బేబీ బ్లూస్‌..! డెలివరీ తర్వాత ఇలా ఎందుకనిపిస్తోంది.. | Health Tips: Baby blues after pregnancy | Sakshi
Sakshi News home page

బేబీ బ్లూస్‌..! డెలివరీ తర్వాత ఇలా ఎందుకనిపిస్తోంది..

May 10 2026 11:04 AM | Updated on May 10 2026 11:04 AM

Health Tips: Baby blues after pregnancy

నాకు వారం రోజుల క్రితం సిజేరియన్‌ ద్వారా డెలివరీ అయింది. బేబీ కూడా బాగానే ఉంది, నేను కూడా ఆరోగ్యంగా ఉన్నాను. కానీ గత కొన్ని   రోజులుగా నాకు చాలా సాడ్‌ ఫీలింగ్‌ వస్తోంది. మాటిమాటికి కళ్లలో నీళ్లు వస్తున్నాయి, బేబీతో ఆడుకోవాలని కూడా అనిపించడం లేదు. ఒంట్లో బలహీనంగా అనిపిస్తోంది. ఇది సాధారణమేనా?
– లావణ్య, కడప.

డెలివరీ తర్వాత కొంతమంది మహిళల్లో ఇలా సడెన్‌గా సాడ్‌ ఫీలింగ్‌ రావడం, ఏడుపు రావడం, బలహీనంగా అనిపించడం వంటి మార్పులు కనిపించవచ్చు. దీన్ని సాధారణంగా ‘పోస్ట్‌పార్టమ్‌ బ్లూస్‌’ అంటారు. డెలివరీ అయిన తర్వాత మొదటి రెండు నుంచి మూడు వారాల వరకు సుమారు 70 నుంచి 80 శాతం మహిళల్లో ఈ మార్పులు కనిపించడం సాధారణమే. ఇది ఎక్కువగా జీవనశైలిలో ఒక్కసారిగా వచ్చే మార్పుల వల్ల జరుగుతుంది. 

డెలివరీ తర్వాత తల్లి పూర్తిగా కోలుకోకముందే ప్రతి రెండు గంటలకు లేచి బిడ్డను చూసుకోవడం, పాలివ్వడం వంటి బాధ్యతలు పెరుగుతాయి. అలాగే శరీరంలో హార్మోన్‌ మార్పులు కూడా ఈ భావోద్వేగ మార్పులకు కారణం అవుతాయి. సాధారణంగా ఈ బేబీ బ్లూస్‌ రెండు వారాల లోపే తగ్గిపోతాయి. కుటుంబ సభ్యుల సహాయం, కొద్దిగా ప్రోత్సాహం, సరైన విశ్రాంతి, సపోర్ట్‌ ఉంటే ఎక్కువగా ప్రత్యేక చికిత్స అవసరం లేకుండానే సమస్య సద్దుమణుగుతుంది. 

అయితే కొంతమందిలో ఈ లక్షణాలు ఎక్కువ కాలం కొనసాగితే దాన్ని ‘పోస్ట్‌ పార్టమ్‌ డిప్రెషన్‌’ అంటారు. ఇది భారతదేశంలో దాదాపు 10 నుంచి 25 శాతం మహిళల్లో కనిపించే సమస్య. దీనికి ప్రధాన కారణాలు హార్మోన్‌ మార్పులు, ముందుగా ఉన్న ఆందోళన లేదా డిప్రెషన్‌ సమస్యలు, డెలివరీ సమయంలో ఎదురైన ఒత్తిడి లేదా కుటుంబంలో సరైన సపోర్ట్‌ లేకపోవడం వంటి అంశాలు కావచ్చు. 

ఇలాంటి పరిస్థితుల్లో తల్లి చాలా లో మూడ్‌లో ఉండటం, బిడ్డపై ఆసక్తి తగ్గడం, ఆకలి లేకపోవడం, నిద్ర పట్టకపోవడం, చిరాకు ఎక్కువగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కుటుంబ సభ్యులు తల్లి ప్రవర్తనలో వచ్చిన ఈ మార్పులను ముందుగానే గుర్తించడం చాలా ముఖ్యం. డాక్టర్‌ను సంప్రదిస్తే కొన్ని ప్రత్యేక ప్రశ్నల ద్వారా ఈ సమస్యను సులభంగా గుర్తించవచ్చు. 

అవసరమైతే కౌన్సెలింగ్, సైకాలజికల్‌ థెరపీ వంటి చికిత్సలు సూచిస్తారు. కొన్ని సందర్భాల్లో తాత్కాలికంగా మందులు కూడా ఇవ్వవచ్చు. ఈ మందులు సాధారణంగా తల్లి పాలిచ్చే సమయంలో కూడా సురక్షితంగా వాడేలా ఉంటాయి. సరైన చికిత్స, కుటుంబ సభ్యుల ప్రేమ, సహాయం, ప్రోత్సాహం ఉంటే ఈ సమస్య నుంచి త్వరగా బయటపడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ధైర్యంగా ఉండండి. 

డా. కప్పగంతుల అపర్ణ , సీనియర్‌ గైనకాలజిస్ట్, అబ్‌స్టెట్రీషియన్, ల్యాపరోస్కోపిక్‌ సర్జన్, సికింద్రాబాద్‌ 
∙(చదవండి: ఇదేం వినికిడి సమస్య..? కేవలం పురుషుల గొంతు మాత్రమే..

Advertisement
 
Advertisement
Advertisement