మన దేశంలో ఈ సమస్య తీవ్రత ఎక్కువే..

Frequent Urination In Women Causes And Treatments - Sakshi

ఈ చలికాలంలో నీళ్లు తాగేది ఒకింత తక్కువే అయినా... కొందరికి తరచూ మూత్రానికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా సాధారణం కంటే చాలా ఎక్కువ సార్లు మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వచ్చే పరిస్థితినే ‘ఓవర్‌ యాక్టివ్‌ బ్లాడర్‌’ అంటారు. ఇది ఆరోగ్యపరంగానే కాదు... సామాజికంగా కూడా బాధితులకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. దీంతో ఈ సమస్య ఉన్న బాధితులు నీళ్లు తక్కువగా తాగడం మొదలుపెడతారు.  ఫలితంగా సాధారణ జీవక్రియలు, మూత్రపిండాలకు సంబంధించిన మరికొన్ని సమస్యలూ వచ్చే అవకాశముంది. తరచూ నిద్రాభంగం వల్ల  ‘నిద్రలేమి’తో వచ్చే ఆరోగ్యసమస్యలు అదనం. ఈ సమస్య లక్షణాలేమిటో, దాన్ని అదుపు చేయడం ఎలాగో తెలుసుకుందాం.  

కొందరిలో మూత్రాశయపు బ్లాడర్‌ గోడలు తరచూ అతిగా స్పందించి, త్వరత్వరగా ముడుచుకుపోతూ... మూత్రాన్ని బయటకు పంపించడానికి ప్రయత్నిస్తాయి. ఈ సమస్యతో బాధపడేవారు తాము ఎక్కడికైనా వెళ్లాల్సి వచ్చినప్పుడు అక్కడ టాయిలెట్‌ గదులెక్కడున్నాయో వెతుక్కుంటూ ఉంటారు. ఈ ప్రవర్తననే ‘‘టాయిలెట్‌ మ్యాపింగ్‌’’ అంటారు. ఇక రాత్రివేళ తరచూ పక్క మీది నుంచి లేస్తూ ఉండటం... కేవలం వారిని మాత్రమేగాక వారి భాగస్వామికీ నిద్రాభంగం కలిగిస్తూ ఇబ్బందిగా పరిణమిస్తుంది. దాంతో ఆరోగ్యసమస్య కాస్తా... కుటుంబ సమస్యగా కూడా పరిణమిస్తుంది. ఫలితంగా ఇది వారి ‘జీవననాణ్యత’ (క్వాలిటీ ఆఫ్‌ లైఫ్‌)ను దెబ్బతీస్తుంది. 

మనదేశంలో దీని తీవ్రత... 
నిజానికి మన దేశంలో ఈ సమస్య ఎక్కువే అయినప్పటికీ దీని గణాంకాలు చాలా తక్కువగా నమోదవుతుంటాయన్నది వైద్య నిపుణుల భావన. అయినప్పటికీ కొన్ని అధ్యయనాల ప్రకారం పురుషుల్లోని 14 శాతం, మహిళల్లో 12 శాతం మందిలోనూ ఈ సమస్య ఉంటుంది. మెనోపాజ్‌కు చేరువైన/ మెనోపాజ్‌ వచ్చిన మహిళలు, ప్రోస్టేట్‌ సమస్య ఉన్న పురుషుల్లో ఈ సమస్య మరింత ఎక్కువ.

మేనేజ్‌మెంట్‌ / చికిత్స 
∙జీవనశైలి మార్పులు : ఇందులో భాగంగా సాధారణ జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకొమ్మని డాక్టర్లు / నిపుణులు సలహా ఇస్తారు. కొందరు అవసరమైన దాని కంటే చాలా ఎక్కువ నీళ్లు తాగుతుంటారు. ఉదాహరణకు... ఉదయాన్నే చేసే మూత్రవిసర్జన వల్ల దేహంలోని చాలా విషపదార్థాలు బయటకు వెళ్తాయనే అపోహతో చాలామంది రెండు లీటర్లకు పైగా నీళ్లు తాగేస్తారు.అవసరానికి మించి నీళ్లు తాగకుండా జాగ్రత్తపడాలి. (ఇందుకు కొంత పరిశీలన, అభ్యాసం అవసరం. మనకు ఎన్ని నీళ్లు సరిపోతాయనే అంశాన్ని మరీ నీళ్లు తక్కువైనప్పుడు డీహైడ్రేషన్‌లో కనిపించే లక్షణాలైన కండరాలు బిగుసుకుపోవడం (మజిల్‌ క్రాంప్స్‌) వంటి వాటిని గమనిస్తూ... దేహానికి అవసరమైన నీళ్ల మోతాదును ఎవరికి వారే స్వయంగా గుర్తించగలిగేలా నిశితంగా పరిశీలించుకోవాల్సి ఉంటుంది.); నిద్రపోవడానికి రెండు గంటల ముందుగా నీళ్లు తాగడం...ఆ తర్వాత తాగకపోవడం; పొగతాగడం, కాఫీ (కెఫిన్‌), ఆల్కహాల్‌ వంటి అలవాట్లకు దూరంగా ఉండటం; ఓవర్‌ ద కౌంటర్‌ మందులకు దూరంగా ఉండటం వంటి జీవనశైలి మార్పులతో ఈ సమస్యను చాలావరకు కట్టడి చేయవచ్చు. 

బిహేవియర్‌ థెరపీ : మానసిక చికిత్సలో భాగంగా ఇచ్చే అభ్యాస చికిత్సతో బ్లాడర్‌పై క్రమంగా అదుపు సాధించేలా చేయడం. 

నోటితో ఇచ్చే మందులు / బ్లాడర్‌కు ఇంజెక్షన్లు : సమస్య తీవ్రత తక్కువగా ఉన్నవారికి నోటితో ఇచ్చే కొన్ని మందులతో... సమస్య మరీ ఎక్కువగా ఉన్నవారిలో నేరుగా బ్లాడర్‌ కండరాలు బలోపేతమయ్యేందుకు నేరుగా బ్లాడర్‌లోకి ఇచ్చే కొన్ని ఇంజెక్షన్లతో. 

ఎలక్ట్రిక్‌ ఇంపల్స్‌ / స్టిమ్యులేషన్‌ టెక్నిక్స్‌  : ఏదైనా నరం దెబ్బతిన్నప్పడు దాన్ని ప్రేరేపించేలా (నర్వ్‌ స్టిమ్యులేటింగ్‌ టెక్నిక్స్‌) చేయడం. ఇందులో భాగంగా మెదడు, వెన్నుపూస నుంచి వచ్చే నరాలు, అవి బ్లాడర్‌కు చేరాక... వాటి నుంచి అందే సిగ్నల్స్‌ అన్నీ సరిగా అందేలా దెబ్బతిన్న నరాలకు ఎలక్ట్రిక్‌ స్టిమ్యులేషన కలిగేలా విద్యుత్‌ ప్రేరణలు కల్పించడం. 

శస్త్రచికిత్స : ఇది చాలా చాలా అరుదుగా మాత్రమే అవసరమయ్యే ప్రక్రియ. 

పెల్విక్‌ ఫ్లోర్‌ మజిల్స్‌ ఎక్సర్‌సైజ్‌లు :  కెగెల్స్‌ ఎక్సర్‌సైజ్‌ అని పిలిచే ఈ వ్యాయామల వల్ల పొత్తికడుపు కండరాలు, యూరినరీ బ్లాడర్‌ కింది భాగంలోని కండారాలు,  మూత్రసంచి (బ్లాడర్‌) నుంచి బయటకు తీసుకొచ్చే నాళమైన యురెథ్రాకు మధ్య ఉండే ‘నెక్‌’ లాంటి చోట ఉండే కండరాలు బలోపేతమవుతాయి. ఈ వ్యాయామాలతో మూత్రం ఆపుకోగల సామర్థ్యం క్రమంగా (అంటే 4 – 8 వారాలలో) పెరుగుతుంది. డాక్టర్ల పర్యవేక్షణలో ఫిజియోల సూచనలతో చేసే ఈ వ్యాయామాలతో పరిస్థితి క్రమంగా చాలావరకు మెరుగువుతుంది. 

ఏ వైద్య నిపుణులను సంప్రదించాలి
‘ఓవర్‌ యాక్టివ్‌ బ్లాడర్‌’తో బాధపడే పురుషులు యూరాలజిస్ట్‌ను సంప్రదించాలి. అలాగే ఓవర్‌ ఆక్టివ్‌ బ్లాడర్‌తో బాధపడేవారైనా లేదా స్ట్రెస్‌ యురినరీ ఇన్‌కాంటినెన్స్‌ (ఎస్‌యూఐ) ఉన్న మహిళలైనా యూరోగైనకాలజిస్ట్‌ను సంప్రదించాలి. 

స్ట్రెస్‌ యూరినరీ ఇన్‌కాంటినెన్స్‌ 
కొందరు మహిళల్లో మూత్రం నిల్వ అయ్యేందుకు ఉపయోగపడే సంచి అయిన బ్లాడర్‌కు కాకుండా...  మూత్రాన్ని బయటకి చేరవేసేందుకు... మూత్రసంచి (బ్లాడర్‌) నుంచి బయటకు తీసుకొచ్చే నాళమైన యురెథ్రాలో సమస్య ఉంటుంది. ఇలాంటివారిలో ఏ చిన్న ఒత్తిడి పడ్డా వారి యురెథ్రా మూత్రాన్ని బయటకు కారేలా చేస్తుంది. అంటే... దగ్గినా, తుమ్మినా, గట్టిగా నవ్వినా... వారికి తెలియకుండానే మూత్రం కారిపోతుంది. అంటే అర్జెంటుగా మూత్రానికి వెళ్లాలనిపించే భావన వేరు, తమకు తెలియకుండానే మూత్రం పడిపోవడం వేరు. ఇలా... తమకు తెలియకుండానే మూత్రం పడిపోయే సమస్యను స్ట్రెస్‌ యూరినరీ ఇన్‌కాంటినెన్స్‌ (ఎస్‌యూఐ) అంటారు. ఇక్కడ స్ట్రెస్‌ అంటే మానసిక ఒత్తిడి కాదు. మూత్రసంచి లేదా దాని పరిసరాల్లో ఉండే కండరాలపై పడే చిన్నపాటి ఒత్తిడిని కూడా తట్టుకోలేకపోవడమని అర్థం. ఇది మహిళల్లో చాలా ఎక్కువగా కనిపించే సమస్య. ప్రసవం సమయాల్లో గర్భసంచి నుంచి శిశువు బయటకు వచ్చే మార్గం (బర్త్‌ కెనాల్‌) చాలా ఎక్కువగా సాగడం, ఎక్కువ సార్లు కాన్పులు కావడం (మల్టిపుల్‌ వెజినల్‌ డెలివరీస్‌) వంటి అనేక అంశాలు... మూత్రవిసర్జనను నియంత్రించే కండరాలను బలహీనపరచడం వల్ల ఈ సమస్య వస్తుంటుంది. ఓవర్‌ యాక్టివ్‌ బ్లాడర్‌ ఉన్నవారి కంటే స్ట్రెస్‌ యూరినరీ ఇన్‌కాంటినెన్స్‌ సమస్య ఉన్న మహిళలకు ఇవ్వాల్సిన చికిత్స ఒకింత వేరుగా ఉంటుంది.

కారణాలు 
► ఏదైనా కారణాలతో మెదడు, వెన్నుపూసలోని నరాలు దెబ్బతినడంతో తలెత్తే నాడీ సంబంధ సమస్యల వల్ల.  

పక్షవాతం, మల్టిపుల్‌ స్కిరోసిస్, పార్కిన్‌సన్స్‌ డిసీజ్‌ వంటి వాటి కారణంగా.

వయసు పెరుగుతున్న కొద్దీ బ్లాడర్‌ కండరాలు బలహీనం కావడం (ఇది అందరిలో జరిగే పరిణామం కాదు... కేవలం కొద్దిమందిలోనే).  

వెన్నుపూస లేదా పెల్విక్‌ లేదా నడుముకు సర్జరీ జరిగిన కొంతమందిలో.  

కెఫిన్‌ / ఆల్కహాల్‌ / కొన్ని ఓవర్‌ ద కౌంటర్‌ మందుల వల్ల.

ఇన్ఫెక్షన్ల (ముఖ్యంగా యూరినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్స్‌) వల్ల.  

స్థూలకాయం వల్ల.

మహిళల్లో మెనోపాజ్‌ తర్వాత దేహంలో ఈస్ట్రోజెన్‌ వంటి హార్మోన్ల లోపం వల్ల. 


డా. శివరాజ్‌ మనోహరన్‌
కన్సల్టెంట్‌ యూరాలజిస్ట్, యాండ్రాలజిస్ట్‌ – రీనల్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ సర్జన్‌. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top