Cyber Crime Prevention Tips: నకిలీలలు.... ముద్ర కాని ముద్ర.. నిర్లక్ష్యం చేశారో ఇక అంతే సంగతులు!

Cyber Crime Prevention Tips: How To Protect From Biometric Scan Fraud - Sakshi

సైబర్‌ టాక్‌

ఈ రోజుల్లో మోసగాళ్ల చేతికి దొరికిన కొత్త ఆయుధం నకిలీ బయోమెట్రిక్‌. దీని ద్వారా వివిధ రకాలుగా మన వేలిముద్రలు, ముఖాలు, ఐరిస్, అరచేతి ముద్రలు.. వంటివి సేకరించి ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు సైబర్‌ నేరగాళ్లు. ఆధార్‌లో రికార్డ్‌ చేసిన వేలిముద్రను నకిలీ పద్ధతుల్లో దొంగిలించి, వాటి ద్వారా స్కామ్‌లకు పాల్పడుతున్నారు.

వీటిలో పట్టణాలతో పోల్చితే గ్రామాల్లో నకిలీ బయోమెట్రిక్‌ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. మన దేశంలో ఎప్పటికప్పుడు పెరుగుతున్న డిజిటలైజేషన్‌తో (మొబైల్‌ డేటా లేదా డిజిటల్‌ బ్యాంకింగ్‌ ప్లాట్‌ఫారమ్‌ల వల్ల) అందరికీ తమ గుర్తింపును కాపాడుకోవడం అతిపెద్ద సవాల్‌గా మారింది. వాటిలో బయోమెట్రిక్‌ ఒకటి. 

బయోమెట్రిక్‌ స్కాన్‌... స్కాన్‌ ఆధారంగా వ్యక్తుల అసలైన గుర్తింపును సూచిస్తుంది బయోమెట్రిక్‌. ప్రత్యేకమైన జీవ లక్షణాలను ఉపయోగించి అత్యంత విశ్వసనీయంగా, సమయానుకూలంగా వ్యక్తులను గుర్తించడానికి, ప్రామాణీకరించడానికి అత్యంత ప్రభావవంతమైన పద్ధతి.

ఇది వ్యక్తిగత ‘ఐడీ’ కార్డ్‌లు, మాగ్నెటిక్‌ కార్డ్‌లు, కీ లేదా పాస్‌వర్డ్‌ల వంటి సంప్రదాయ ప్రామాణీకరణ పద్ధతులను రూపుదిద్దుతుంది. దీని ద్వారా దొంగతనం, కుట్ర లేదా నష్టం సులభంగా జరగదు. అయితే, సాధారణంగా దురాశ లేదా భయం కారణంగా ప్రజలు సులభంగా నేరగాళ్ల ఉచ్చులో పడటం వంటి సామాజిక ఇంజనీరింగ్‌ వ్యూహాల కారణంగా బయోమెట్రిక్‌ యాక్సెస్‌ కోల్పోతుంది.

నకిలీ బయోమెట్రిక్స్‌... 
►ఆస్తి రిజిస్ట్రేషన్‌ వంటి ఆర్థికేతర లావాదేవీల కోసం మోసగాళ్లు బయోమెట్రిక్‌ ద్వారా ఇన్‌సైడర్‌లను ఉపయోగిస్తారు. వాటిలో నకిలీ వేలిముద్ర, అలాగే వ్యక్తి ఆధార్‌ కార్డ్‌ నంబర్‌ను తీసుకుంటారు
►ఎమ్‌–సీల్, ఫెవికాల్‌ ఉపయోగించి ప్రింట్‌ తీసుకుంటారు.
►వేలిముద్రను https://www.remove.bg/ అప్‌లోడ్‌ చేయడం, ఆపై సెల్లోఫేన్‌ టేప్‌పై ప్రింట్‌ చేయడం ద్వారా వేలిముద్ర కచ్చితమైన ప్రతిరూపాన్ని రూపొందించడానికి మోసగాళ్లు సులభమైన పద్ధతులను ఉపయోగిస్తారు
►అలా పొందిన వేలిముద్రలను పెద్ద సంఖ్యలో డార్క్‌ వెబ్‌లో అప్‌లోడ్‌ చేస్తారు

►వేలిముద్ర ప్రతిరూపాన్ని సృష్టించిన తర్వాత, మోసగాడు ఆధార్‌ కార్డ్‌ నంబర్‌ ఏదైనా బ్యాంక్‌ ఖాతాకు లింక్‌ చేయబడిందో లేదో చెక్‌ చేస్తాడు.
►ఏదైనా ఆర్థిక లావాదేవీ కోసం కార్డ్‌ని ఉపయోగించే క్రమంలో ఇది చాలా కీలకమవుతుంది.
►బ్యాంక్‌ ఖాతాలకు లింక్‌ చేయబడిన అధార్‌ నెంబర్లతో తీసుకున్న నకిలీ బయోమెట్రిక్‌ను మోసగాడు మైక్రో ఎటీఎమ్‌ లేదా ఆధార్‌ ఆధారిత చెల్లింపు ప్రాసెసింగ్‌కు మద్దతు ఇచ్చే ఏ హ్యాండిల్డ్‌ పరికరంలోనైనా ఉపయోగించడానికి సిద్ధంగా ఉంటాడు. 

ఇలా రక్షించుకోవాలి...
►వేలిముద్రలు ఎవరైనా దొంగిలించినట్లయితే వాటిని మార్చలేరు అనేది వాస్తవం.
►ఆధార్‌ వ్యవస్థలో సాంకేతిక లొసుగు లేనప్పటికీ, ఇటువంటి మోసాల వల్ల మొత్తం వ్యవస్థపై వినియోగదారు నమ్మకాన్ని తగ్గిస్తుంది.
►మొబైల్, ఇమెయిల్‌ (రిజిస్ట్రేషన్‌ / కరెక్షన్స్‌ సమయంలో) ఆధార్‌తో మీ వివరాలను తక్షణమే మార్చడాన్ని సులువు చేసింది.
►ఆధార్‌లో నమోదు చేసిన మీ ఫోన్‌ లేదా ఇ–మెయిల్‌ కోసం వన్‌ టైమ్‌ పాస్‌వర్డ్‌తో ప్రక్రియ పూర్తవుతుంది.

సోషల్‌ ఇంజనీరింగ్‌ స్కామ్‌లకు గురయ్యే అవకాశం ఉన్నందున మీరు మీ ఫోన్‌ను ఎక్కడైనా పోగొట్టుకున్నా లేదా మీ మొబైల్‌ నంబర్‌ను మార్చుకున్నా మీ ఆధార్‌ కార్డ్‌ని వెంటనే అప్‌డేట్‌ చేయడం మర్చిపోవద్దు.
►బయోమెట్రిక్స్‌ లాకింగ్‌ ఐక్యూఐ స్కాన్‌లు, వేలిముద్రలు, ఫొటోగ్రాఫ్‌లు వంటివి ఆధార్‌ కార్డ్‌కి లింక్‌ చేసి ఉంటాయి.
►ఈ విషయంలో మోసం చేయడం అంత సులభం కాదు. అయినా నకిలీ బయోమెట్రిక్‌ కేసులు నమోదయ్యాయి.
►అందుకని, ఆధార్‌ ఇప్పుడు బయోమెట్రిక్‌ లాకింగ్‌ ఎంపికతో వచ్చింది. దీనిని  UIDAI లేదా mAadhaar యాప్‌లో సెట్‌ చేసుకోవచ్చు. 

►వర్చువల్‌ ‘ఐడీ’ అన్ని eKYC ధృవీకరణకు ఆధార్‌ నంబర్‌ స్థానంలో 16 అంకెల సంఖ్యను ఉపయోగించవచ్చు. ఇది అన్ని వర్చువల్‌ లావాదేవీల కోసం ఉపయోగించవచ్చు.
►మీరు https://myaadhaar.uidai.gov.in/ నుండి డౌన్లో‌డ్‌ చేసుకొని, మాస్క్‌డ్‌ విఐడీ ని ఎంపిక చేసుకోవచ్చు.
►మాస్క్‌డ్‌ ఆధార్‌ నంబర్‌ 12 అంకెల సంఖ్య లేకుండా షేర్‌ అవుతుంది (చివరి నాలుగు అంకెలు మాత్రమే కనిపిస్తాయి).
►మాస్క్‌డ్‌ ఆధార్‌ ఎంపిక ప్రాథమికంగా మీ ఆధార్‌ను మాస్క్‌ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.

►UIDAI  పోర్టల్‌కి లాగిన్‌ చేసి, మీ ప్రామాణీకరణను ధృవీకరించుకోవచ్చు.
►ఇళ్ల ముందుకు ముఖ్యంగా గ్రామాల్లోని ప్రజల అమాయకత్వాన్ని, వారి ఆశను ఆసరా చేసుకొని పెన్షన్లు లేదా ప్రభుత్వ లబ్ధి పొందడానికి ఆధార్, వేలిముద్రలను మోసగాళ్లు సేకరిస్తుంటారు.
►అందుకని, ప్రజలు తమ వేలిముద్రలు–ఆధార్‌ నంబర్‌ ఇచ్చేముందు  ప్రభుత్వ సిబ్బంది అవునో కాదో తప్పక నిజనిర్ధారణ చేసుకోవాలి.
-ఇన్‌పుట్స్‌: అనీల్‌ రాచమల్ల, డిజిటల్‌ వెల్‌బీయింగ్‌ ఎక్స్‌పర్ట్, ఎండ్‌ నౌ ఫౌండేషన్‌ 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top