Save Soil: మట్టి ప్రమాదంలో పడింది.. కాపాడుదాం!

Hyderabad Professor Jayalekha on Save Soil Campaign - Sakshi

మనిషి ఆకాశానికి నిచ్చెనలు వేశాడు. 
చంద్రమండలం మీద అడుగుపెట్టాడు. 
గ్రహాలన్నింటినీ అధ్యయనం చేస్తున్నాడు. 
ఆ గ్రహాల మీద నీరు... మట్టి కోసం అన్వేషిస్తున్నాడు. 
ప్రాణికోణి నివసించే అవకాశం ఉందా అని పరిశోధిస్తున్నాడు.  
భూమికి ఆవల ఏముందో తెలుసుకునే ప్రయత్నమిది. 
అయితే...  భూమి ఏమవుతుందోననే స్పృహను కోల్పోతున్నాడు. 
మన కాళ్ల కింద నేల ఉంది... ఆ నేల మట్టితో నిండినది. 
ఆ మట్టిని కాపాడుకున్నప్పుడే మనకు మనుగడ. 
‘మట్టి ప్రమాదంలో పడింది... మట్టి ఆరోగ్యాన్ని కాపాడుదాం’... 
... అని నినదిస్తున్నారు సేవ్‌ సాయిల్‌ యాక్టివిస్ట్‌ ప్రొఫెసర్‌ జయలేఖ. 

కేరళలో పుట్టి తెలుగు నేల మీద పెరిగిన ప్రొఫెసర్‌ జయలేఖ కెరీర్‌ అంతా హైదరాబాద్‌తోనే ముడివడింది. తండ్రి రైల్వే ఉద్యోగి కావడంతో ఆమె బాల్యం సికింద్రాబాద్‌లో గడిచింది. హైదరాబాద్‌ లోని రాజేంద్రనగర్‌లోని కాలేజ్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ లో జెనెటిక్స్‌ అండ్‌ ప్లాంట్‌ బ్రీడింగ్‌ కోర్సు చేశారు. తొలి ఉద్యోగం ఇక్రిశాట్‌లో. ఆ తర్వాత బేయర్‌ మల్టీనేషనల్‌ కంపెనీ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ విభాగంలో పనిచేశారామె. పెర్ల్‌ మిల్లెట్‌ బ్రీడర్‌గా రిటైర్‌ అయిన తర్వాత ఆమె పూర్తి స్థాయి సామాజిక కార్యకర్తగా సేవలందిస్తున్నారు. ఆమె చదువు, ఉద్యోగం, అభిరుచి, అభిలాష అంతా నేలతో మమైకమై ఉండడంతో ఆమె ఉద్యమం కూడా నేలతో ముడివడి సాగుతోంది. 


మట్టికోసం సాగుతున్న ‘సేవ్‌ సాయిల్‌ గ్లోబల్‌ మూవ్‌మెంట్‌’లో చురుకైన కార్యకర్త జయలేఖ. ఆమె సాక్షితో మాట్లాడుతూ... ‘నేలను కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైంద’న్నారు. ‘ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ద యునైటెడ్‌ నేషన్స్‌’ ప్రపంచాన్ని నిద్రలేపుతోంది. మట్టి ప్రమాదంలో పడిందని హెచ్చరిస్తోంది. వ్యవసాయ నేలల్లో 52 శాతం నిస్సారమైపోయాయని గణాంకాలు చెప్పింది. ఇప్పుడు కూడా మేల్కొనకపోతే 2050 నాటికి 90 శాతం నేల నిస్సారమవుతుందని, ప్రపంచం ఆకలి కేకలకు దగ్గరవుతుందని ‘యూఎన్‌సీసీడీ’ ఆందోళన చెందుతోంది. ఇప్పటికే వ్యవసాయ ఉత్పత్తులు 30 శాతం పడిపోయాయి. ఇప్పుడు కూడా ఉద్యమించకపోతే... నిర్లిప్తంగా ఉండిపోతే... ఇది నా సమస్య కాదు... ఇందులో నేను చేయాల్సింది ఏమీ లేదు... అని నిమ్మకు నీరెత్తినట్లు ఉంటే... వందేళ్లు మూల్యం చెల్లించాల్సి వస్తోందని కూడా చెప్తోంది. సేవ్‌ సాయిల్‌ సామాజికోద్యమం అలా పుట్టిందే’ అని వివరించారు జయలేఖ.  
  

చైతన్య యాత్ర 

పిచ్చుక అంతర్థానమైన తర్వాత పర్యావరణం గురించి ఆలోచించాం. కానీ మట్టి విషయంలో చేతులు కాలిన తర్వాత చేయగలిగిందేమీ ఉండదు. అందుకే ముందుగానే అప్రమత్తం కావాలి. మట్టి ప్రమాదంలో పడిందని ఇప్పటి వరకు తెలిసింది మేధావులకు మాత్రమే. ఈ వాస్తవం సామాన్యుడికి కూడా తెలియాలి. సామాన్యుల్లో చైతన్యం రావాలి. అందుకే ‘మట్టిని రక్షించు’ అని యాత్ర మొదలైంది. కాన్షియస్‌ ప్లానెట్‌ చొరవతో మొదలైన సేవ్‌ సాయిల్‌ థీమ్‌ ఇది. ఈశా ఫౌండేషన్, సద్గురు జగ్గీవాసుదేవ్‌ చేపట్టిన వంద రోజుల బైక్‌ యాత్ర మార్చి 21న లండన్‌లో మొదలైంది. మే నెల 29 నాటికి మనదేశంలోకి వచ్చిన సేవ్‌ సాయిల్‌ యాత్ర... ఐదు రాష్ట్రాలను చుట్టి ‘మట్టిని రక్షించు’ నినాదంతో ఈరోజు హైదరాబాద్‌కు చేరనుంది. ప్రజల్లో అవగాహన కల్పిస్తే ప్రభుత్వాల మీద ఒత్తిడి వస్తుంది. అప్పుడే ప్రభుత్వాలు తమ దేశంలో వాతావరణానికి, నేలతీరుకు అనుగుణంగా పాలసీలను రూపొందించడానికి ముందుకు వస్తాయి. అప్పుడే ఈ బృహత్తర కార్యక్రమం సఫలమవుతుంది. ఆ ఫలితం కోసమే మా ప్రయత్నం’’ అన్నారు జయలేఖ. 
– వాకా మంజులారెడ్డి


మట్టికి ఆక్సిజన్‌ అందాలి 

మట్టి చచ్చిపోతోంది... చెట్టు ఎండిపోతోంది. మనిషి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడాల్సిన స్థితి. మట్టి సారం కోల్పోతే సంభవించే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయంటే... ఆహార కొరత, నీటి కొరత, జీవ వైవిధ్యత నశించడం, వాతావరణంలో పెనుమార్పులు, జీవన భద్రత కోల్పోవడం, పొట్ట చేత పట్టుకుని వలసలు పోవడం వంటివన్నీ భవిష్యత్తు మానవుడికి సవాళ్లవుతాయి. ఎంత తెలుసుకున్నప్పటికీ చేయగలిగిందేమిటనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. జీవం కోల్పోతున్న మట్టికి జవజీవాలనందివ్వాలి. వ్యవసాయ నేలలో ఏటా తప్పనిసరిగా యానిమల్‌ వేస్ట్, ప్లాంట్‌ డెబ్రిస్‌ ఇంకిపోవాలి. నేలను బీడు పెట్టకూడదు. చెట్టు పచ్చగా ఉంటే నేల చల్లగా ఉంటుంది. నేల సారవంతంగా ఉంటే చెట్టు ఏపుగా పెరుగుతుంది. ఈ రెండూ గాడిలో ఉన్నప్పుడే మనిషి విశ్వాన్ని జయించగలిగేది. (క్లిక్‌: మీరూ మీ ఇల్లూ వానలకు రెడీయేనా?)


మట్టికి ఏమైంది? 

మట్టిలో ఉండాల్సిన మైక్రో ఆర్గానిజమ్స్‌ నశించిపోతున్నాయి. అంటే మట్టిలో ఉండాల్సిన జీవం నిర్జీవం అవుతోంది. దాంతో మట్టిలోని సారం నిస్సారమవుంది. ఈ ఉపద్రవంలో కూడా అగ్రరాజ్యం అమెరికా పాత్ర తొలిస్థానంలో ఉంది. ప్రమాదం ఎంత తీవ్రస్థాయిలో ఉందనేది మనకు తెలియడం లేదు. కానీ ఇది భూగోళానికి మొదటి ప్రమాద హెచ్చరిక వంటిది. నేలలో సేంద్రియ పదార్థాల స్థాయి మూడు నుంచి ఆరుశాతం ఉండాలి. అలాంటిది యూరోపియన్‌ దేశాల్లో రెండు శాతానికి పడిపోయింది. మన దేశంలో అయితే 0.5 శాతమే ఉంది. ఆఫ్రికాదేశాల్లో మరీ అధ్వాన్నంగా 0.3 శాతం ఉంది. ఇలాంటి గణాంకాలు, నివేదికలు తెలిసిన వెంటనే ఇందుకు రసాయన ఎరువుల వాడకమే కారణం అంటూ... రైతును నిందిస్తుంటారు. అది పూర్తిగా తప్పు. వరదల కారణంగా భూమి కోతకు గురికావడం, అవగాహన లేక పంటలను మార్చకుండా ఒకే పంటను మళ్లీ మళ్లీ వేయడం... భూమిని బీడుగా వదిలేయడం వంటి అనేక కారణాల్లో రసాయన ఎరువులు ఒక కారణం మాత్రమే. అలాగే ఊరికి ఒకరో ఇద్దరో రైతులు ముందడుగు వేస్తే సరిపోదు. ప్రభుత్వాలు ముందుకు వచ్చి పాలసీలు రూపొందించాలి.
  
– ప్రొఫెసర్‌ ఎ.కె. జయలేఖ, పర్యావరణ పరిరక్షణ ఉద్యమకారిణి, 
savesoil.org

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top