నిద్దుర కరువైతే కష్టాలే!

Importance Of Sleep In Daily Life - Sakshi

జీవితమున సగభాగం నిద్దురకే సరిపోవు... అని సినీకవి చెప్పిన మాట గతంలో ఓకే కానీ, ప్రస్తుత బిజీ లైఫ్‌కు వర్తించదనేది కాదనలేని వాస్తవం. హడావుడి జీవితం, పోటీ ప్రపంచంలో మనుగడ సాధించేందుకు ప్రతి ఒక్కరూ రేయింబవళ్లు కష్టపడాల్సిందే! గతంలో కాయకష్టం చేసిన శరీరాలను నిద్ర తల్లి వెంటనే జోకొట్టేది, కానీ ప్రస్తుత లైఫ్‌స్టైల్‌లో శారీరక కష్టం చాలా తక్కువైంది. టెక్నాలజీ కారణంగా శరీరాలు సుఖమరిగాయి. దీంతో నిద్ర సరిగా రాకపోవడం, నిద్రలేమి సమస్యలు తలెత్తుతున్నాయి. కారణాలేవైనా, ఎక్కువ కాలం నిద్రలేమితో బాధపడేవారికి వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా ప్రతి వ్యక్తికి 8 గంటల కనీస నిద్ర అవసరం. చిన్నపిల్లలు, యువతకు 10 గంటల నిద్ర తప్పనిసరి. పైగా కరోనా రాకుండా కాపాడుకోవడానికి బలవర్థక ఆహారం ఎంతముఖ్యమో, కంటినిండా నిద్ర పోవడం కూడా  అంతే ముఖ్యమని సూచిస్తున్నారు. 

కంటి నిండా నిద్రకు చిట్కాలు 
దుష్ప్రభావాలనేకం
పెద్దవారిలో నిద్రలేమితో జ్ఞాపక శక్తి క్షీణిస్తుంది. నిద్రపోతున్న సమయంలో జ్ఞాపకాలను నిల్వచేసే ముఖ్యమైన మెదడు తరంగాలు ఉత్పత్తి అవుతాయి. ఇవి మెదడులోని హిప్పోకాంపస్‌ అనే భాగం నుంచి ప్రిఫ్రంటల్‌ కార్టెక్స్‌కు దీర్ఘకాలిక జ్ఞాపకాలను బదిలీ చేస్తాయి. నిద్రలేమితో ఈ మొత్తం ప్రక్రియకు ఆటంకం ఏర్పడుతుంది. సరిగా నిద్రలేకపోతే ఆకలి పెరిగి ఊబకాయానికి దారి తీస్తుంది. మనిషి ఆలోచనలు, కొత్త విషయాలు నేర్చుకునే సామర్థ్యంపై నిద్రలేమి తీవ్ర ప్రభావం చూపుతుంది. సరిపడినంత నిద్రలేకపోవడం వలన ఏ విషయంపైనా శ్రద్ధ పెట్టలేకపోవడం, చురుకుదనం తగ్గడం, ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలు ఎదురవుతాయి.

నిద్రలేమి సమస్య దీర్ఘకాలం కొనసాగితే నిరాశ, నిస్పృహ, ఆందోళన చుట్టుముడుతుంటాయి. ఫలితంగా శరీరంలో కార్టిసోల్‌ అనే స్ట్రెస్‌ హార్మోన్‌ అధిక మోతాదులో విడుదల అవుతుంది. ఇది చర్మసంరక్షణకు తోడ్పడే కొల్లాజెన్‌ను విచ్ఛిన్నం చేసి చర్మ సౌందర్యాన్ని కోల్పోయేలా చేస్తుంది. కేవలం శారీరక సమస్యలే కాకుండా పలు రకాల మానసిక సమస్యలు కూడా నిద్రలేమితో ఉత్పన్నమవుతాయి. శరీరానికి సరైన నిద్ర ఉంటే అది వివిధ జీవక్రియలను సమన్వయపరుస్తుంది, మంచి నిద్రలేకపోతే జీవక్రియలలో మార్పులు సంభవిస్తాయి, దీంతో వైరస్‌ల బారిన పడే అవకాశం పెరుగుతుందని లెనోక్స్‌ హిల్‌ హాస్పిటల్‌ సీనియర్‌ న్యూరో సైకాలజిస్ట్‌ పిహెచ్‌డి బ్రిటనీ లెమోండా తెలిపారు. 

క్రమబద్ధమైన దినచర్య
కోవిడ్‌ అనంతర కాలంలో ఎదురయిన సామాజిక పరిస్థితుల కారణంగా చాలా నెలలు అందరి దినచర్యలు మారిపోయాయి. ముఖ్యంగా ఉద్యోగస్థుల సమస్యలు పెరిగాయి, కొందరైతే ఉద్యోగాలు కోల్పోయారు, కొందరేమో వర్క్‌ ఫ్రం హోమ్‌కు పరిమితమయ్యారు. మరోవైపు విద్యార్థులు పాఠశాలలకు వెళ్లే పరిస్థితుల్లేక విద్యాసంవత్సరం ప్రశ్నార్థకంగా మారింది. తిరిగి ఇప్పుడు పరిస్థితులు సాధారణ స్థాయికి వస్తుండడంతో మరలా మునపటి జీవనశైలికి అలవాటు పడడం కష్టంగా అనిపిస్తుంటుంది. అయితే ఈ సమస్యలు కేవలం మన ఒక్కరికే పరిమితం కాదని, అందరూ ఎదుర్కొంటున్న సమస్యలని గుర్తించాలి. ఎప్పటికప్పుడు పరిస్థితులకనుగుణంగా దినచర్యను మార్చుకోవడం కన్నా, క్రమబద్ధమైన దినచర్య అంటే రోజూ ఒకే సమయానికి లేవడం, తినడం, పడుకోవడం వంటివి పాటిస్తే  ఒత్తిడి ప్రభావం ఉండదని కొలంబియా యూనివర్సిటీ మనస్తత్వ శాస్త్రవేత్త నవ్యాసింగ్‌ తెలిపారు.

అతి నిద్ర వద్దు
అతినిద్రాలోలుడు.. తెలివిలేని మూర్ఖుడు అన్నట్లు కోవిడ్, లాక్‌డౌన్‌ కారణంగా ఎప్పుడు పడితే అప్పుడు ఎంతసేపు కావాలంటే అంతసేపు నిద్రపోవడం చాలామందికి అలవాటైంది. కరోనా అనే కాకుండా, కొందరికి అతినిద్ర ఒక అలవాటుగా ఉంటుంది. అయితే ఇలాంటి దీర్ఘకాలిక నిద్ర అనర్ధదాయకమని సైంటిస్టులు చెబుతున్నారు. దీనివల్ల శరీర సహజసిద్ధ గడియారం (బయలాజికల్‌ క్లాక్‌) దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు.

బ్లూ లైట్‌ వాడొద్దు
నేటి తరం ఖాళీ సమయం దొరికితే ఫోన్‌లు, ల్యాపీల వద్ద సమయాన్ని ఎక్కువగా గడుపుతున్నారు. యంగ్‌ జనరేషన్‌తో పాటు పెద్దవారికి కూడా మొబైల్‌ వాడకం వ్యసనంగా మారింది. నిద్రపోయే ముందుకూడా మొబైల్స్‌ను ఉపయోగిస్తున్నారు. అయితే వీటిలో ఉండే బ్లూలైట్‌  కారణంగా కళ్ళు ఒత్తిడికి లోనవుతాయి. దీంతో కంటి నిండా నిద్ర ఉండదు. అందువల్ల పుస్తకాలు చదవడం, బ్లూలైట్‌ ప్రభావం తక్కువగా ఉన్న మొబైల్‌ను వాడటం మంచిది.

వ్యాయామం మరవద్దు
కరోనా కారణంగా చాలా రోజులపాటు వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌తో ఇంట్లోనే గడిపాం. దీనితో వ్యాయామం చేయడానికి కూడా కుదరలేదు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు కనుక కాస్త బద్దకంగా అనిపించినా.... జిమ్‌లో లేదా అందుబాటులో ఉన్న ఫిట్‌నెస్‌ సాధానాల ద్వారా రోజూ ఎక్సర్‌సైజ్‌ చేయాలి. వ్యాయమం చేయడం వలన శరీరంలోని అన్ని భాగాలకు రక్తసరఫరా జరిగి కొంత అలసట తీరి నిద్రకూడా బాగా పడుతుంది. అయితే పడుకునే ముందు ఎలాంటి వ్యాయామాలు చేయకూడదు. దీని వలన నిద్ర సరిగ్గా పట్టదు.

నో ఆల్కహాల్‌
చాలా మంది ఒత్తిడిని, ఆందోళనను అధిగమించడానికి, నిద్ర పట్టడానికి ఆల్కాహల్‌ తీసుకుంటారు. దీని వలన మంచి నిద్ర పడుతుందని, తర్వాతి రోజు దినచర్య బాగుంటుందని భ్రమపడతారు. కానీ ఒక మోతాదుకు మించి తాగితే, ఆల్కహాల్‌ వల్ల అదనపు సమస్యలు ఉత్పన్నమవుతాయని, వ్యాధినిరోధక శక్తిపై దుష్ప్రభావం చూపుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. అలాగే స్లీపింగ్‌ పిల్స్‌కు అలవాటు పడడం కూడా మంచిది కాదని సూచిస్తున్నారు.

సో.. ఆరోగ్యం బాగుండాలంటే కంటినిండా సరైన కునుకుండాలి, సరైన నిద్ర ఉండాలంటే శరీరాన్ని క్రమ పద్ధతిలో ఉంచాలి. లేదంటే నిద్రలేమితో స్టార్టయ్యే సమస్యలు ఎలా ముగుస్తాయో ఎవరం చెప్పలేము. బీకేర్‌ఫుల్‌! 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top