Syeda Falak: బరువు తగ్గడం కోసమే కరాటే క్లాసులో చేర్చారు... కట్‌చేస్తే!

Hyderabad woman to represent India at Asian Karate Championship - Sakshi

Syeda Falak: ఆకాశమే హద్దుగా...రేపు (డిసెంబర్‌ 17) మొదలయ్యే ‘ఆసియా కరాటే చాంపియన్‌షిప్‌’ పోటీలకు వేదిక కజకిస్థాన్‌. మధ్య ఆసియా దేశంలో జరిగే ఈ కరాటే పోటీలకు మనదేశం నుంచి ప్రాతినిధ్యం వహిస్తోంది సాయెదా ఫలక్‌. కరాటేలో 22 అంతర్జాతీయ పతకాలు, 20 జాతీయస్థాయి పతకాలను సాధించిన ఫలక్‌ ఈ రోజు కజకిస్థాన్‌కు బయలుదేరుతోంది. సాక్షితో మాట్లాడుతూ... భారత్‌కు మరో పతకాన్ని తీసుకు వస్తానని ఆత్మవిశ్వాసంతో చెప్పింది.

అంతా కాకతాళీయం
హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన సాయెదా ఫలక్‌ బీఏ పొలిటికల్‌ సైన్స్, ఎంఏ ఇంగ్లిష్‌ లిటరేచర్‌ తర్వాత ఇప్పుడు ఎల్‌ఎల్‌బీ చేస్తోంది. తన పన్నెండేళ్ల వయసులో కాకతాళీయంగా మొదలైన కరాటే ప్రాక్టీస్‌ తన జీవితంలో భాగమైపోయిందని చెప్పింది. ‘‘నేను సెవెన్త్‌ క్లాస్‌లో ఉండగా మా స్కూల్‌లో ఎక్స్‌ట్రా కరిక్యులర్‌ యాక్టివిటీస్‌లో భాగంగా కరాటేని పరిచయం చేశారు. నేను బొద్దుగా ఉండడంతో బరువు తగ్గడం కోసమే కరాటే క్లాసులో చేర్చారు. ప్రాక్టీస్‌ మొదలైన పదిరోజుల్లోనే ఇంటర్‌ స్కూల్‌ కాంపిటీషన్స్‌కి పేరు ఇచ్చేశారు మా స్కూల్‌ వాళ్లు. ఆ పోటీల్లో సిల్వర్‌ మెడల్‌ వచ్చింది. ఆ తర్వాత ఏడాదే బ్లాక్‌ బెల్ట్‌ వచ్చింది.

నా తొలి ఇంటర్నేషనల్‌ మెడల్‌ నేపాల్‌లో జరిగిన ఇంటర్నేషనల్‌ చాంపియన్‌షిప్‌లో వచ్చింది. అప్పుడు నాకు పదమూడేళ్లు. నిజానికి అప్పటి వరకు కరాటే పట్ల పెద్ద సీరియెస్‌గా లేను. కోచ్‌ చెప్పినట్లు ప్రాక్టీస్‌ చేయడం, అమ్మానాన్నలు పోటీలకు తీసుకువెళ్తే నా వంతుగా హండ్రెడ్‌ పర్సెంట్‌ పెర్‌ఫార్మెన్స్‌ ఇవ్వడం వరకే ఉండేది. స్కూల్‌లో, బంధువుల్లో నన్ను ప్రత్యేకంగా గుర్తించడం, నా ప్రతి సక్సెస్‌నీ మా అమ్మానాన్న సంతోషంగా ఆస్వాదించడం, మీడియాలో కథనాలు రావడం... వంటివన్నీ నన్ను బాగా ప్రభావితం చేశాయి. కరాటేతో ఐడెంటిఫై అవ్వడం కూడా అప్పటి నుంచే మొదలైంది’’ అని గుర్తు చేసుకుంది ఫలక్‌.

అడ్డంకులు లేవు
కరాటే ప్రాక్టీస్‌ చేయడానికి మతపరమైన నిబంధనలు తనకు అడ్డుకాలేదని చెప్తూ ‘‘నాకంటే ముందు మా అక్క అయ్మాన్‌ స్పోర్ట్స్‌ ప్రాక్టీస్‌లో ఉంది. మా అమ్మానాన్నలిద్దరూ విశాల దృక్పథం ఉన్నవాళ్లే. దాంతో ఏ ఇబ్బందీ రాలేదు. కానీ, అప్పట్లో ‘కరాటే అనేది మగవాళ్ల రంగం, అమ్మాయి కరాటే ప్రాక్టీస్‌ చేయడం ఎందుకు’ అనే భావన మాత్రం వ్యక్తమయ్యేది. అది పద్నాలుగేళ్ల కిందటి మాట. ఇప్పుడు అలాంటిదేమీ లేదు.

పైగా ఇది స్వీయరక్షణ సాధనం అని అందరూ గుర్తిస్తున్నారు. పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో షీ టీమ్‌తో కలిసి సెల్ఫ్‌ డిఫెన్స్‌ టెక్నిక్స్‌ వివరిస్తూ వీడియో చేశాను. మైనారిటీ రెసిడెన్షియల్‌ స్కూళ్లలో స్టూడెంట్స్‌కి కరాటే నేర్పిస్తున్నాను. పూర్తిస్థాయిలో కరాటే అకాడమీ స్థాపించి వీలయినంత ఎక్కువ మంది అమ్మాయిలకు స్వీయరక్షణ కోసం కరాటేలో శిక్షణ ఇవ్వాలనేది నా ఆకాంక్ష’’ అని చెప్పిందామె. మహిళలు ఇంటికే పరిమితం కాకుండా ప్రధాన స్రవంతిలో ఆకాశమే హద్దుగా దూసుకుపోవాలని కోరుకుంటోంది సాయెదా ఫలక్‌. ఫలక్‌ అంటే ఆకాశం అని అర్థం.

స్టార్‌ క్యాంపెయినర్‌
సాయెదా ఫలక్‌ తాను సాధించిన పతకాలను చూసుకుంటూ అన్నింటికంటే ఎక్కువ సంతోషాన్నిచ్చింది ‘యూఎస్‌ ఓపెన్‌ మెడల్‌’ అని 2016లో లాస్‌వేగాస్‌లో గెలుచుకున్న పతకాన్ని చూపించింది. క్రీడాకారిణిగా రాణిస్తున్న ఫలక్‌ అణగారిన వర్గాల మహిళల్లో చైతన్యం కలిగించడానికి రాజకీయరంగంలో అడుగుపెట్టి, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఎమ్‌ఐఎమ్‌ పార్టీకి స్టార్‌ క్యాంపెయినర్‌గా ప్రచారం చేసింది. ‘రాజకీయ రంగం అంటే మగవాళ్ల రంగం అనే భావన మహిళల్లో ఉందనే వాస్తవాన్ని ఆ ప్రచారం ద్వారానే తెలుసుకోగలిగాను. ఈ ధోరణిలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను’ అని చెప్పింది సాయెదా ఫలక్‌.

– వాకా మంజులారెడ్డి,
ఫొటోలు : అనిల్‌ కుమార్‌ మోర్ల

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top