కలం.. కలలు- కథలు రాద్దాం... | Greatest Holiday Stories Of Big Writers | Sakshi
Sakshi News home page

కలం.. కలలు- కథలు రాద్దాం...

May 3 2026 6:01 AM | Updated on May 3 2026 6:01 AM

Greatest Holiday Stories Of Big Writers

సండే రీడింగ్‌

పెద్ద రచయితలు సెలవుల్లో ఏం చేశారో తెలుసా? 

సెలవులొస్తే జె.కె. రౌలింగ్‌ అడవుల్లో తిరిగేది. ఆర్‌.కె. నారాయణ్‌ అమ్మమ్మ ఊరికి చెక్కేసేవాడు. రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ మేడ మీద కవితలు రాసేవాడు. సత్యజిత్‌ రేకి బొమ్మలు గీయడమే లోకం. సుధామూర్తి లైబ్రరీలోనే గడిపేది. రస్కిన్‌ బాండ్‌  కొండల్లో తిరిగేవాడు. ఈ ఆరుగురు సెలవుల్ని కథలు చేశారు. మీరూ కలం అందుకోండి. ఏమో...  రేపటి రస్కిన్‌ బాండ్‌ మీరే ఏమో.

→ జె.కె. రౌలింగ్‌
‘హారీపాటర్‌’ సిరీస్‌ రాసి ప్రపంచమంతా పేరు పొందిన జె.కె.రౌలింగ్‌కు రాయాలనే ఊహ చిన్నప్పటి నుంచీ ఉంది. ఇంగ్లండ్‌లో వేసవి సెలవుల్లో తన చెల్లి డయాన్ తో కలిసి అడవిలో తిరుగుతూ ‘ఇది మంత్రగాళ్ల రాజ్యం’ అంటూ కథలు అల్లేది. పక్కింటి వాళ్ళ ఇంటి పేరు ‘పాటర్‌‘ నచ్చి డైరీలో రాసుకుంది. ఆ వయసులో ‘రాబిట్‌’ అనే మొదటి కథ రాసి చెల్లికి చదివి వినిపించింది.  పెరిగి పెద్దయ్యాక 1990లో రైలు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ ప్రయాణం విసుగు పుట్టి హ్యారీ పాటర్‌ ఆలోచన వచ్చింది. చిన్నప్పటి సెలవుల ఊహలే 35 ఏళ్ల వయసులో పుస్తకం అయ్యి 500 మిలియన్లకు పైగా అమ్ముడయ్యాయి. నోట్‌బుక్, పెన్ను ఉంటే చాలు. మీ ఊహలకు కూడా మంత్రశక్తి వస్తుంది.

→ ఆర్‌.కె. నారాయణ్‌
మన ‘మాల్గుడి డేస్‌’ రచయిత ఆర్‌.కె.నారాయణ్‌ మైసూర్‌లో అమ్మమ్మ వాళ్లింటికి వేసవి సెలవుల్లో వెళ్తే అక్కడ కరెంటు ఉండేది కాదు. టైంపాస్‌కి అమ్మమ్మ ఊరి మనుషుల కథలు చెప్పేది. గుడి పూజారి, స్కూల్‌ మాస్టారు, పోస్ట్‌మాన్, మాటకారి మనిషి... వీళ్లందరి గురించి చెప్తుంటే నారాయణ్‌ వరండాలో కూర్చొని విని, నోట్‌బుక్‌లో రాసుకునేవాడు. ‘వీళ్లతో ఒక ఊరు సృష్టిస్తే ఎలా ఉంటుంది?’ అని ఊహించేవాడు. చిన్నప్పుడు చూసిన, విన్న మనుషుల మాటలు, అలవాట్లే తర్వాత ‘మాల్గుడి డేస్‌’లో స్వామి, రాజమ్, మణి పాత్రలు అయ్యాయి. అమ్మమ్మ చెప్పిన కథలే అతని రచనకు పునాది.

→ రవీంద్రనాథ్‌ ఠాగూర్‌
నోబెల్‌ కవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌కు కలకత్తాలో స్కూల్‌ చదువు నచ్చేది కాదు. వేసవి సెలవుల్లో ఇంటి మేడ మీద కూర్చొని ప్రకృతిని చూస్తూ కవితలు రాసేవాడు. వాళ్ల ఇంట్లో సాహిత్యం, సంగీతం, నాటకాల వాతావరణం ఉండేది. అందువల్ల ఎనిమిదేళ్ల వయసులోనే మొదటి కవిత రాశాడు. 16 ఏళ్ల వయసులో ‘భానుసింహ ఠాకూర్‌’ అనే మారుపేరుతో కవితలు రాశాడు. సెలవుల్లో చదువు, రాతలతోనే గడిపాడు. అలా రాస్తూ రాస్తూ విశ్వ కవిగా ఖ్యాతి గడించాడు ఠాగూర్‌. ఆయన రాసిన ‘గీతాంజలి’ కవిత్వ పుస్తకానికి నోబెల్‌ బహుమతి వచ్చింది.

→ సత్యజిత్‌ రే
ఆస్కార్‌ పొందిన భారతీయ దర్శకుడు సత్యజిత్‌ రే చిన్నప్పుడు కలకత్తాలో సెలవులొస్తే ఇంట్లోని పుస్తకాల్లో ఉన్న బొమ్మలను, తాత ఉపేంద్రకిషోర్‌ రాయ్‌ చౌధురి నడిపిన ‘సందేశ్‌‘ పిల్లల పత్రికలోని బొమ్మలను చూసి కాపీ చేస్తుండేవాడు. శాంతినికేతన్ లో వేసవి క్యాంప్‌కు వెళ్లి బొమ్మలు వేయడం నేర్చుకున్నాడు. 1949లో లండన్‌లో విట్టోరియో డి సికా ‘బైసికిల్‌ థీవ్స్‌’ సినిమా చూసి, ‘నేనూ రియలిస్టిక్‌ సినిమా తీయాలి’ అని నిర్ణయించుకున్నాడు. ఇండియా వచ్చాక బిభూతిభూషణ్‌ బందోపాధ్యాయ ‘పథేర్‌ పాంచాలి‘ నవల చదివి దాన్నే మొదటి సినిమాగా తీశాడు. 1992లో ఆయనకు ఆస్కార్‌ లైఫ్‌టైమ్‌ అవార్డు వచ్చింది.

→ సుధామూర్తి
ఇవాళ బాలల రచయిత్రిగా అందరికీ ఇష్టమైన సుధామూర్తి చిన్నప్పుడు అమ్మమ్మ ఊరైన హుబ్లీకి వేసవి సెలవులకు వెళ్తే ఆమెకు కన్నడ చదవడం రాదని తెలిసింది. 12 ఏళ్ల సుధ రాత్రి 60 ఏళ్ల అమ్మమ్మకి లాంతరు వెలుగులో అక్షరాలు దిద్దించింది. చదవడం నేర్చుకున్నాక అమ్మమ్మ మొదటిసారి ‘కాశీ యాత్ర’ అనే నవల చదివి ఏడ్చింది. ఆ అనుభవాన్నే సుధామూర్తి ‘హౌ ఐ టాట్‌ మై గ్రాండ్‌మదర్‌ టు రీడ్‌‘ అనే కథగా రాసింది. ఇప్పుడు అది పాఠ్యపుస్తకాల్లో ఉంది. రాయాలనుకుంటే ఇలా మీ ఇంట్లోనే ఎన్నో కథలు ఉంటాయి. అమ్మమ్మకి నేర్పించిన పాఠమే ప్రపంచం మెచ్చే కథ అవుతుంది.

→ రస్కిన్‌ బాండ్‌
ప్రపంచం మెచ్చిన బాలల రచయిత రస్కిన్‌ బాండ్‌కి డెహ్రాడూన్ లో సెలవులొస్తే కొండలు, రైలు శబ్దాలే లోకం. వాళ్ల నాన్న చనిపోయాక ఒంటరితనంలో డైరీ రాయడం మొదలుపెట్టడం అతడిని రచనల వైపు లాక్కువచ్చింది. 17 ఏళ్ల వయసులో ఇంగ్లండ్‌లో ఉండగా ఇండియాలో తన బాల్యం గుర్తుకు వచ్చి ‘ది రూమ్‌ ఆన్‌ ది రూఫ్‌’ నవల రాశాడు. 1957లో అది ‘జాన్‌ లెవెలిన్‌ రైస్‌ ప్రైజ్‌’ గెలుచుకుంది. తర్వాత ఇండియా వచ్చి ముస్సోరీలో స్థిరపడ్డాడు. ఇప్పటికీ 90 ఏళ్లు దాటినా ప్రతి రోజూ ఉదయం లేచి కథలు రాస్తాడు. కిటికీ బయట వాన, రైలు శబ్దం వింటూ రాసిన కథే సాహిత్య అకాడమీ అవార్డు తెచ్చింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement