
నిజాం పాలనలో రజాకార్ల దాడుల గురించి ముందస్తుగా ప్రజలకు తెలియజేయడానికి గ్రామాల్లో అప్పట్లో బురుజులు నిర్మించారు. బురుజులపై ఎల్లప్పుడూ ఒకరిద్దరు కాపలా ఉండేవారు. గ్రామం పొలిమేర వరకూ కనిపించడానికి బురుజుల చుట్టూ కిటికీ లాంటి నిర్మాణాలుండేవి. అక్కడి నుంచి రజాకార్ల రాకను పసిగట్టి ప్రజలను అప్రమత్తం చేసేవారు. ఈ కట్టడాలు మేడ్చల్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఉన్నాయి. అవి నేటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. ప్రభుత్వం చొరవచూపి వీటిని అభివృద్ధి చేస్తే భావితరాలకు చరిత్రను తెలిపే అవకాశం ఉంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి శామీర్‌పేట మండలం లాల్‌గడి మలక్‌పేటలో, ఘట్‌కేసర్ మండలంలో కొండాపూర్, అంకుషాపూర్, మర్పల్లిగూడలో, మేడ్చల్ మండలంలోని డబిల్‌పూర్, బండమాదారంలో, మేడ్చల్ పట్టణంలో నిజాం రాజుల గుర్రాల కోసం నిర్మించిన గుర్రపుశాల నేటికీ తహసీల్దార్ కార్యాలయంగా వినియోగంలో ఉంది.
వందల ఏళ్లు గడిచినా..
ఆ కట్టడాలు కట్టి వందల ఏళ్లు గడుస్తున్నా నేటికీ చెక్కు చెదరకుండా దృఢంగా ఉన్నాయి. మేడ్చల్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో సుమారు 400 సంవత్సరాల క్రితం రాజులు పాలిస్తుండగా తరచూ చోరీలు జరిగేవి. దీంతో నాటి కాలంలో గ్రామాల నడిబొడ్డున పెద్ద రాతి కట్టడాలు (బురుజులు) నిర్మించారు. అనంతరం రజాకార్ల కాలంలో వారి ప్రవేశాన్ని గుర్తించేందుకు బురుజులను వినియోగించారు.
నాటి సైనికుల విడిది కేంద్రం..
నాడు మేడ్చల్ అటవీ ప్రాంతం కావడంతో రాజులు వేటకు వచ్చేవారు. మేడ్చల్ తహసీల్దార్ కార్యాలయ భవనం సైనికుల విడిది కేంద్రంగా, చుట్టూ ఆవరణలో ఉన్న చిన్న చిన్న గదుల్లో గుర్రాలను కట్టించి ఉంచేవారు. తహసీల్దార్ కార్యాలయం వెనుక ఉన్న మేడ్చల్ పెద్ద మసీదును ప్రార్థనల కోసం నాడు నిర్మించినదే. కాలక్రమేణ నాటి గుర్రపు శాల నేడు మేడ్చల్ తహసీల్దార్ భవనంగా మారింది.
(చదవండి: వేసవి తాపం నుంచి రక్షించే సహజ ఆరోగ్య పానీయాలివే..!)