మీ ఫ్యామిలీ బడ్జెట్‌ వేశారా?

Family budget: Tips for the self-employed to build their emergency fund nest faster - Sakshi

ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, మార్చి వచ్చేసరికి ప్రభుత్వాలు బడ్జెట్‌ పై కసరత్తు చేస్తుంటాయి. అది పెద్దస్థాయి కదా మనకెందుకులే అని వదిలేయద్దు. ఎందుకంటే, ఖర్చు ఎక్కడ పెట్టాలి..? ఎక్కడ తగ్గించుకోవాలి..? ఎంత మొత్తం పొదుపు చేయాలి..? వీటన్నింటికంటే ముందు ఆదాయం ఎంత? అన్న అంశాలపై అవగాహన ప్రతి కుటుంబానికీ కూడా ఉండాలి. అదే బడ్జెట్‌ ప్లానింగ్‌. మొన్న కేంద్ర బడ్జెట్‌ విడుదలైంది. ఇప్పుడు మన ఫ్యామిలీ బడ్జెట్‌ వంతు వచ్చింది. ఏమంటారు?  

నెలవారీ జీతాలతో లేదా స్వయం ఉపాధితో జీవనం సాగించే వారికి నెలవారీ బడ్జెట్‌ ప్లానింగ్‌ అత్యవసరం. మనకు వచ్చేదెంత? అందులో మనం దేనికి, ఎంత ఖర్చుపెట్టాలి..? ఎక్కడ ఆదా చేయాలి..? అన్న అంశాలపై అవగాహన ఉంటే ఇంటి నిర్వహణ సులువు అవుతుంది. బడ్జెట్‌ ప్లానింగ్‌ ఉంటే మీ నెలవారీ ఖర్చులను సులభంగా నిర్వహించుకోవచ్చు.

అత్యవసర పరిస్థితి కోసం కొంత మొత్తం
జీవితంలో పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు. అందుకే కొంత మొత్తాన్ని అత్యవసర పరిస్థితుల్లో వినియోగించుకోవడానికి వీలుగా.. మీ చేతికి వస్తున్న సంపాదనలో 20 నుంచి 30 శాతం వరకూ పొదుపు చేయడం మంచిది. ఒకవేళ ఇంత మొత్తంలో చేయలేకపోయినా.. అవకాశం ఉన్న మేరకు పక్కన పెట్టాలని పెద్దల సలహా.

కుటుంబ సభ్యుల ఆమోదం:
ఫలానా దానికి ఇంత మొత్తం ఖర్చు పెట్టాలి అని మీరు ఒక గట్టి నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి ఇంట్లోని ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలి. అలా ఉండాలంటే ముందుగా మీరు చేయాల్సింది... నెలవారీ బడ్జెట్‌ ప్లానింగ్‌ కోసం కుటుంబ సభ్యులందరినీ కూర్చోబెట్టి వివరించాలి. రాబడి, ఖర్చుల విషయాలను అందరితో చర్చించాలి. అప్పుడు వారికి కూడా అవగాహన ఏర్పడి, ఖర్చులు తగ్గించుకునే అవకాశం ఉంటుంది.

వృథాను అరికట్టాలి
మనం పొదుపు చేయాలి అంటే కుటుంబంలో అనవసర ఖర్చులను తగ్గించుకోవాలి. ఏది అవసరం, ఏది అనవసరం అనే అవగాహన ఉండాలి. ముఖ్యంగా వృథా ఖర్చులను తగ్గించాలి. సరుకులు లేదా వస్తు సామగ్రిని ఎక్కువెక్కువ తెచ్చుకోవడం, ఇష్టం వచ్చినంత వండటం, పారెయ్యటం వల్ల ఎంతో డబ్బు వృథా అవుతుంది. అందువల్ల అట్లాంటి వృథాకు అడ్డుకట్ట వేయాలి.

క్రెడిట్‌ కార్డుతో జాగ్రత్త..
క్రెడిట్‌ కార్డు ఉన్నది అత్యవసర సమయంలో ఉపయోగపడటానికి మాత్రమే అని గుర్తుంచుకోవాలి. చేతిలో కార్డు ఉంది కదా అని విచ్చలవిడిగా ఖర్చుపెట్టకూడదు. మీ నెలవారీ రాబడిని అంచనా వేసుకొని అప్పుడు మాత్రమే కార్డును వినియోగించాలి.

పొదుపు పథకాల్లో..
ఇలా ప్రతి నెలా బడ్జెట్‌ ప్లానింగ్‌ చేసుకొని ఆదా చేసిన సొమ్మును ఖతాలో అలా ఉంచకుండా.. మార్కెట్‌ రిస్క్‌ లేని పెట్టుబడి పథకాలు అంటే గోల్డ్, రియల్‌ ఎస్టేట్‌ వంటి వాటిల్లో పెట్టుబడులు పెట్టాలి. అప్పుడు దీర్ఘకాలంలో  మంచి రాబడులు వచ్చే అవకాశం ఉంటుంది.

పొదుపు ఎంత ఉండాలి?
ఇది కాస్త క్లిష్టమైన ప్రశ్నే. పొదుపు చేయాలంటే ముందు మన ఆదాయాన్ని అంచనా వేసుకోవాలి. ఎందుకంటే, ఆదాయాన్ని బట్టి పొదుపు శాతం పెరుగుతూ, తరుగుతూ ఉంటుంది. అయితే, ఆదాయంతో సంబంధం లేకుండా, సాధారణ కుటుంబ ఖర్చులు మినహా మరే విధమైన అదనపు ఖర్చులూ లేకుండా ఉంటే పొదుపు ఎంత ఉండాలో చెప్పడానికి కొన్ని సూత్రాలు...

ప్రతి మనిషి కనీసం ఆరునెలల జీతం లేదా ఆదాయాన్ని నగదు రూపంలో దాచుకోవాలి. ఒకవేళ ఒకేసారి అలా దాచుకోలేని వారు నెలనెలా కొంత పక్కనపెడుతూ ఎమర్జెన్సీ ఫండ్‌ ఏర్పాటు చేసుకోవాలి. కుటుంబ ఖర్చుకు సమానమైన ఆదాయం లేదా అంతకంటే తక్కువ ఆదాయం ఉన్న దిగువ మధ్యతరగతి వారు తమ ఆదాయం లో ఐదు నుంచి పది శాతం పొదుపు చేయాలి. పొదుపు చేయడానికి మిగలక పోయినా ఆదాయాన్ని పెంచుకోవడం ద్వారానో, ఖర్చును తగ్గించుకోవడం ద్వారానో కచ్చితంగా పొదుపు చేయాలి. నెలవారీ సగటు కుటుంబ ఖర్చు కంటే ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించేవాళ్లు నెలనెలా 25 శాతం పొదుపు చేయాలి. ఒకవేళ భార్యాభర్తలిద్దరూ సంపాదిస్తుంటే భర్త ఇంటి ఖర్చులు పెడతారు కాబట్టి భార్య 50 శాతం పొదుపుచేయాలి. అధికాదాయ వర్గాలు అయితే కుటుంబ ఆదాయంలో సగం పొదుపునకు మళ్లించాలి. భవిష్యత్తులో ఆదాయం పొరపాటున తలకిందులైతే ఎలాంటి విపత్కర పరిస్థితి వచ్చినా ఇలా చేసిన పొదుపు ఆదుకుంటుంది.  

పొదుపు మార్గాలు కొన్ని...
► అవసరం లేకుండా డిస్కౌంట్లలో వచ్చే వస్తువులు కొనద్దు.
► అవసరానికి ముందే ఏ వస్తువులనూ కొనుగోలు చేయకండి.
► నిర్దిష్ట తేదీల్లోపు బిల్లులు చెల్లించండి. దీని కోసం బిల్స్‌ పే క్యాలెండర్‌ తయారు చేసుకోవాలి.
► మీ బ్యాంకు ఖాతాలు ప్రతి నెల చివరన చూసుకోండి. వృథా ఖర్చులు తెలుస్తాయి. వృథా ఖర్చుల జాబితా రాయండి. ప్రతినెలా ఎంత వృథా పోతుందో తెలిస్తే ఆటోమేటిక్‌గా అప్రమత్తత పెరుగుతుంది.
► ఏ వస్తువు కొనాలన్నా ఇంటర్నెట్‌æద్వారా వివిధ మాల్స్‌/దుకాణాల్లో వాటి ధరల తేడాలు చూసి ఎక్కడ తక్కువో అక్కడ కొనండి. ఎందుకంటే ప్రతి డీలరు వేర్వేరు ధరలపై వస్తువులను అమ్ముతారు.

చివరగా ఒక మాట... మీ బడ్జెట్‌ ఎంత పకడ్బందీగా ఉంటే భవిష్యత్తు అంత భద్రంగా ఉంటుందని గుర్తు పెట్టుకోండి. అదేవిధంగా మీ పిల్లలకు కూడా ఇప్పటినుంచే పొదుపు చేయడాన్ని అలవాటు చేయండి. వారికి ఇచ్చే పాకెట్‌ మనీతో వారికి కావలసిన వాటిని ఎలా కొనుక్కోవాలో నేర్పించండి. అప్పుడే మీరు పర్‌ఫెక్ట్‌ ఫైనాన్స్‌ మేనేజర్‌ లేదా నిపుణులైన హోమ్‌ మినిస్టర్‌ అవుతారు. ఇంతవరకు మీరు బడ్జెట్‌ వేసుకోకపోతే ఇప్పుడైనా వేయండి.

ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకోవాలి..
మీ బడ్జెట్‌ను నెలవారీ రివ్యూ చేసుకోవాలి. ఏమైనా మార్పులు అవసరం అయితే కచ్చితంగా ఆయా మార్పులు చేసుకోవాలి. ఇందుకోసం మీ కుటుంబ సభ్యుల అభిప్రాయం తీసుకోవాలి. కచ్చితంగా పెట్టవలసిన ఖర్చును పక్కన పెట్టి.. ఇంకా ఏమైనా ఆదా చేసుకునే మార్గం ఉందేమో చూడాలి.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top