ అడ్వయిజరీ బోర్డు’ను ఏర్పాటు చేసుకుంది. ఆ బోర్డు కాల పరిమితి రెండేళ్లు. అది పూర్తవడంతో ఇప్పుడు రెండో అడ్వయిజరీ బోర్టు అవసరమైంది. ఇందులో ఆర్థిక, సామాజిక అంశాలలో అంతర్జాతీయంగా నిపుణులు, అధ్యయనవేత్తలైన పలు రంగాల ప్రసిద్ధులు మొత్తం 20 మంది సభ్యులుగా ఉంటారు. వారిలో 65 ఏళ్ల జయతీ ఘోష్‌ ఒకరు.
∙∙
జె.ఎన్‌.యు.లో చదివి, జె.ఎన్‌.యు.లోనే పాఠాలు చెప్పారు జయతి. ఎకనమిక్స్‌లో ఎం.ఎ., ఎంఫిల్‌ ఆమె. పిహెచ్‌.డిని ఇంగ్లండ్‌లోని కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీలో చేశారు. సలహా బోర్డు సభ్యురాలుగా ఇక ఆమె ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటానియో గ్యుటెరస్‌కు వివిధ దేశాల వర్తమాన, భావి ఆర్థిక పరిస్థితులను మెరుగు పరిచేందుకు అవసరమైన ప్రణాళికా విధానాలను సూచించవలసి ఉంటుంది. అదేమీ ఆమెకు కష్టమైన సంగతి కాబోదు. ప్రజల్లో తిరిగిన మనిషి. విద్యార్థులతో కలిసిమెలిసి ఉన్న ప్రొఫెసర్‌. డెవలప్‌మెంట్‌ ఎకనమిస్ట్‌. ఆమె భర్త అభిజిత్‌ భారతదేశ ప్రణాళికా సంఘం మాజీ సభ్యులు. జయతి ఎప్పుడూ కూడా ప్రభుత్వాలవైపు లేరు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు పిడికిలి బిగించిన ప్రతి ఉద్యమంలోనూ జయతి నినాదం ఉంది. మొన్నటి ఢిల్లీ సి.ఎ.ఎ. అల్లర్లలో ప్రేరేపకులుగా పోలీస్‌లు దాఖలు చేసిన అనుబంధ చార్జిషీట్‌లో సీతారాం ఏచూరి, యోగేంద్ర యాదవ్‌ల పేర్లతో పాటు జయతి పేరు కూడా ఉంది. అలాగని ప్రభుత్వాలు ఆమెకు ఇవ్వవలసిన గుర్తింపును ఇవ్వకుండా ఏమీ లేవు. జెనీవాలోని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐ.ఎల్‌.ఓ.) 2010 లో ఆమెకు ‘డీసెంట్‌ వర్క్‌ రిసెర్చ్‌ ప్రైజ్‌’ను అందించింది. యు.ఎన్‌.డి.పి. ‘ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ ఎనాలిసిస్‌’ అవార్డును ప్రకటì ంచింది. సమితి సలహాదారుగా ఇప్పుడు ఆమెకు లభించించీ అవార్డులాంటి ప్రతిష్టే. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top