కథాకళి: ఓ వర్షం రాత్రి | Funday Kathakali: A Rainy Night | Sakshi
Sakshi News home page

కథాకళి: ఓ వర్షం రాత్రి

May 10 2026 11:17 AM | Updated on May 10 2026 11:18 AM

Funday Kathakali: A Rainy Night

జిగ్నేష్‌కి అతని క్లాస్‌మేట్‌ కావ్యమణి ఐదేళ్ళ తర్వాత అకస్మాత్తుగా మెట్రోలో తారసపడింది. ఇద్దరూ ఒకే స్టేషన్‌ లో దిగాక జిగ్నేష్‌ ఆమెని ఎదురుగా ఉన్న కాఫీ షాప్‌కి ఆహ్వానించాడు. మోమోస్‌ తిని, కాఫీ తాగుతూ ఒకరి గురించి మరొకరు చెప్పుకున్నారు. కావ్యమణికి పెళ్ళై విడాకులు కూడా అయ్యాయని తెలిశాక అతను ఆహ్వానించాడు.‘‘మా ఆవిడ పుట్టింటికి వెళ్ళింది. ఈ రాత్రికి మా ఇంటికి రారాదు? నువ్వు వర్కింగ్‌ ఉమెన్‌ ్స హాస్టల్‌లో ఉంటున్నావు కాబట్టి ఎవరి అనుమతి అవసరం లేదు.’’‘‘ఆలోచిస్తాను. ఇందుకు మెంటల్‌గా నేను ప్రిపేర్‌ అవడానికి కొంత సమయం పడుతుంది. సాయంత్రం ఐదు తర్వాత ఫోన్‌ చేస్తాను.’’ కావ్యమణి జవాబు చెప్పింది.  

‘‘నేను వంట కూడా బాగా చేస్తాను.’’ జిగ్నేష్‌ ‘వంట’ పదాన్ని ఒత్తి పలుకుతూ చెప్పాడు. ఆరున్నర దాకా అతను ఆమె ఫోన్‌ చేస్తుందా, లేదా అనే ఆదుర్దాకి గురయ్యాడు. ఆరు ముప్ఫై ఐదుకి కావ్యమణి నుంచి ఫోన్‌ వచ్చింది. ‘‘మీ ఇంటికి ఎలా రావాలో లొకేషన్‌ పంపు. నేను ఎనిమిదిన్నరకి రావచ్చా?’’‘‘ష్యూర్‌ అండ్‌ థాంక్స్‌.’’ విప్పారిన మొహంతో చెప్పాడు.అతను ఎనిమిదింటికి బియ్యం నానపెట్టాడు. ఫ్రిజ్‌ తెరచి కూరగాయలు తరిగి సిద్ధం చేశాడు. ఎనిమిదింపావుకి ఆకాశంలో మబ్బులు కనిపించాయి. మెరుపులని చూసి వర్షం వస్తుందని అనిపించాక కావ్యమణి రావటం విరమించుకుంటుందా అని భయపడ్డాడు.వంటపనిలో ఉండగా డోర్‌ బెల్‌ మోగితే తలుపు తెరిచాడు. మంచి పెర్‌ఫ్యూమ్‌ వాసన. కావ్యమణి వచ్చింది. ఆమె తన హెల్మెట్‌ని సోఫా మీద ఉంచి అడిగింది.

‘‘నా స్కూటీని కార్‌ పార్క్‌లో నీ కారు వెనక పార్క్‌ చేశాను. ఓకే కదా?’’‘‘ఓకే.’’ఆమె ఫ్రెంచ్‌ డోర్‌ని తెరిచి బాల్కనీలోకి వెళ్ళి ఆకాశంలోకి కొద్ది క్షణాలు చూసి మళ్ళీ లోపలకి వచ్చి అడిగింది.‘‘స్నాక్స్‌ ఏమైనా ఉన్నాయా? ఆకలిగా ఉంది.’’‘‘కూర్చో. నాలుగైదు నిమిషాల్లో బర్గర్‌ చేస్తాను.’’అతను బర్గర్‌ పేటీని డీప్‌ఫ్రీజర్‌లోంచి తీసి, రెండువైపులా నెయ్యి స్ప్రే చేసి, ఏర్‌ ఫ్రైయర్‌లో ఉంచి, మూడు నిమిషాల తర్వాత వెనక్కి తిప్పాడు. ఈలోగా టొమాటో, ఉల్లిపాయలు, కొత్తిమీర కోసి, బర్గర్‌ బన్‌  మధ్యకి కోసి పెనం మీద కాల్చాడు. బర్గర్‌లో అన్నిటినీ పెట్టేముందు టొమాటో, మస్టర్డ్, చిల్లీ సాస్‌లు వేశాడు.‘‘బావుంది. బావుంది కాదు. ఎక్సలెంట్‌.’’ చెప్పి ఆమె జీరో కోక్‌ తాగింది.
జిగ్నేష్‌ భార్య పుట్టింటికి కానుపుకి వెళ్ళి నాలుగు నెలలైంది.

 అతనికి అప్పటి నించి స్త్రీ సంపర్కం లేదు. తొందరగా ఉంది.‘‘వాతావరణం బావుంది కదా?’’ బాల్కనీలోంచి ఫ్రెంచ్‌ డోర్‌ ద్వారా చల్లటి గాలి వీస్తూండటంతో అడిగాడు.‘‘అవును. మనకి చక్కటి మూడ్‌ ఇచ్చే వాతావరణం.’’ కావ్యమణి చెప్పింది.ఆమెకి తన భార్య నైటీ ఇచ్చాడు. అతని ఎదురుగానే దాన్ని మార్చుకుంది. ఆమెని కౌగిలించుకుని చుంబించబోయాడు. అకస్మాత్తుగా ఫ్రెంచ్‌ డోర్‌ లోంచి తూనీగలు, రెక్కల పురుగులు, వందల సంఖ్యలో లోపలికి రాసాగాయి. అతను ఆమెని వదిలి ఫ్రెంచ్‌ డోర్‌ మూయబోయాడు.‘‘ఒద్దు.’’ కావ్యమణి అతన్ని ఆపి చెప్పింది.‘‘ఒద్దేమిటి? దీపం పురుగులు.’’ ఆశ్చర్యంగా చెప్పాడు.కావ్యమణి నేలరాలిన ఓ పురుగుని తీసి పరిశీలించి చూసి ఆనందంగా చెప్పింది.‘‘ఉసుళ్ళు.’’‘‘ఉసుళ్ళా?’’‘‘అవును. వీటిని ఉసుళ్ళు అంటాం. 

మీ ఇంటి దగ్గరలో చెదల పుట్టలు ఉండి ఉండాలి. వాటికి ఎండాకాలం వానకి రెక్కలు వచ్చి, మూకుమ్మడిగా పుట్టలోంచి బయటికి వస్తాయని, వీటి ఆయుష్షు నాలుగైదు గంటలు మాత్రమేనని చిన్నప్పుడు మా నాయనమ్మ చెప్పింది. ఇవి ప్రొటీన్‌ ఫుడ్‌ అని తెలుసా? వీటిని వేయించుకుని తింటాం. చాలా రుచిగా ఉంటాయి. చాలా కాలానికి భలే దొరికాయి.’’కావ్యమణి ఓ బేసిన్‌ లో నేలరాలిన ఉసుళ్ళని ఏరి, వాటి ట్రాన్స్‌పరెంట్‌ రెక్కలను తుంచి, పురుగులను బేసిన్‌ లో వేయడాన్ని జిగ్నేష్‌ అసహ్యంగా చూశాడు. ఆమె ఆ పనిని అరగంటకి పైగా పూర్తి చేశాక స్టవ్‌ వెలిగించి, ఆ పురుగులను నూనెలో వేయించి ఉప్పు కారం కలిపి రెండు ప్లేట్లలో పెట్టి తెచ్చింది.

‘‘తిను. చాలా టేస్టీ.’’‘‘నో. థేంక్స్‌. నువ్వే తిను.’’ఆమె వాటిని తింటూంటే చెప్పాడు.‘‘నేను బయటికి వెళ్ళొస్తాను.’’అతను ఆ రాత్రి తిరిగి రాలేదు. మర్నాడు ఉదయం అతను వచ్చేసరికి కావ్యమణి ఆఫీస్‌కి వెళ్ళడానికి సిద్ధమై, అతని కోసం ఎదురుచూస్తోంది.‘‘రాత్రి నువ్వు రానని టెక్స్‌ట్‌ మెసేజ్‌ ఇచ్చావు. ఏమైంది?’’ అడిగింది.‘‘అర్జంట్‌గా ఆఫీస్‌ పని చేయాల్సివచ్చింది.’’ఆమె వెళ్ళాక అతను బేసిన్‌ ను, బాణలిని చెత్త డబ్బాలో పడేసి, ఆఫీస్‌కి వెళ్ళడానికి సిద్ధమవుతూ అనుకున్నాడు.‘ఇంకా నయం. త్వరపడి  కావ్యమణి పెదాలని ముద్దు పెట్టుకోలేదు’  
 ∙మల్లాది వెంకట కృష్ణమూర్తి  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement