Chrysanthemum: ఎల్‌ఇడీ బల్బుల వెలుగులో చామంతి పూల సాగు! | Sakshi
Sakshi News home page

Chrysanthemum: అన్‌సీజన్‌లో చామంతి పూల సాగు!

Published Tue, May 4 2021 5:54 PM

Chrysanthemum Growing In Artificial Lights: Kurnool Farmer Success Story - Sakshi

మార్కెట్‌లో ఎప్పుడు ఏ పంట దిగుబడులకు గిరాకీ ఉంటుందో అప్పుడు ఆ పంట దిగుబడి వచ్చేలా ప్రణాళిక రూపొందించుకొని పంటలు పండిస్తే రైతులకు ఆదాయం పెరుగుతుంది అనటానికి విద్యాధిక యువ రైతు మంచిరెడ్డి శశికళాధరప్ప చామంతి సాగు అనుభవమే నిదర్శనం. అన్‌సీజన్‌లో చామంతి సాగుకు శ్రీకారం చుట్టి తక్కువ పెట్టుబడితో మంచి నికదాయాన్ని పొందుతున్నారు. వైఎస్సార్‌ కడప జిల్లాలోని ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్తల తోడ్పాటుతో అన్‌సీజన్‌లో కృత్రిమ కాంతితో చామంతి పూల సాగు విధానాన్ని అమలుచేస్తూ శశికళాధరప్ప సత్ఫలితాలు సాధిస్తుండటం విశేషం. 

సాధారణంగా జూన్‌–జూలై నుంచి చామతి పూల సాగు చేపడుతారు. ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో శాఖీయోత్పత్తి జరుగుతుంది. నవంబరు నెల నుంచి పూలు కోతకు వస్తాయి. అయితే, రైతులందరూ ఈ సీజన్‌లో ఒకేసారి సాగు చేయడం, దిగుబడులు ఒకేసారి మార్కెట్‌లోకి వస్తుండటం వల్ల ఒక్కోసారి గిట్టుబాటు ధర లభించదు. ఈ సమస్యను అధిగమించి వేసవిలో పూల దిగుబడి వచ్చేలా శాస్త్రవేత్తల తోడ్పాటుతో శవికళాధరప్ప కృత్రిమ కాంతిని ఉపయోగించి దిగుబడులు తీస్తున్నారు.  

ఎల్‌ఈడీ బల్బుల వెలుగు.. 
శశికళాధరప్ప(31) ఎంసీఏ పూర్తి చేసి 2020–21లోనే కాడిపట్టి సేద్యానికి శ్రీకారం చుట్టారు. మిరప, ఉల్లి, సీజన్‌లో చామంతి సాగు చేపట్టి విశేషంగా రాణిస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో ఎకరా విస్తీర్ణంలో పూర్ణిమ ఎల్లో, పూర్ణిమ వైట్‌ రకాల చామంతి పూల సాగు చేపట్టారు. చామంతిలో శాఖీయోత్పత్తిలో కొమ్మలు బాగా రావడానికి పగటి సమయం ఎక్కువగా ఉండాలి. జనవరి, ఫిబ్రవరి నెలల్లో పగటి సమయం తక్కువగా ఉంటుంది. శాఖీయోత్పత్తిని పెంచుకోవడానికి పగటి సమయం సరిపోకపోతుండటంతో కృత్రిమంగా పగటి సమయాన్ని పెంచుకున్నారు. 

రూ.20 వేలు ఖర్చు చేసి చామంతి పొలం చుట్టూ మూడు మీటర్లకు ఒకటి చొప్పున 84 ఎల్‌ఇడీ బల్బులు అమర్చారు. దీంతో చామంతి పూల తోటలో రాత్రి సమయంలో కూడా పగటి పూట మాదిరిగా వెలుతురు పరుచుకుంది. జనవరి 6 నుంచి ఫిబ్రవరి 10 వరకు కృత్రిమంగా పగటి సమయాన్ని పెంచుకోవడంతో అన్‌ సీజన్‌లో కూడా చామంతిలో కొత్తగా ఇగుర్లు వచ్చాయి. 30 రోజులకు తలలు తుంచడంతో విశేషంగా కొమ్మలు వచ్చాయి. ఇప్పటికి ఒక సారి పూలు కోశారు. 

ప్లాస్టిక్‌ షీట్లతో కృత్రిమ చీకట్లు..
శశికళాధరప్ప ఈ నెలలో కృత్రిమంగా రాత్రి సమయాన్ని పెంచుకోనున్నారు. శాఖీయోత్పత్తి జరిగిన తర్వాత పూ మొగ్గలు ఏర్పడి పువ్వులు వచ్చేందుకు రాత్రి సమయం కనీసం 14 గంటలు అవసరం. 14 గంటలు రాత్రి/ చీకటి వాతావరణం ఉండాలి. ఇందుకోసం ఎకరాలోని చామంతి పూల తోటలో కర్రలు పాతి నల్లటి ప్లాస్టిక్‌ షీట్లు కప్పి కృత్రిమ చీకటిని సృష్టించుకోవడానికి రంగం సిద్ధం చేసుకోనున్నారు. వేసవిలో చామంతి పూల సాగు చేపట్టడం వల్ల చీడపీడల బెడద లేకుండా పోయింది. డ్రిప్‌ సదుపాయం కల్పించుకొని ఎరువులు వినియోగించారు. సూక్ష్మ పోషకాల నివారణకు పార్ములా–1, పార్ములా–2 మందులు పిచికారీ చేశారు. ఇప్పటికే ఒక్కకోత పూలు వచ్చాయి. ఇంకా దాదాపు 50 రోజుల వరకు పూల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. అన్‌సీజన్‌లో చామంతి పూలు లభిస్తుండటం వల్ల నికరాదాయం కనీసం రూ.2 లక్షల వరకు ఉండవచ్చని శశికళాధరప్ప అంచనా వేస్తున్నారు. 
– గవిని శ్రీనివాసులు, సాక్షి, కర్నూలు (అగ్రికల్చర్‌)

రూ. 2 లక్షల నికరాదాయం ఆశిస్తున్నా!
మాకు గ్రామం ప్రక్కనే 8.50 ఎకరాల సారవంతమైన భూమితోపాటు బోరు ఉంది. ఎంసీఏ పూర్తి చేసిన తర్వాత గత ఏడాది వైఎస్‌ఆర్‌ కడప జిల్లా ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్తల సూచనలతో అన్‌సీజన్‌లో చామంతి పూల సాగు చేపట్టాను. అనువుకాని కాలంలో పూల సాగు చేపట్టి కృత్రిమ కాంతి, కృత్రిమ చీకటి కల్పించడం వల్ల పూల సాగు ఆశాజనకంగా ఉంది. పెట్టుబడి రూ.90 వేలు అవుతోంది. రూ.2 లక్షల వరకు నికరాదాయం వస్తుందనుకుంటున్నా.

– మంచిరెడ్డి శశికళాధరప్ప, రామళ్లకోట, వెల్దుర్తి మండలం, కర్నూలు జిల్లా 
(99669 98816, 91823 27249)  

ఇక్కడ చదవండి:
కొత్త బంగారు లోకం.. సతత హరిత పంటలు

Advertisement
Advertisement