ఫోర్స్‌ చేస్తున్నారు

Health Tips: Family Planning Operation  - Sakshi

నాకు ఇద్దరు పిల్లలు. కుటుంబ నియంత్రణ చేయించుకోవాలనుకుంటున్నాం. వేసక్టమీ చేయించుకోమని నేను మావారిని ఫోర్స్‌ చేస్తున్నాను. లేదు లేదు.. ట్యూబెక్టమీ చేయించుకో అంటూ మా వారు నన్ను బలవంతపెడుతున్నారు. ఎవరు చేయించుకుంటే మంచిది?
– పి. వాసవి కళ్యాణి, మందమర్రి

ఈ రోజుల్లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ లాపరోస్కోపీ ద్వారా చేస్తున్నారు. అంటే డేకేర్‌లో అయిపోతుంది. ఆసుపత్రిలో కొన్ని గంటలు మాత్రమే ఉంటే సరిపోతుంది. ట్యూబెక్టమీ అంటే ఆడవారికి చేసే ప్రొసీజర్‌. వెసెక్టమీ అంటే మగవారికి చేసే ప్రొసీజర్‌. ఈ రెండూ కూడా లాపరోస్కోపీ ద్వారే చేస్తారు. ఇద్దరిలో ఎవరికైనా డే కేర్‌లోనే ఈ శస్త్ర చికిత్సను చేస్తారు. ఈ రెండూ కూడా 99 శాతం విజయవంతమయ్యే ప్రక్రియలే. మీకు రెండు కాన్పులు కూడా సిజేరియనే అయినా.. అంతకుముందూ ఇంకేదైనా (అపెండిసైటిస్‌ వంటి) సర్జరీ అయినా మళ్లీ ట్యూబెక్టమీ అంటే కొంచెం కష్టం కావచ్చు.

ఇంతకుముందు జరిగిన సర్జరీల తాలూకు అతుకులు ఉండవచ్చు. మళ్లీ అనెస్తీషియా తీసుకోవాల్సి వస్తుంది. అలాంటి కేసెస్‌లో .. అదీగాక మీకు ఇంకేదైనా మెడికల్‌ డిజార్డర్‌ ఉండి.. సర్జరీ రిస్కీ అయితే మీ వారినే వేసెక్టమీ చేయించుకోమని సజెస్ట్‌ చేస్తాము. ఒకవేళ మీవారు వేసెక్టమీ చేసుకున్నట్టయితే.. సర్జరీ అయిన మూడు నెలల తరువాత సెమెన్‌ అనాలిసిస్‌ చెక్‌చేసి.. స్పెర్మ్‌ లేవని నిర్ధారణ అయ్యేవరకు కండోమ్స్‌ తప్పనిసరిగా వాడాలి. మీకు ఇతర మెడికల్‌ ప్రాబ్లమ్స్‌ ఏవీ లేకపోతే .. ఇదివరకు ఏ సర్జరీ జరగకపోతే ఇద్దరిలో ఎవరు చేయించుకున్నా సమస్య లేదు. ట్యూబెక్టమీ అనేది పర్మినెంట్‌ ప్రొసీజర్‌. మళ్లీ రివర్స్‌ చేయడం చాలా కష్టం. అందుకే డాక్టర్‌ డీటెయిల్డ్‌ కౌన్సెలింగ్‌ తరువాతే ఈ ప్రొసీజర్‌కు ఒప్పుకుంటారు.  

 నాకు 33 ఏళ్లు. ఏడాది కిందట హిస్టరెక్టమీ అయింది. ఇది భవిష్యత్‌లో నా ఆరోగ్యం మీదేమైనా ప్రభావం చూపిస్తుందా?
– కె. లీలారాణి, బోధన్‌
హిస్టరెక్టమీ అనేది సర్వసాధారణమైన శస్త్ర చికిత్స. కొన్ని అనివార్య పరిస్థితుల్లో చిన్న వయసులోనే ఈ సర్జరీ చేయాల్సి వస్తుంది. 35 ఏళ్లలోపు హిస్టరెక్టమీ అయిన వాళ్లలో ఆరోగ్య సమస్యల రిస్క్‌ 4.6 రెట్లు పెరుగుతుంది. కరోనరీ ఆర్టరీ డిసీజ్‌ అంటే రక్తనాళాలు గట్టిపడడం వంటి స్థితి 2.5 రెట్లు ఎక్కువ. అందుకే యువతుల విషయంలో చాలా వరకు శస్త్ర చికిత్స జోలి లేకుండానే పేషంట్‌తో డిస్కస్‌ చేస్తాం. శస్త్ర చికిత్సను పేషంట్‌ ఆప్షనల్‌ చాయిస్‌గా కన్విన్స్‌ చేస్తాం. అధిక రక్తస్రావం, ఫైబ్రాయిడ్స్, ఎండోమెట్రియాసిస్, ప్రొలాప్స్‌ వంటి వాటికి ప్రత్యామ్నాయ పరిష్కారాలు ఈ మధ్య చాలానే వచ్చాయి. ఇలా ఈ ఆప్షన్స్‌ ఏవీ పనిచేయనప్పుడు మాత్రమే గర్భసంచిని తొలగించే మార్గం గురించి ఆలోచించాలి.

చిన్న వయస్సులోనే గర్భసంచిని తొలగిస్తే బరువు పెరిగే, బీపీ ఎక్కువయ్యే, హార్ట్‌ డిసీజెస్‌ వచ్చే ప్రమాదం పది నుంచి పదిహేను శాతం ఎక్కువ. అందుకే ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఫిజీషియన్, గైనకాలజిస్ట్‌ దగ్గర చెక్‌ చేయించుకోవాలి. హిస్టరెక్టమీ వల్ల నెలసరి ఆగిపోవడంతో కొంతమంది ఏదో వెలితి ఫీలవుతుంటారు. డిప్రెషన్‌లోకి వెళ్లే చాన్సెస్‌ కూడా ఎక్కువే. రోజుకు ఎనిమిది నుంచి పది గ్లాసుల మంచినీళ్లు తాగడం, ఆరోగ్యకరమైన జీవన శైలిని పాటించడం, రోజూ వ్యాయామం చేయడం వంటి అలవాట్లతో హిస్టరెక్టమీ సైడ్‌ ఎఫెక్ట్స్‌ను చాలా వరకు తగ్గించవచ్చు. నలభై ఏళ్లలోపు హిస్టరెక్టమీ అయితే ఓవరీస్‌ కూడా త్వరగా ఫెయిలవడం చూస్తాం.

ఓవరీస్‌ నుంచి హార్మోన్స్‌ విడుదలవుతాయి కాబట్టి మెనోపాజ్‌  లక్షణాలు కొంచెం తగ్గుతాయి. ఈస్ట్రొజెన్‌ తగ్గడం వల్ల ఎముకలు దృఢత్వాన్ని కోల్పోయి గుల్లబారి ఫ్రాక్చర్‌ అయ్యే రిస్క్‌ పెరుగుతుంది.  చెమటలు పట్టడం, డిప్రెషన్, నీరసం, నిస్సత్తువ వంటి లక్షణాలుంటాయి. అందుకే కాల్షియం సప్లిమెంట్స్‌ తీసుకోవాలి. హై ప్రొటీన్‌ డైట్‌ తీసుకోవాలి. కొంతమందికి హార్మోన్‌ రీప్లేస్‌మెంట్‌ థెరపీ సజెస్ట్‌ చేస్తాం. దీనితో హిస్టరెక్టమీతో వచ్చే సమస్యల రిస్క్‌ను కాస్త తగ్గించవచ్చు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top