Varsha Mahendra: అక్కడ కేవలం బ్లవుజులే! ఒక్కో దాని ధర రెండున్నర వేల నుంచి 20 వేల వరకు..

Fashion: Hyderabad Varsha Mahendra Designing Ideas Jus Blouse Inspiring - Sakshi

డిజైన్‌ల వర్షం 

ఏ ఇద్దరు మనుషులూ ఒక్కలా ఉండరు. ఏ ఇద్దరి అభిరుచులూ ఒక్కలా ఉండవు. మరి ధరించే దుస్తులు మాత్రం ఒకేలా ఎందుకుండాలి? దేనికది ప్రత్యేకంగా ఎందుకు ఉండకూడదు? ఇది ఓ సందేహం. చీరల కోసం వందలాది షోరూమ్‌లున్నాయి. బ్లవుజుకు ఒక్క షో రూమ్‌ కూడా ఉండదెందుకు? మరో సందేహం.

అది లేదు... ఇది లేదు... అనుకోవడం కాదు,  ఆ ఖాళీని నేనే ఎందుకు భర్తీ చేయకూడదు? ఇన్ని సందేహాలు, సమాధానాల మధ్య రూపుదిద్దుకున్న ఐడియా  ‘డిజైనింగ్‌ ఐడియాస్, జస్‌ బ్లవుజ్‌’. హైదరాబాదీ డిజైనర్‌ వర్షామహేంద్ర ఆలోచనల నుంచి పుట్టుకొచ్చిన ఓ కొత్త ఆలోచన ఆ తర్వాత వందలాది మందికి ఉపాధి మార్గంగా మారింది. 

వర్షామహేంద్రది హైదరాబాద్‌లో స్థిరపడిన గుజరాతీ కుటుంబం. హైదరాబాద్, సెయింట్‌ ఫ్రాన్సిస్‌ నుంచి బి.ఎ ఎకనమిక్స్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసింది. ‘‘మా నాన్న వ్యాపారి. అమ్మ స్కూల్‌ టీచర్‌. నాకు డెస్క్‌ జాబ్‌ నచ్చేది కాదు. నాన్నలాగ బిజినెస్‌నే కెరీర్‌గా ఎంచుకోవాలని ఉండేది. అదే సమయంలో కెరీర్‌ సృజనాత్మకంగా, నాకంటూ ప్రత్యేకమైనదిగా ఉండాలనే కోరిక కూడా ఉండేది.

దాంతో డిగ్రీ పూర్తయిన తర్వాత ముంబై, జేడీ ఫ్యాషన్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఏడాది డిప్లమో కోర్సు చేశాను. పెళ్లి చేసుకుని ఢిల్లీ వెళ్లడం నా లక్ష్యాన్ని సులువు చేసింది. అక్కడ నిఫ్ట్‌లో ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సు చేశాను. నా పెళ్లి చీరలు, బ్లవుజ్‌ల అనుభవంతో కోర్సులో చేరినప్పటి నుంచి ప్రత్యేకమైన దృష్టితో ఫ్యాషన్‌ ప్రపంచాన్ని గమనించగలిగాను. ఆంధ్రప్రదేశ్‌ హ్యాండీ క్రాఫ్ట్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీహెచ్‌డీసీ) కోసం పని చేయడం నాకు మంచి అవకాశం.


వర్షామహేంద్ర 

క్లోతింగ్‌లో అనేక ప్రయోగాలు చేశాం. కలెక్షన్‌ ఆఫ్‌ డిజైన్స్‌ నా బలం. అలాగే సెంట్రల్‌ కాటేజ్‌ ఇండస్ట్రీస్‌ నిర్వహించిన వడపోతలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన ఆరువందల మందిలో ముగ్గురిని ఎంపిక చేశారు. అందులో నేనూ ఉండడంతో నాకు సొంతంగా నా బ్రాండ్‌ను విజయవంతం చేయగలననే నమ్మకం వచ్చింది. ఆ నమ్మకంతోనే 2010లో హైదరాబాద్‌కి వచ్చిన తర్వాత సొంత స్టార్టప్‌ ప్రారంభించాను.

ఇండియన్‌ బిజినెస్‌ స్కూల్‌– గోల్డ్‌మాన్‌సాచె ఫెలో పదివేల మంది మహిళల్లో స్థానం లభించడం నాకు మంచి సోపానం అయింది. ఇంటర్న్‌షిప్‌ కోసం న్యూయార్క్‌కి వెళ్లే అవకాశం వచ్చింది. క్లింటన్‌ గ్లోబల్‌ ఇనిషియేటివ్‌ ఆహ్వానం అందింది. దాదాపుగా రెండు నెలలు అక్కడ క్రాఫ్ట్‌మెన్‌ను, విద్యార్థులను సమన్వయం చేస్తూ వాళ్లతో కలిసి పని చేసే అవకాశం ఒక టర్నింగ్‌ పాయింట్‌ అనే చెప్పాలి.  

2014లో యునైటెడ్‌ నేషన్స్‌ కార్యక్రమానికి హాజరయ్యాను. అది నా ఫస్ట్‌ ఫ్యాషన్‌ షో. న్యూయార్క్‌ ట్రేడ్‌ ఫెయిర్‌లో పాల్గొన్నాను. ఇన్ని వేదికల మీద విజయవంతంగా ప్రదర్శనలు ఇచ్చిన తర్వాత ... కేవలం బ్లవుజ్‌ల కోసమే ఒక వేదికకు రూపకల్పన చేస్తూ నేను స్టార్టప్‌ ప్రారంభించడం తెలివైన నిర్ణయమే అని అనిపించింది.  

మార్కెట్‌ స్టడీ చేయలేదు
మామూలుగా స్టార్టప్‌ ప్రారంభించే ముందు మార్కెట్‌ స్టడీ చేయాలి. కానీ నేను మార్కెట్‌లో ఉన్న గ్యాప్‌ని గుర్తించగలిగాను. అదే నా విజయ రహస్యం. నాతోపాటు ఇద్దరు ఉద్యోగులతో మొదలైన స్టార్టప్‌ ఇప్పుడు డెబ్బై మందితో పని చేస్తోంది. వెయ్యి నుంచి పన్నెండు వందల బ్లవుజ్‌లు ఒక చోట దేనికది ప్రత్యేకంగా ఉంటే ఇంకేం కావాలి. ఒక్కో బ్లవుజ్‌ ధర రెండున్నర వేల నుంచి ఇరవై వేల వరకు ఉంటుంది.

ఒకప్పుడు చీర కొనుక్కుని బ్లవుజ్‌ కోసం మ్యాచింగ్‌ సెంటర్‌లకు వెళ్లేవాళ్లు. ఇప్పుడు నచ్చిన డిజైనర్‌ బ్లవుజ్‌ కొని ఆ తర్వాత దానికి సరిపడే సింపుల్‌ చీరను సెలెక్ట్‌ చేస్తున్నారు. బ్లవుజ్‌ హైలైట్‌ కావడమే ఫ్యాషన్‌ ట్రెండ్‌గా చేయగలిగాను. ఇది ఫ్యాషన్‌ రంగానికి నా కంట్రిబ్యూషన్‌ అని గర్వంగా చెప్పగలను. ఎందుకంటే రెండు దశాబ్దాలుగా నేను ఫ్యాషన్‌ రంగంలో ఉన్నాను. దేశవిదేశాల ఫ్యాషన్‌ వేదికలను చూశాను.

మన భారతీయ వస్త్రధారణలోనే ప్రయోగాలు చేయడానికి అవకాశం ఎక్కువ. ఇక నా స్వీయ అనుభవంలోకి వస్తే... నా పెళ్లికి హెవీ చీర కొనేశాను. బ్లవుజ్‌ కుట్టించుకోవడానికి పెద్ద–చిన్న టైలర్‌ల చుట్టూ తిరిగాను. ఏ మాత్రం సంతృప్తిగా అనిపించలేదు. నా అసంతృప్తి నుంచి నేను డిజైన్‌ చేసుకున్న ఫ్యాషన్‌ ఇది. నేను సృష్టించుకున్న కెరీర్‌ ఇది. అప్పుడు నేను సృష్టించిన ట్రెండ్‌ వందలాది మందికి ఉపాధి మార్గం అయిందంటే ఎంతో సంతోషంగా కూడా ఉంది’’ అన్నారు వర్షామహేంద్ర. 

ఎల్లలు దాటిన మన నేత 
మన సంప్రదాయ నేతకు ఆదరణ తగ్గి నేతకారుల ఇంటి కొత్త తరం ఇతర వృత్తుల్లోకి వెళ్లిపోతున్న రోజుల్లో వర్ష వీవింగ్‌ ఫ్యూజన్‌కు తెర తీశారు. నేతకారుల జీవిక కోసం సహాయం చేస్తున్న యూకేలోని ఎన్‌జీవోతో కలిసి పోచంపల్లి నేతకారుల కోసం పని చేశారామె. అలాగే ఇప్పుడు పైథానీ, కంచిపట్టు, నారాయణపేట, చీరాల, లక్నో నేతకారులు, ఉదయ్‌పూర్‌–జైపూర్‌ బ్లాక్‌ ప్రింటింగ్‌ కళాకారులు, కోల్‌కతా రేషమ్‌ కళాకారులతో కలిసి ఒక చీరలో రెండు – మూడు రకాల సమ్మేళనానికి రూపమిస్తున్నారు.

‘‘ఒక చీరను విదేశీ వేదిక మీద ప్రదర్శించినప్పుడు దాని గురించి వివరించడానికి బోలెడంత సమాచారం ఉంటుంది. మన వస్త్ర విశేషం అదే’’ అన్నారామె. చీరకు చక్కటి కట్టు అందాన్ని తెస్తుంది, బ్లవుజ్‌కి చక్కటి కుట్టు అందాన్ని తెస్తుంది. ఈ రెండింటినీ మేళవించడంలో సక్సెస్‌ అయ్యారు వర్ష. 
– వాకా మంజులారెడ్డి 

చదవండి👉🏾Fashion Blouse Trend: డిజైన్‌లను బట్టి బ్లౌజ్‌కు రూ.600 నుంచి 5వేల వరకు చార్జీ!  రోజుకు రూ. 1000 వరకు వస్తున్నాయి!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top