Kiran Sethi Life Story: ముప్పై నాలుగేళ్ల సర్వీసు.. లేడి సింగం

Delhi Kamla Market Sub Inspector Kiran Sethi Inspirational Story  - Sakshi

ముప్పై నాలుగేళ్ల్ల సర్వీసులో దాదాపు ఎనిమిది లక్షల మంది అమ్మాయిలకు ఆత్మరక్షణ విద్యలో శిక్షణనిచ్చారు ఆమె. మహిళలకు ఉపాధి అవకాశాల కల్పనకు సంబంధించిన వర్కషాప్‌లను నిర్వహిస్తుంటారు. ఢిల్లీలోని కమ్లా మార్కెట్‌లోని పింక్‌ చౌకిలో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా విధులను నిర్వహిస్తున్న కిరణ్‌సేథీ నేరాలకు అడ్డుకట్టవేయడంలో లేడీ సింగం అని పేరుతెచ్చుకున్నారు, సామాజిక సేవలోనూ తన పాత్ర పోషిస్తూ అభినందనలు అందుకుంటున్నారు. 

‘నా ఉద్యోగమే సామాజిక సేవ. సమాజ సేవ చేయలేని వ్యక్తి పోలీసు ఉద్యోగం కూడా సరిగా చేయలేడు. ముప్పై నాలుగేళ్ల క్రితం నా బ్యాచ్‌ నుంచి వచ్చిన మొదటి మహిళా పోలీసును. జాయిన్‌ అయినప్పుడు మా పోలీస్‌స్టేషన్‌లో ఉన్న బోర్డుపై ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ రాశారు’ అని చెబుతారు కిరణ్‌ సేథీ.

కరాటేలో శిక్షణ
1992లో జూడోలో బ్లాక్‌ బెల్ట్‌ సాధించిన ఈ లేడీ సింగం మహిళా కానిస్టేబుళ్లకే కాదు, పురుషులకూ జూడో–కరాటేలో శిక్షణ ఇస్తుంటారు. ‘ఆరుగురు సైనికులకు కూడా శిక్షణ ఇచ్చాను. చదువులో కూడా రాణించాలనుకున్నాను. అందుకు ఐదు పీజీలు పూర్తిచేశాను. 

గుండాలకు ఎదురెళ్లి
ఓ రోజు డ్యూటీకి వెళుతున్నప్పుడు ఒకమ్మాయిని బలవంతంగా ఆటోలో కూర్చోబెట్టడం చూశాను. వెళ్లి అడిగితే బెదిరింపులతో పాటు బ్లేడ్‌తో దాడికి దిగారు. ఆ రోజు నేను సివిల్‌ డ్రెస్‌లో ఉన్నాను. దీంతో గుండాల బెదిరింపు మరింత ఎక్కువయ్యింది. ఒకరోజు పార్కులో చిన్నారులు ఆడుకుంటున్నారు, మహిళలు నడుస్తున్నారు. అలాంటి ప్లేస్‌లో ఒక వ్యక్తి తన ప్రైవేట్‌ పార్ట్‌ను చూపించి, వేధించడం దృష్టికి వచ్చింది. వెంటనే అక్కడికక్కడే బుద్ధి చెప్పడంతో పాటు కటకటాల వెనక్కి పంపించాను. ఒక్కోసారి రోజుకు మూడు నాలుగు కేసులు వస్తుంటాయి. రాత్రి, పగలు అని ఉండదు. 

ఆనందం ముఖ్యం
అలాగని, వ్యక్తిగత జీవితాన్ని ఇబ్బందిలో పెట్టుకోకూడదు. ఆహ్లాదంగానే ఉంచాలి. మహిళా పోలీసులకు కుటుంబం మద్దతు చాలా అవసరం ఉంటుంది. కుటుంబానికి తగినంత సమయం కేటాయించడంతో పాటు, తమ విధులను అర్ధమయ్యే విధంగా చెప్పాల్సి ఉంటుంది. లోలోపల ఆనందంగా ఉన్న వ్యక్తి ఇతరులను ఎప్పుడూ ఇబ్బంది పెట్టరు. ఎవరికి వారు తమ కోసం కొంత సమయం కేటాయించుకోవాలి. మన శరీరమే దేవాలయం. ఎంత శుద్ధిగా ఉంటే, మన చుట్టూ పరిసరాలను కూడా అంతే బాగా ఉంచగలుగుతాం. పనిలో త్వరగా అలసిపోవడం జరగదు. సాధారణంగా రోజూ ఉదయం ఐదు గంటల నుంచి ఓ గంట సేపు యోగా, మరో గంట చదువు ఉంటుంది. ఆ తర్వాత విధుల్లో భాగంగా ఉంటూనే స్ట్రీట్‌ చిల్డ్రన్‌ని పోలీస్‌ స్టేషన్‌కి పిలిపించి చదువు చెప్పించడం, మహిళలకు హస్తకళల పట్ల శిక్షణ, అమ్మాయిలకు ఆత్మరక్షణ విద్యలు నేర్పించడం చేస్తుంటాను. 

సంస్కరణ బాధ్యత
నేరస్తులను పట్టుకున్నప్పుడు వారిని ముందు సంస్కరించాలనుకుంటాను. జీవితాన్ని మార్చుకోవడానికి ప్రయత్నిస్తాననుకున్నవారికి అవకాశం ఇవ్వడంతో పాటు ప్రభుత్వ పథకాలు అందజేసేలా చూడటం బాధ్యతగా తీసుకుంటాను. ఆ విధంగా శత్రువులు అనుకున్నవారు కాస్తా మిత్రులు అయ్యారు’ అని వివరిస్తారు కిరణ్‌ సేథీ.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top