ప్రెగ్నెన్సీ టైంలో శరీరమంతా దురదలు వస్తాయా..? | Health Tips: Pregnancy Itching: Causes Treatments, and Signs of | Sakshi
Sakshi News home page

ప్రెగ్నెన్సీ టైంలో శరీరమంతా దురదలు వస్తాయా..?

Mar 22 2026 3:04 PM | Updated on Mar 22 2026 4:15 PM

Health Tips: Pregnancy Itching: Causes Treatments, and Signs of

నేను ఎనిమిదో నెల గర్భిణిని. రెండు రోజులుగా శరీరం అంతా కొద్దిగా దురదగా ఉంటోంది. ఇది ఏమైనా సమస్యా? ఏమి చేయాలి?
– రమ్య, గుంటూరు.

సాధారణంగా 30 నుంచి 32 వారాల గర్భధారణలో, ముఖ్యంగా మొదటి గర్భం సమయంలో, కొంతమందికి శరీరం మీద దురదలు రావచ్చు. ఇలాంటి సమయంలో ముందుగా కొన్ని వివరాలు తెలుసుకోవడం అవసరం. దురదలు శరీరం అంతా ఉన్నాయా లేక అరికాళ్లు, అరిచేతుల్లో మాత్రమే ఉన్నాయా అని తెలుసుకోవాలి. అలాగే పగలు ఎక్కువగా ఉంటాయా, రాత్రి ఎక్కువగా ఉంటాయా అన్నది చూడాలి. కొంతమందికి దురదలు ఎక్కువగా ఉండి నిద్ర కూడా డిస్టర్బ్‌ అవుతుంది. 

కాబట్టి ఇవి మైల్డ్‌గా ఉన్నాయా లేక తీవ్రమైనవా అన్నది అంచనా వేయాలి. ఇలాంటి సందర్భంలో తల్లి ఆరోగ్య పరిస్థితిని కూడా పరీక్షిస్తారు. రక్తపోటు వంటి ముఖ్యమైన అంశాలను పరీక్షిస్తారు. అలాగే బిడ్డ బాగున్నాడా లేదా అన్నది తెలుసుకోవడం కూడా ముఖ్యమే. అవసరమైతే అల్ట్రాసౌండ్‌ స్కాన్‌  చేసి, డాప్లర్‌ పరీక్ష ద్వారా బిడ్డ బరువు, గర్భంలో ఉన్న ఉమ్మనీరు పరిమాణం, బిడ్డకు రక్తప్రవాహం ఎలా ఉందో పరీక్షిస్తారు. దురదలు తేలికగా ఉంటే సాధారణంగా యాంటీహిస్టమిన్‌  మందు, చర్మానికి రాసుకునే లోషన్‌ లేదా మాయిశ్చరైజర్‌ ఇచ్చి రెండు రోజులు పరిశీలిస్తారు. 

చాలాసార్లు ఇవి తీసుకుంటే సమస్య తగ్గిపోతుంది. అయితే దురదలు ఎక్కువగా ఉన్నా లేదా మందులతో రెండు రోజులలో తగ్గకపోవడం జరిగినా పరీక్షలు చేయాలి. ముఖ్యంగా సీరమ్‌ బైల్‌ యాసిడ్స్, లివర్‌ ఫంక్షన్‌  టెస్టులు చేసి ఆబ్‌స్టెట్రిక్‌ కొలెస్టాసిస్‌ అనే సమస్య ఉందా లేదా చూడాలి. ఈ పరిస్థితిలో బైల్‌ యాసిడ్స్‌ పెరగడం వల్ల గర్భిణికి ఎక్కువగా దురదలు రావచ్చు. అలా ఉంటే దానికి ప్రత్యేకమైన మందులు అందుబాటులో ఉన్నాయి. సరైన చికిత్స తీసుకుంటే దురదలు తగ్గి బిడ్డ ఎదుగుదల కూడా సాధారణంగా కొనసాగుతుంది. 

ఇలాంటి పరిస్థితుల్లో గర్భధారణ కాలంలో, ముఖ్యంగా 38 వారాల వరకు లివర్‌ ఫంక్షన్‌ టెస్టులు, బైల్‌ యాసిడ్స్‌ పరీక్షలు తరచూ చేయించు కోవాలి. సాధారణంగా 38 వారాలు వచ్చిన తర్వాత డెలివరీ చేయడం సురక్షితంగా భావిస్తారు. ఎందుకంటే ఆబ్‌స్టెట్రిక్‌ కొలెస్టాసిస్‌ ఉన్నప్పుడు 38 వారాల కల్లా డెలివరీ చేస్తే తల్లీబిడ్డలు ఇద్దరికీ మంచిది.

నాకు నలభై నాలుగు సంవత్సరాలు. ఇద్దరు పిల్లలు ఉన్నారు. పిల్లలు కాకుండా శస్త్రచికిత్స కూడా చేయించుకున్నాను. అయితే, గత నాలుగు నుంచి ఆరు నెలలుగా నెలసరిలో చాలా ఎక్కువగా రక్తస్రావం అవుతోంది. ఇది ఎందుకు జరుగుతోంది? ఏమి చేయాలి?
– లక్ష్మీ దేవి, కర్నూలు.

ఇలాంటి సమస్యతో వచ్చినప్పుడు ముందుగా రోగి డీటెయిల్డ్‌ హిస్టరీ తెలుసుకోవాలి. సైకిల్‌ రెగ్యులర్‌గా ఉన్నా రక్తస్రావం మూడు నుంచి నాలుగు రోజులు మాత్రమే ఉందా, లేక ఏడు రోజులు లేదా పది రోజులకంటే ఎక్కువ కొనసాగుతుందా అన్నది తెలుసుకోవాలి. అలాగే రోజుకు ఎన్ని ప్యాడ్లు మార్చాల్సి వస్తోంది, రాత్రిపూట కూడా లేచి మార్చాల్సి వస్తుందా, గడ్డలు పడుతున్నాయా, కడుపునొప్పి ఉందా వంటి వివరాలు కూడా తెలుసుకోవాలి. 

నలభై నాలుగు ఏళ్ల వయసు పెరిమెనోపాజ్‌ దశకు దగ్గరగా ఉండే వయసు కాబట్టి ఇలాంటి బ్లీడింగ్‌ ఎందుకు అవుతోంది అన్నది పరీక్షల ద్వారా తెలుసుకోవాలి. అందుకోసం హిమోగ్లోబిన్‌ , సీబీపీ, థైరాయిడ్‌ హార్మోన్‌ పరీక్షలు, అలాగే మధుమేహానికి సంబంధించిన కొన్ని పరీక్షలు చేస్తారు. 

అదనంగా అల్ట్రాసౌండ్‌ స్కాన్‌  తప్పనిసరిగా చేస్తారు. స్కాన్‌లో గర్భసంచిలో ఫైబ్రాయిడ్‌ గడ్డలు ఉన్నాయా, ఒవేరియన్‌  సిస్టులు ఉన్నాయా, లేదా ఎడినోమయోసిస్‌ వంటి సమస్యలు ఉన్నాయా అన్నది పరిశీలిస్తారు. ఇవి లేకపోయినా బ్లీడింగ్‌ ఎక్కువగా ఉంటే గర్భసంచి పొర మందం, అంటే ఎండోమెట్రియల్‌ థిక్నెస్‌ ఎంత ఉందో చూస్తారు. ప్రాథమికంగా రక్తస్రావం తగ్గించడానికి నాన్‌ హార్మోనల్‌ మందులు ఇస్తారు. 

హార్మోనల్‌ చికిత్స ప్రారంభించే ముందు బ్లీడింగ్‌కి కారణమేమిటో కచ్చితంగా తెలుసుకోవాలి. ఫైబ్రాయిడ్‌లు లేదా ఇతర సమస్యలు లేకపోయినా బ్లీడింగ్‌ ఎక్కువగా ఉంటే హిస్ట్రోస్కోపీ గైడెడ్‌ ఎండోమెట్రియల్‌ బయోప్సీ చేస్తారు. హిస్ట్రోస్కోపీ ద్వారా గర్భసంచి లోపల పరిస్థితిని నేరుగా చూసి, అక్కడి నుంచి చిన్న టిష్యూ నమూనా తీసి పరీక్షకు పంపడం. 

దీనివల్ల హార్మోన్‌ మార్పులు ఉన్నాయా లేదా కేన్సర్‌కు సంబంధించిన మార్పులు ఉన్నాయా అన్నది తెలుసుకోవచ్చు. ఈ పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాత, నాన్‌ హార్మోనల్‌ మందులతో సమస్య తగ్గకపోతే హార్మోనల్‌ చికిత్స ఇవ్వచ్చు. ఇది మాత్రల రూపంలో ఇవ్వొచ్చు. మరో విధానం గర్భసంచి లోపల పెట్టే ప్రత్యేక పరికరం. ఇది కాపర్‌ టీ లాంటిదే కానీ ఇందులో హార్మో  నెమ్మదిగా విడుదల అవుతుంది. దీనిని పెట్టిన తర్వాత దాదాపు ఐదు సంవత్సరాల వరకు పనిచేస్తుంది. దీని వల్ల నెలసరి క్రమంగా రావడం, రక్తస్రావం తగ్గడం, రోజువారీ జీవన నాణ్యత మెరుగుపడడం సాధ్యమవుతుంది. 
                      ∙
డా. కె. అపర్ణ 
సీనియర్‌ గైనకాలజిస్ట్, అబ్‌స్టెట్రీషియన్, ల్యాపరోస్కోపిక్‌ సర్జన్, సికింద్రాబాద్‌ 

(చదవండి: పక్షవాతానికి వార్నింగ్‌ బెల్‌..!)

Advertisement
 
Advertisement
Advertisement