పాలిచ్చే తల్లులూ.. ఆ జాగ్రత్తలు తప్పనిసరి..! | Postpartum Care Guide, Key Health Issues And Essential Tips For New Mothers, Check Out Full Story Inside | Sakshi
Sakshi News home page

పాలిచ్చే తల్లులూ.. ఆ జాగ్రత్తలు తప్పనిసరి..! హెచ్చరిస్తున్న వైద్యులు

May 5 2026 5:19 PM | Updated on May 5 2026 6:38 PM

Health Tips: Pregnancy, Childbirth, Postpartum and Newborn Care

గర్భవతిగా ఉన్నప్పుడు మహిళలో ఎన్నో మార్పులుచోటు చేసుకుంటాయి. అవి శారీరకమైనవీ, మానసికమైనవికూడా. అయితే... ప్రసవం తర్వాత అవన్నీ వెంటనే ఒకేరోజులో సాధారణస్థితికి రావు. ప్రసవం తర్వాత ఓ మహిళమళ్లీ మామూలు స్థితికి రావాలంటే కొంత ప్రత్యేక శ్రద్ధ, మరికొన్ని బాధ్యతలు తప్పనిసరి. ఇక కాన్పు తర్వాత చాలా మంది మహిళలు తమకు పుట్టిన బిడ్డ గురించి శ్రద్ధ తీసుకుంటారు తప్ప తమ ఆరోగ్యం గురించి పెద్దగా పట్టించుకోరు. కాన్పు తర్వాత మహిళలు...తమ బిడ్డ విషయంలోనే కాకుండా తన కోసం కూడా కొంత వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాలి. ఆ టైమ్‌లో బాలింతకు వచ్చే కొన్ని సమస్యలూ... వాటికి తీసుకోవాల్సిన పరిష్కారాలను తెలుసుకుని ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులూ తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో చూద్దాం...

గర్భం దాల్చినప్పుడు మామూలుగా మూడు అంగుళాల పొడవు ఉండే గర్భాశయం... దాదాపు 20 అంగుళాల పొడవుండే శిశువును తనలో ఇముడ్చుకునేంత పెద్దదిగా సాగుతుంది. కాన్పు తర్వాత అదే గర్భాశయం మెల్లమెల్లగా సైజు తగ్గుతూపోతూ ఆరువారాలకు తన మొదటి స్థితిని చేరుతుంది.  కాన్పు తర్వాత వారం రోజుల వరకు బొడ్డు కింది భాగంలో గర్భాశయం గట్టిగా స్పర్శకు తెలుస్తుంటుంది.  

గర్భిణిగా ఉన్న సమయంలో లోపల గర్భాశయంతో పాటు బయట పొట్ట కండరాలూ  బాగా సాగుతాయి. ఫలితంగా కాన్పు తర్వాత కూడా పొట్ట వదులుగా కిందికి జారినట్లుగా కనిపిస్తుండవచ్చు. నడుము కండరాలు, ప్రసవమార్గంలోని కండరాలు, ఎముకలు సాగి బలహీనంగా మారతాయి. బరువు పెరగడం వల్ల, పొట్ట మీది చర్మం సాగడం వల్ల కొందరిలో చర్మంపై తెల్లటి లేదా ఎర్రటి లేదా నల్లటి చారికలు (స్ట్రెచ్‌మార్క్స్‌) ఏర్పడవచ్చు. ఇవన్నీ కాస్మటిక్‌గా మహిళలకు కొంత ఇబ్బందికరంగా కనిపించవచ్చు. 

ఈ స్ట్రెచ్‌మార్క్స్‌ నివారణ కోసం: పొట్ట మీద, తొడల మీద ఉండే చర్మం సాగి, చిట్లడం వల్ల వచ్చే స్ట్రెచ్‌మార్క్స్‌ పూర్తిగా పోవడానికి గాని, అస్సలే రాకుండా ఉండటానికి ఎలాంటి మందులూ, క్రీములు ఉండవు. ఆలివ్‌ ఆయిల్, విటమిన్‌–ఈ, కొన్ని మాయిశ్చరైజర్స్‌ వంటి వాటిని గర్భవతిగా ఉన్నప్పటినుంచే పొట్ట, తొడల మీద రాసుకోవడం వల్ల చర్మం మెత్తబడి సాగడానికి వీలుగా ఉంటుంది. దురదలు రావు. కాబట్టి దీనివల్ల స్ట్రెచ్‌మార్క్స్‌ నివారణ కొంతవరకు సాధ్యమవుతుంది.  

ప్రసవం అయిన తర్వాత మహిళ (బాలింత)లో  కొన్ని రకాల సమస్యలు / ఆరోగ్య సమస్యలు 
కనిపించవచ్చు. అవి... 

బాలింత జ్వరం : కాన్పు తర్వాత కొందరు మహిళల్లో ఒళ్లు కొంచెం వేడిగా ఉంటూ, తర్వాత మామూలుగా అవుతుంటుంది. కొంతమందిలో మాత్రం కాన్పు తర్వాత 24 గంటల నుంచి 10 రోజుల్లోపు 100 డిగ్రీల కంటే ఎక్కువగా వచ్చే జ్వరాన్ని బాలింత జ్వరం అంటారు. దీనికి ఎన్నో కారణాలు ఉండవచ్చు. 

పరిష్కారం : కోల్డ్‌ స్పాంజింగ్‌తోనే చాలావరకు జ్వరం తగ్గిపోతుంది. అయితే ఏదైనా నిర్దిష్ట కారణం వల్ల జ్వరం వచ్చినట్లు డాక్టర్లు గుర్తిస్తే... ఆ కారణాన్ని బట్టి డాక్టర్లు మందులు సూచిస్తారు.

బాలింత జ్వరాలకు కొన్ని కారణాలు... 
జననాంగాల్లో ఇన్ఫెక్షన్‌ : రక్తహీనత, వ్యక్తిగత పరిశుభ్రత లోపం, కాన్పు సమయంలో తగినంత శుభ్రత పాటించకపోవడం, రోగకారకక్రిములు జననాంగంలో ప్రవేశించడం, గర్భాశయంలో ఏమైనా మాయ ముక్కలు ఉండిపోవడం వంటి ఎన్నో కారణాల వల్ల జననాంగాల్లో ఇన్ఫెక్షన్‌ వచ్చి బాలింత జ్వరం రావచ్చు. 

పరిష్కారం : డాక్టర్లు సూచించిన యాంటీబయాటిక్స్‌ వాడాలి. 

రొమ్ముల్లో ఇన్ఫెక్షన్స్‌ : కొత్తగా తల్లి అయిన మహిళ తన బిడ్డకు పాలు సక్రమంగా పట్టకపోవడం, నిపుల్స్‌ సరిగా లేకపోవడం, రొమ్ముల్ని సరిగా ఖాళీ చేయకపోవడంతో  పాలు లోపలే గడ్డకట్టి రొమ్ముల్లో ఇన్పెక్షన్‌ రావచ్చు. రొమ్ముపై ఏవైనా పగుళ్లు ఏర్పడితే, వాటి ద్వారా తల్లి దేహంలోకి రోగక్రిములు చేరవచ్చు. అలాగే బిడ్డ నోటిలో పూత ఉన్నా రోగక్రిములు రొమ్ముల్లోకి పాకి అది తల్లిలో ఇన్ఫెక్షన్‌కు దారితీయవచ్చు. ఈ సమయంలో నిర్లక్ష్యం చేస్తే రొమ్ముల్లో చీముగడ్డలు ఏర్పడవచ్చు. 

పరిష్కారం: డాక్టర్‌ సలహా మేరకు తగిన మందులు తీసుకుంటూ, వైద్యులు సూచించే జాగ్రత్తలు పాటించాలి.

జ్వరాలకు మరికొన్ని కారణాలు : 

సిజేరియన్‌ ఆపరేషన్‌ చేయించుకున్నప్పుడు వేసే కుట్లలో చీము పట్టడం 

మలేరియా, టైఫాయిడ్, నిమోనియా వంటి బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్స్‌ సోకే ముప్పు 

ఇన్ఫెక్షన్స్‌ని అశ్రద్ధ చేస్తే అవి రక్తం ద్వారా దేహమంతటా పాకి కొంత ప్రమాదాలకు తావిచ్చే అవకాశం. 

పరిష్కారం : కారణాలను బట్టి తగిన మందులు ఇవ్వడం, ఆ మేరకు బాలింత తగిన జాగ్రత్తలు పాటించేలా కుటుంబ సభ్యులు చూసుకోవాలి. 

నొప్పులు : కాన్పు తర్వాత కొందరిలో వెన్ను, తొడలు, పిరుదుల దగ్గర నొప్పులు రావచ్చు. కొందరిలో అవి మరీ ఎక్కువగానూ ఉండవచ్చు. గర్భాశయం బరువు మొత్తం వెన్నుపూసపై పడటం వల్లా, అలాగే కండరాలు సాగి మునపటి బలం కొద్దిగా  తగ్గడం వల్ల కూడా వెన్నునొప్పి రావచ్చు. 

కొన్నిసార్లు కాన్పుకి ఎక్కువ సమయం పట్టినా, లేదా కాన్పు కష్టంకావడంతో ఫోర్సెప్‌ సహాయంతో కాన్పు జరిపినప్పుడు, వెన్పుపూస కింది భాగంలోని నరాలపై ఒత్తిడి పడి కొంతమందిలో కాన్పు తర్వాత కాళ్లు కదల్చలేకపోవడం, స్పర్శ తగ్గడం వంటివీ కనిపించవచ్చు. 

పరిష్కారం : వీటిని గురించి పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. వీటిలో చాలావరకు డాక్టర్ల సలహాలూ, మందులతోనూ లేదా ఇవన్నీ కొద్దిపాటి ఫిజియోథెరపీతో తగ్గిపోయే సమస్యలే. 

మూత్రసమస్యలు : కాన్పు తర్వాత మూత్రాశయానికి చేరే నరాలు కొన్నిసార్లు ఒత్తిడికి గురవుతాయి. దీనివల్ల మూత్రం పూర్తిగా ఖాళీ చేయలేకపోవడం వంటి సమస్య కనిపించవచ్చు.అలాగే మూత్రాన్ని ఎక్కువసేపు పట్టి ఉంచడం వల్ల మూత్రాశయ ఇన్ఫెక్షన్‌ (యూరినరీ ఇన్ఫెక్షన్స్‌) వచ్చే అవకాశాలు ఉంటాయి. 

కాన్పు తర్వాత ఉండే  నొప్పి వల్ల కూడా మూత్ర విసర్జన పూర్తిగా సాధ్యపడకపోవచ్చు. తగినంత నీరు తాగకపోవడం వల్ల, జననాంగాల నుంచి మూత్రవ్యవస్థకూ ఇన్ఫెక్షన్‌ పాకవచ్చు. కొంతమందిలో కొన్ని రోజులపాటు మూత్ర విసర్జనపై నియంత్రణ కోల్పోయే ముప్పు కూడా ఉంది. 

పరిష్కారం : ఈ సమస్యలు తగ్గడానికి పెల్విక్‌ఫ్లోర్‌ వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. 

మలబద్దకం : కాన్పు తర్వాత మహిళలకు పెద్దగా నీరు తాగకపోవడం, సరిగ్గా ఆహారం తీసుకోకపోవడం వల్ల కొంతమందిలో మలబద్దకం ఏర్పడవచ్చు. 

పరిష్కారం : తగినన్ని నీళ్లు తాగడం, ద్రవాహారం తీసుకోవడంతో పాటు ఆకుకూరలూ, కాయగూరలతో ఉన్న పోషకాహారం తీసుకోవడం వల్ల ఈ సమస్య తగ్గిపోతుంది. సమస్య తీవ్రత మరింత ఎక్కువగా ఉంటే డాక్టర్‌ సలహా మేరకు చాలా కొద్దికాలం పాటు మందులు వాడాల్సి రావచ్చు. 

రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం :  
గర్భవతిలో కాన్పు తర్వాత జరిగే రక్తస్రావాన్ని ఆపడం కోసం రక్తం గడ్డ కట్టడానికి అవసరమైన పదార్థాలు (ఫ్యాక్టర్లు) ఎక్కువగా తయారయ్యేలా ప్రకృతి తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. అయితే కొంతమందిలో (బరువు ఎక్కువగా ఉన్నవారు, హైబీపీతో బాధపడేవారు, ఎక్కువ వయసున్న వారిలో) కాన్పు తర్వాత వారం నుంచి పది రోజుల వరకు ఈ పదార్థాల వల్ల రక్తం గడ్డకట్టి, ఆ గడ్డలు రక్తరాళాల ద్వారా వేరే చోట్లకు పాకి సాధారణ రక్తప్రసరణకు అడ్డుగా మారే (ఎంబాలిజమ్‌) ముప్పు ఉంటుంది. 

ఉదాహరణకు... కొందరిలో ఇలాంటి రక్తం గడ్డలు ఊపిరితిత్తులకు వెళ్లే రక్తనాళాల్లోకి వెళ్లి రక్తప్రసరణకు ఆటంకం కలిగిస్తే... అకస్మాత్తుగా ఊపిరి అందక ప్రాణాలకే ముప్పు కలిగే అవకాశమూ లేకపోలేదు. ఈ కండిషన్‌ను ‘పల్మునరీ ఎంబాలిజమ్‌’ అంటారు. 

పరిష్కారం : కాన్పు తర్వాత ఎక్కువగా కదలకుండా పడుకుని ఉండేవారిలో ఈ సమస్య ఎక్కువ. డాక్టర్‌ సలహా మేరకు చురుగ్గా ఉండటం అవసరం.  

తీవ్రమైన రక్తస్రావం : కాన్పు తర్వాత కొంతసేపు సాధారణంగా 200 ఎంఎల్‌ నుంచి 500 ఎంఎల్‌ వరకు రక్తస్రావం అవుతుండటం మామూలే. అంతకంటే ఎక్కువగా రక్తస్రావం అయితే ఆ కండిషన్‌ను పోస్ట్‌పార్టమ్‌ హేమరేజ్‌ (పీపీహెచ్‌) అంటారు. 

పీపీహెచ్‌ను మొదటే నియంత్రించకపోతే, దాదాపు 25 శాతం మందిలో ప్రాణాలకు ముప్పు ఉండే ప్రమాదముంటుంది. దాదాపు 90 శాతం పీపీహెచ్‌ కేసుల్లో గర్భాశయం ముడుచుకుపోవడం (యుటరైన్‌ ఎటోనీ) వల్ల బ్లీడింగ్‌ జరుగుతుంది. కొంతమందిలో గర్భాశయ ముఖద్వారం (సర్విక్స్‌) చీరుకుపోవడం వల్ల, మరికొందరిలో గర్భాశయం లోపల మాయముక్కలు ఉండిపోవడం, రక్తం గూడుకట్టుకునే స్వభావంలో లోపాలు కూడా పీపీహెచ్‌కు కారణం కావచ్చు.

పరిష్కారం : ఇలాంటి సందర్భాల్లో కారణాన్ని బట్టి చికిత్సతో పాటు... అవసరాన్ని బట్టి రక్తం ఎక్కించాల్సిన రావచ్చు. రక్తస్రావం ఎంతకీ నియంత్రణలోకి రాకపోతే కొందరిలో గర్భసంచి తొలగించాల్సిరావచ్చు. 

రక్తహీనత : అధిక రక్తస్రావం కావడం లేదా ముందు నుంచే రక్తహీనత ఉన్నవారిలో ఉండాల్సిన మోతాదులో రక్తం లేక΄ోవడం వల్ల నీరసం, నిస్సత్తువ, బలహీనంగా ఉండటం వంటివి కనిపించవచ్చు. అలాగే ఇన్ఫెక్షన్స్‌ సోకడం, అవి ఒకపట్టాన తగ్గకపోవడం వంటి సమస్యలు కనిపించవచ్చు.

పరిష్కారం : తల్లికి పాలకూర వంటి ఆకుకూరలూ, నువ్వుల వంటి వాటితో చేసిన రుచికరమైన పదార్థాలు... అంటే ఐరన్‌ మోతాదులు ఎక్కువగా ఉండే ఆహారాలు పెడుతుండాలి. రక్తహీనత మరీ ఎక్కువగా ఉంటే డాక్టర్‌ సలహా మేరకు ఐరన్‌ సిరప్, టాబ్లెట్లు వంటివి వాడాల్సిరావచ్చు. 

ఫిట్స్‌ (హైబీపీ వల్ల) : కాన్పుకి ముందు కొంతమందిలో బీపీ పెరిగి కాన్పు తర్వాత తగ్గుతుంది. కానీ కొంతమందిలో కాన్పు తర్వాత కూడా వారం నుంచి పదిరోజుల పాటు బీపీ పెరిగి ఫిట్స్‌ వచ్చే అవకాశాలు ఉంటాయి. 

పరిష్కారం : నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్‌ను సంప్రదించడం తప్పనిసరి. 

మానసిక సమస్యలు : కొంతమంది బాలింతల్లో కాన్పు తర్వాత 3–5 రోజుల తర్వాత డిప్రెషన్‌ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఈ కండిషన్‌నే పోస్ట్‌పార్టమ్‌ బ్లూస్‌ లేదా బేబీ బ్లూస్‌ అంటారు. రక్తహీనత, బిడ్డ పెంపకం బాధ్యతల తాలూకు ఆందోళనా, భయం,  నిద్రలేమి, కొన్ని హార్మోన్లలో మార్పులతో కనిపించే మానసిక సమస్యలూ, కుటుంబంలో ఉండే సమస్యలూ, కలహాల వంటి ఎన్నో కారణాల ఈ డిప్రెషన్‌  రావచ్చు. 

కుటుంబసభ్యుల సహకారం వల్ల కొందరిలో ఇది 2–3 రోజుల్లోనే  చక్కబడుతుంది. కానీ... మరికొందరిలో పరిస్థితి మరింత తీవ్రమై సైకోసిస్‌ స్థితిలోకి వెళ్లే ముప్పు కూడా ఉంటుంది. 

పరిష్కారం : ఈ సమస్యకు మానసిక వైద్యుల ఆధ్వర్యంలో చికిత్స అవసరం. 

బాలింత విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
కాన్పు తర్వాత అటు తల్లి విషయంలోనూ, ఇటు బిడ్డ విషయంలోనూ తగిన జాగ్రతలు పాటించి, ఎలాంటి సమస్యలూ రాకుండా చూసుకోవాలి. కాన్పు జరిగిన 24 నుంచి 48 గంటల వరకు బాలింత ఆరోగ్యంతో పాటు ఆమెలో జ్వరం, బీపీ, రక్తస్రావం వంటివి ఏవైనా కనిపిస్తున్నాయా అనే విషయాన్ని కుటుంబ సభ్యులు జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి.

ఆహారం : కాన్పు తర్వాత బాలింతకు తేలికగా జీర్ణమయ్యే ఆహారం ఇవ్వాలి. మామూలుగా కంటే రోజుకు 600 కేలరీలు అధికంగా శక్తినిచ్చే ఆహారంతోపాటు బాగా పాలుపడేలా ఉండే ఆహారం తల్లికి ఇవ్వాలి. ఇందులో అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు, పప్పులు, ధాన్యాలు,  మాంసాహారం ఇవ్వాలి. పాలు, పెరుగు, పండ్లు తీసుకోవచ్చు. 

ఆహారంలో ఎలాంటి పథ్యం అవసరం లేదు. అయితే కారాలు, పచ్చళ్లు, మసాలాలు తినకూడదు. పప్పులు తినడం వల్ల చీము పడుతుందన్నది అపోహ మాత్రమే. రోజుకు కనీసం 10 గ్లాసులు (రెండు లీటర్ల) నీళ్లు తప్పనిసరిగా తాగించాలి. నీరు తాగడం వల్ల మూత్రాశయ ఇన్ఫెక్షన్స్, మలబద్దకాన్ని నివారించడానికి వీలవుతుంది. నీరు తాగడం వల్ల పొట్టపెరుగుతుందని, జలుబు చేస్తుందన్నది అపోహ మాత్రమే. 

మంచి పౌష్టికాహారం తీసుకోవడం వల్ల కాన్పు తర్వాత కలిగే అలసట  త్వరగా తగ్గుతుంది. కుట్లు త్వరగా/తేలిగ్గా మానుతాయి. పాలు బాగా పడతాయి. (బిడ్డ... తన తల్లిపాల నుంచి ఐరన్, క్యాల్షియమ్‌ గ్రహిస్తుంది. కాబట్టి మొదటి మూడు నెలలు తల్లి తప్పనిసరిగా ఐరన్, క్యాల్షియమ్‌ మాత్రలు వాడాలి. బిడ్డకు జలుబు చేస్తుందని పండ్లు, పెరుగు, మజ్జిగ తల్లికి ఇవ్వరు. ఇది కేవలం అపోహ మాత్రమే.

విశ్రాంతి : కాన్పు తర్వాత తల్లి బాగా అలసిపోతుంది. ఆ అలసటను తగ్గించడానికి తగినంత నిద్ర, విశ్రాంతి అవసరం. శారీరక, మానసిక విశ్రాంతి ఇవ్వడం వల్ల తల్లికి పాలు బాగా పడతాయి. బిడ్డను ఉయ్యాలలో కాకుండా తల్లిపక్కనే పడుకోబెట్టడం వల్ల ఆ స్పర్శతో తల్లీబిడ్డల మధ్య బంధం పటిష్టమవుతుంది. పాలు బాగా పడతాయి.

అటు ఇటు తిరగడం : సాధారణ కాన్పు తర్వాత తల్లిని కొద్ది గంటలలోపే లేచి అటు ఇటు తిరిగేలా ప్రోత్సహించడం మంచిది. ఆపరేషన్‌ చేసిన వాళ్ల విషయంలో... ఆమె బెడ్‌ మీదే ఉన్నప్పటికీ  4–6 గంటల తర్వాత నుంచి మంచంలోనే కాళ్లు అటూ–ఇటూ కదపడం, ముడుచుకోవడం–స్ట్రెచ్‌ చేయడం వంటివి చేయవచ్చు. 

ఆరోగ్యపరిస్థితిని బట్టి 12–24 గంటల తర్వాత మెల్లగా ఏదైనా ఆసరాతో లేచి తిరిగేలా చేయవచ్చు. ఇలా త్వరగా కదలడం వల్ల కాళ్లలోని రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే  ముప్పునూ... ఆ రక్తం గడ్డలు ఊపిరితిత్తుల్లోని రక్తనాళాల్లోకి ప్రవేశించే (ఎంబాలిజమ్‌) రిస్క్‌ను నివారించవచ్చు.

వ్యక్తిగత పరిశుభ్రత : కాన్పు తర్వాత జననాంగాలు శుభ్రంగా, పొడిగా ఉంచుకోవాలి. మల,మూత్ర విసర్జన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. సాధారణ కాన్పు తర్వాత కుట్లు వేయాల్సివస్తే వాటిపై యాంటీసెప్టిక్‌ పౌడర్‌ వేసుకోవచ్చు. 

బట్టలు కాకుండా డయాపర్లు వాడుకోవడం మంచిది. తడిసినవాటిని తరచూ మార్చుకుంటూ ఉండటం వల్ల ఇన్ఫెక్షన్స్‌ రాకుండా చూసుకోవచ్చు. యోనిస్రావాల  పరిమాణం, రంగు, వాసన అసాధారణంగా అనిపిస్తే వెంటనే వైద్యులకు చూపించుకోవాలి.

రొమ్ములపై శ్రద్ధ : తొమ్మిదో నెల నుంచే తల్లి తన రొమ్ములను శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు రొమ్ము మొనలను సాగదీస్తూ ఉండటం వల్ల కాన్పు తర్వాత బిడ్డ పాలు తాగడానికి అనువుగా మారతాయి. బిడ్డ పుట్టగానే గంటలోపే బిడ్డకు తల్లి పాలు పట్టిస్తే పాలు మరింత త్వరగా ఊరతాయి. 

బిడ్డకు అత్యుత్తమ ఆహారం తల్లిపాలే. మొదటి రెండు మూడు రోజులు నీరు లాంటి ద్రవం (కొలెస్ట్రమ్‌) ఉత్పత్తి అవుతుంది. అయితే ఇందులో బిడ్డకు వ్యాధినిరోధకశక్తిని పెంచడానికి అవసరమైన యాంటీబాడీస్, విటమిన్స్‌ ఉంటాయి. బిడ్డకు మొదటి ఆర్నెల్లూ తల్లిపాలే పట్టాలి. అవి మినహా మరేవీ ఇవ్వడం సరికాదు.

వ్యాయామాలు : కొన్ని వ్యాయామాలతో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. అవి నడుము నొప్పిని నివారిస్తాయి. ప్రారంభంలో కాళ్లు కదపడం, బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజెస్‌  చేయాలి. డాక్టర్‌ సలహా మేరకు ఆరు వారాల తర్వాత క్రమేపీ పొత్తికడుపు కండరాలు, పెల్విక్‌ఫ్లోర్‌ కండరాలు, నడుము కండరాలను శక్తిమంతం చేసే వ్యాయామాలు చేయవచ్చు. 

వీటివల్ల వదులైన పొట్ట కండరాలు గట్టిపడతాయి. పొట్ట మీద బట్ట చుట్టడం వల్లనో, అబ్డామినల్‌ బెల్ట్‌ వల్లనో పొట్ట తగ్గదు. అవి కేవలం సపోర్ట్‌గా మాత్రమే పనికివస్తాయి. కాన్పు తర్వాత అలసట తగ్గాక మెల్లగా వాకింగ్‌వంటి తేలికపాటి వ్యాయామాలు మొదలుపెట్టవచ్చు.

కుటుంబ నియంత్రణ : ప్రసవం తర్వాత వెంటనే గర్భం అందకుండా డాక్టర్‌ సలహా మేరకు కుటుంబ నియంత్రణ పద్ధతులను పాటించడం మంచిది. కాన్పు తర్వాత 2–3 నెలల నుంచే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా సెక్స్‌లో పాల్గొనడం వల్ల గర్భం దాల్చే అవకాశాలు ఎక్కువ (పీరియడ్స్‌ రాకుండానే కూడా). అందువల్ల కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించడం వల్ల అనుకోకుండా వచ్చే, అవాంఛిత గర్భాన్ని నివారించవచ్చు. 

అంతేకాకుండా తొమ్మిది నెలల పాటు బిడ్డను మోసి, కని అలసిపోయిన శరీరానికి తగినంత విశ్రాంతి దొరుకుతుంది. ఉన్న సమయాన్ని బిడ్డకి కేటాయించడం వల్ల బిడ్డలోనూ మంచి ఎదుగుదల, వికాసం కనిపిస్తాయి. ఇక పిల్లలు వద్దు అనుకున్న వారు శాశ్వత సంతాన నియంత్రణ పద్ధతుల కోసం డాక్టర్‌ను సంప్రదించవచ్చు. 

దాంపత్య జీవితం : బాలింతలో జరిగే మార్పులు యథాతథ స్థితికి వచ్చేందుకు, జననాంగాలు సాధారణ స్థితికి రావడానికి ఆరు వారాల సమయం పడుతుంది. ఇతరత్రా ఏ సమస్యలూ లేకుండా ఉంటే, ప్రసవం అయ్యా ఆరు వారాల తర్వాతి నుంచి దాంపత్య జీవితం గడపవచ్చు. ఒకవేళ సిజేరియన్‌ అయిన వారు కుట్లలో ఎలాంటి నొప్పులు లేకపోతే 8–10 వారాల తర్వాత దాంపత్యంలో పాల్గొనవచ్చు.

కుటుంబ సభ్యుల పాత్ర : కాన్పు తర్వాత బాలింతకు ఇంట్లో వాళ్ల చేయూత, మద్దతు ఎంతో అవసరం. ముఖ్యంగా భర్త పోషించాల్సిన భూమిక చాలా ప్రధానం.

డాక్టర్‌ చెకప్‌ : కాన్పు తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యాక వారం తర్వాత ఒకసారి, ఆరు వారాల తర్వాత మరోసారి డాక్టర్‌ను సంప్రదించాలి. లేదా డాక్టర్‌ సూచించిన విధంగా చెక్‌అప్‌కు వెళ్లాలి. తనకు వచ్చే సందేహాలన్నింటినీ మొహమాటపడకుండా డాక్టర్‌ను అడిగి తీర్చుకోవాలి. కాన్పుకు ముందు ఏవైనా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉంటే వాటిని డాక్టర్‌కు వివరించి, వాటి విషయంలో కాన్పు తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవడం అవసరం.

డాక్టర్‌ సరోజ బానోతు,కన్సల్టెంట్‌ ఆబ్‌స్టెట్రీషియన్‌ 
– గైనకాలజిస్ట్‌ 

(చదవండి: మామిడి పండ్లను తినేముందు ఇలా చేయడం తప్పనిసరి..! హెచ్చరిస్తున్న ఆరోగ్య నిపుణులు)
 

Advertisement
 
Advertisement
Advertisement