గుజరాత్‌ ఎగ్జామ్‌ పేపర్‌.. హైదరాబాద్‌లోనే ‘లీకు’వీరులు! 

Gujarat Panchayat Junior Clerk Exam Postponed - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గుజరాత్‌ పంచాయత్‌ సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డ్‌(జీపీఎస్‌ఎస్‌బీ) నిర్వహించతలపెట్టిన పంచాయత్‌ జూనియర్‌ క్లర్క్‌ పరీక్షపత్రం లీక్‌ లింకులు హైదరాబాద్‌లో బయటపడ్డాయి. నగర శివార్లలో ఉన్న కేఎల్‌ హైటెక్‌ ప్రింటింగ్‌ ప్రెస్‌లో ముద్రితమైన ఈ పరీక్షపత్రం అక్కడ నుంచే బయటకు వచి్చనట్లు తేలింది. దీంతో ఆదివారం మధ్యాహ్నం మెరుపుదాడి చేసిన ఆ రాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌(ఏటీఎస్‌) అధికారులు ఇద్దరు నిందితులను అరెస్టు చేసి తీసుకువెళ్లారు. ఇప్పటివరకు ఈ లీకేజ్‌ స్కామ్‌లో మొత్తం 15 మంది అరెస్టు అయ్యారు.

ఈ పరిణామాల నేపథ్యంలో ఆదివారం జరగాల్సిన పరీక్షను జీపీఎస్‌ఎస్‌బీ రద్దు చేసింది. వాస్తవానికి గుజరాజ్‌ పంచాయత్‌ శాఖలో 1,181 పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ చేయగా 9.53 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఆ రాష్ట్రంలోని 2,995 కేంద్రాల్లో పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. అయితే శనివారంరాత్రి ఈ పేపర్‌ లీక్‌ జరిగినట్లు ఏటీఎస్‌కు ఉప్పందడంతో వడోదరలోని అట్లాదర ప్రాంతంలో ఉన్న ఓ కోచింగ్‌ సెంటర్‌పై అధికారులు దాడి చేశారు. ఈ సెంటర్‌ నిర్వాహకుడు భాస్కర్‌ చౌదరితోపాటు ఏడుగురిని అరెస్టు చేసిన ఏటీఎస్‌ అక్కడ ఉన్న పరీక్షపత్రం ప్రతులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడుగురిలో ఇద్దరు 2019 నాటి బిట్స్‌ పిలానీ ఆన్‌లైన్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ గోల్‌మాల్‌ వ్యవహారంలో ఉన్నారని, అప్పట్లో సీబీఐ ఈ ద్వయాన్ని అరెస్టు చేసిందని ఏటీఎస్‌ ప్రకటించింది.  

ఒడిశా నుంచి..: భాస్కర్‌చౌదరి గుజరాత్‌లోని వివిధ నగరాలతోపాటు బిహార్, ఒడిశాల్లోనూ పోటీ పరీక్షల కోసం కోచింగ్‌ సెంటర్లు నిర్వహిస్తున్నాడు. ఒడిశాలో మరో కోచింగ్‌ సెంటర్‌ నిర్వాహకుడు ప్రదీప్‌ నాయక్‌ ద్వారా తనకు పరీక్షపత్రం అందిందని, దాని కోసం భారీ మొత్తం ఖర్చు చేశా నని విచారణలో అతడు బయటపెట్టాడు. ఈ క్రమంలో హైదరాబాద్‌ లింకులు వెలుగుచూశాయి. వివిధ సెట్స్‌ పరీక్షపత్రాలు ముద్రించే బాధ్యతల్ని జీపీఎస్‌ఎస్‌బీ ఐడీఏ బొల్లారంలోని కేఎల్‌ హైటెక్‌ ప్రింటింగ్‌ ప్రెస్‌తోపాటు ఏపీలో ఉన్న మరో ప్రెస్‌కు అప్పగించింది.

ఈ ప్రెస్‌లో ఒడిశాకు చెందిన జీతి నాయక్, సర్దోకర్‌ రోహా పనిచేస్తున్నారు. జీతినాయక్‌కు ప్రదీప్‌నాయక్‌తో కొన్నేళ్లుగా పరిచయం ఉంది. జీతి ఈ పేపర్‌ను అతడికి విక్రయించి సొమ్ము చేసుకోవాలని పథకం వేశాడు. సర్దోకర్‌ రోహా సహకారంతో పరీక్షపత్రాన్ని ప్రింటింగ్‌ ప్రెస్‌ నుంచి తస్కరించాడు. దీన్ని వాట్సాప్‌ ద్వారా ప్రదీప్‌కు పంపగా, అతడి నుంచి భాస్కర్‌కు చేరింది. ఈ వ్యవహారంలో మరికొందరు మధ్యవర్తులుగా వ్యవహరించారని ఏటీఎస్‌ గుర్తించింది. వీరితోపాటు ఆయా కోచింగ్‌ సెంటర్ల నిర్వాహకులతో ఒప్పందాలు చేసుకున్న అభ్యర్థుల కోసం గాలిస్తోంది.   

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top