Hamsa Nandini Nanduri: కంటేనే అమ్మ అంటే ఎలా?.. దత్తత తీసుకున్నా అమ్మే..! | Increase Maternity Benefit from 12 weeks to 26 weeks for two surviving children | Sakshi
Sakshi News home page

Hamsa Nandini Nanduri: కంటేనే అమ్మ అంటే ఎలా?.. దత్తత తీసుకున్నా అమ్మే..!

Nov 11 2021 8:26 AM | Updated on Nov 11 2021 10:24 AM

 Increase Maternity Benefit from 12 weeks to 26 weeks for two surviving children - Sakshi

Hamsa Nandini Nanduri: Adopted Children Why Discriminate Against Me: జన్మనిస్తేనే తల్లా, దత్తత తీసుకుంటే తల్లికాదా? ఎందుకీ వివక్ష? జన్మనిచ్చినా, ఇవ్వకపోయినా పిల్లల్ని దత్తత తీసుకుని, తల్లి అయిన తరువాత ఆ చిన్నారుల ఆలనాపాలన చూడడంలో ఈ ఇద్దరు తల్లులు పడే ఆరాటం ఒకటే. అటువంటప్పుడు ప్రసూతి హక్కులను ఇద్దరికీ ఎందుకు సమానంగా కేటాయించట్లేదు? అని ప్రశ్నిస్తోంది హంసనందిని నండూరి. ప్రశ్నించడం దగ్గరే ఆగిపోకుండా నాలుగడుగులు ముందుకేసి ’వివక్ష లేకుండా తల్లులందరికీ ఒకేరకమైన హక్కులు కల్పించాలని, మెటర్నిటీ చట్టంలో మార్పులు తీసుకురావాలని సుప్రీంకోర్టులో సైతం పోరాటం చేస్తోంది. 

బెంగళూరుకు చెందిన హంసనందిని నండూరి దంపతులకు పెళ్లై ఐదేళ్లు అయినా సంతానం కలగకపోవడంతో పిల్లల్ని దత్తత తీసుకుందామని నిర్ణయించుకున్నారు. వెంటనే పిల్లల దత్తత కోసం దరఖాస్తు చేశారు. దరఖాస్తు చేసుకున్న ఏడునెలల్లోనే వారికి కాల్‌ వచ్చింది. దీంతో 2016లో కారా(సెంట్రల్‌ అడాప్షన్‌ రిసోర్సెస్‌ అథారిటీ) పద్ధతిలో ఇద్దరు పిల్లల్ని దత్తత తీసుకున్నారు. ఐదేళ్ల పాపని, రెండేళ్ల బాబుని దత్తత తీసుకున్నారు. 



పన్నెండు వారాలే..
పిల్లలిద్దరూ ఈశాన్య భారతదేశానికి చెందిన వారు కావడం, హిందీ మాత్రమే తెలిసి ఉండడంతో నందిని దంపతులకు పిల్లలకు దగ్గరవడం కాస్త కష్టమైంది. దీంతో నందిని తను పనిచేసే లాఫాంలో ప్రసూతి సెలవుకోసం దరఖాస్తు చేసుకుంది. మెటర్నిటీ బెనిఫిట్‌ యాక్ట్‌ –1961 ప్రకారం మూడు నెలల్లోపు పిల్లల్ని దత్తత తీసుకున్న తల్లులకు ఇచ్చే 12 వారాల ప్రసూతి సెలవును లా ఫామ్‌ మంజూరు చేసింది.

పన్నెండు వారాల్లో ఆ పిల్లలిద్దరికి దగ్గరవడం కష్టం. బిడ్డకు జన్మనిచ్చిన అమ్మలకు ఇచ్చినట్లే.. పిల్లల్ని దత్తత తీసుకున్న తల్లులకు కూడా 26 వారాల ప్రసూతి సెలవు అవసరమని హంసనందినికి అర్థమైంది. కానీ ఆ అవకాశం లేదు. దీంతో జీతం నష్టపోయినా పర్వాలేదనుకుని మరో మూడు నెలలు సెలవు తీసుకుని పిల్లలకు దగ్గరైంది. 



హార్ట్‌మామ్స్‌ నీడ్‌ లవ్‌..
‘‘ఏ తల్లికైనా అవే బాధ్యతలు ఉంటాయి. జన్మనిచ్చిన తల్లులకు, దత్తత తీసుకున్న తల్లులకు ఎందుకు ఈ వివక్ష. వారిలాగే దత్తత తీసుకున్న తల్లులకు మెటర్నిటీ బెనిఫిట్‌ యాక్ట్‌–1961 ప్రయోజనాలు చేకూరాలి. దత్తత తీసుకున్న తల్లులకు మెటర్నిటీ సెలవులు సమానం గా ఇవ్వాలి’’ అని ‘హార్ట్‌ మామ్స్‌ నీడ్‌ లవ్‌’ పేరిట ఛేంజ్‌ డాట్‌ ఓ ఆర్జీ పిటిషన్‌ వెబ్‌సైట్‌ను నడుపుతోంది. దీనిద్వారా పిల్లల్ని దత్తత తీసుకున్న తల్లులకు కూడా సాధారణ తల్లులకు వర్తించే ప్రసూతి హక్కులను కల్పించాలని పోరాటం చేస్తోంది.

‘‘పురిటి నొప్పులు అనుభవించనంత మాత్రాన దత్తత తల్లి తల్లి కాకుండా పోదు. నిజానికి జన్మనిచ్చిన తల్లుల కంటే దత్తత తీసుకున్న తల్లులు బిడ్డకు దగ్గరవ్వడానికి ఎక్కువ రోజులు పడుతుంది. అది నేను ప్రత్యక్షంగా అనుభవించాను. కొత్తగా వచ్చిన పిల్లలకి తల్లిదండ్రులుగా మానసికంగా, శారీరంగా వారిని దృఢపరచాలి. ఇవన్నీ చేయడానికి చాలా సహనంతో వ్యవహరించాల్సి ఉంటుంది.’’ అని చెబుతున్న నందిని ప్రస్తుతం ఓ కంపెనీ లీగల్‌ హెడ్‌గా పనిచేస్తోంది. సుప్రీంకోర్టు దృష్టికి ఆమె ఈ అంశాన్ని తీసుకెళ్లింది.
 
చట్టప్రకారం..
ఇటీవల హంసనందిని పిల్‌ను విచారణకు స్వీకరించిన అత్యున్నత ధర్మాసనం.. పిల్లల్ని దత్తత తీసుకున్న తల్లులకు మెటర్నిటీ చట్టం–1961 సెక్షన్‌ 5(4), రాజ్యాంగం పరంగా ఎందుకు అమలు కావడం లేదు? అన్న అంశాలపై నివేదిక ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.ఎంతోమంది తల్లుల ఆవేదనకు అక్షర రూపమే నందిని వాదన. తనకు ఆ సౌలభ్యం లేకపోయినప్పటికీ తనలాంటి వారెందరికో ఉపయోగపడుతుందని పోరాడుతోంది. సానుకూల తీర్పువస్తే ఎంతోమంది దత్తత తల్లులకు లాభం చేకూరుతుంది. 

చదవండి: వెంటాడే చిత్రాలు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement