Brain Damage: ప్రమాదాల్లో మెదడుకు గాయమైతే!

Brain Damage: Symptoms, Causes, Treatments - Sakshi

ప్రమాదాల్లో తలకు దెబ్బ తగిలితే... మెలకువగా ఉండటం లేదా దెబ్బ బలంగా తగిలితే స్పృహ తప్పిపడిపోవడం... ఈ రెండే అందరికీ తెలిసిన పరిస్థితులు. అయితే ఇలా జరిగినప్పుడు బాధితులు ఏ మేరకు స్పృహలో ఉన్నారనే అంశం ఆధారంగా ఐదు రకాల కండిషన్లలోకి వెళ్లవచ్చు. అవి... స్టూపర్‌ అనే కండిషన్‌లోనా, కోమాలోనా, జీవించే ఉన్నప్పటికీ ఎలాంటి స్పందనలూ లేని జీవచ్ఛవ (వెజిటేటవ్‌ స్టేట్‌ అనే) స్థితిలోనా, లాక్‌డ్‌–ఇన్‌ సిండ్రోమ్‌ అనే దశలోనా... ఇలాంటి పరిస్థితుల్లో చివరిదైన బ్రెయిన్‌డెడ్‌ కండిషన్‌లలో దేనిలో ఉన్నాడని చూస్తారు. తలకు దెబ్బతగిలిన బాధితులు ఎంత త్వరగా కోలుకుంటారు, ఏ మేరకు బాగవుతారు వంటి అంశాలు... అతడు ఏ స్థితిలో ఉన్నాడనే అంశంపై ఆధారపడి ఉంటాయి. ఆ స్థితులపై అవగాహనతో పాటు, తలకు దెబ్బతగిలి మెదడుకు గాయమైందని భావించినప్పుడు చేయాల్సిన పనుల గురించి తెలిపే కథనం.

తలకు దెబ్బ తగిలి, దాని ప్రభావం ఎంతోకొంతైనా మెదడు మీద పడితే ఆ ప్రమాదాన్ని ‘ట్రమాటిక్‌ బ్రెయిన్‌ ఇంజ్యూరీ (టీబీఐ)’ అంటారు. అప్పుడు తలకు తగిలిన దెబ్బ తీవ్రత ఆధారంగా బాధితులు వెళ్లే ఐదు రకాల తీవ్ర పరిస్థితులివి...  
స్టూపర్‌ దశ:  ఈ స్థితిలో కొద్దిగా మాత్రమే కదులుతూ... ఒకవేళ  నొప్పికలిగినా, లేదా గిల్లడం వంటివి చేసినా కాస్త స్పందిస్తారు. 

వెజిటేటివ్‌ స్టేట్‌ : జీవచ్ఛవంగా ఉంటే దశనే వెజిటేటివ్‌ స్టేట్‌గా చెబుతారు. వీరికీ కోమాలో ఉన్న బాధితులకు తేడా ఏమిటంటే... కోమా ఉన్న రోగులకు నిద్ర, మెలకువ దశలు ఉండవు. వెజిటేటివ్‌ స్థితిలో ఉన్నవారిలో కొందరు అకస్మాత్తుగా సాధారణంగా స్పందించవచ్చు. కోమాలో ఉన్న రోగులు పూర్తిగా కళ్లు మూసుకునే ఉంటారు. కాగా జీవచ్ఛవంలా ఉన్న రోగులు కళ్లు మూస్తూ తెరుస్తూ ఉండవచ్చు. శబ్దాలు చేయవచ్చు. చేతులు–కాళ్లు కూడా కదపగలరు. బాధితులు కంటిన్యువస్‌గా నెల (30 రోజుల) పాటు జీవచ్ఛవంలా ఉంటే దాన్ని  ‘శాశ్వత జీవచ్ఛవ స్థితి’ (పర్‌సిస్టెంట్‌ వెజిటేటివ్‌ స్టేట్‌–పీవీఎస్‌) అంటారు. ఇలాంటి వారిలో రోగి మెరుగుపడే పరిస్థితి అన్నది వారి మెదడుకు అయిన గాయం తీవ్రతను బట్టి, బాధితుల వయసును బట్టి ఉంటుంది. చిన్నవయసు వారైతే కోలుకునే అవకాశాలు ఎక్కువ. ఇక గుండెపోటు వచ్చిన కొందరిలో మెదడుకు రక్తం (ఆక్సిజనేటెడ్‌ బ్లడ్‌) అందక వారు జీవచ్ఛవ (వెజిటేటివ్‌) స్థితిలోకి వెళ్లే అవకాశం ఉంది. 

కోమా :  ఇది పూర్తిగా స్పృహ లేని స్థితి. అయితే బాధితులు కొన్నిసార్లు కొద్దిసేపు మాత్రమే కోమాలో ఉండి, మళ్లీ కొద్దిసేపటి తర్వాత స్పృహలోకి వచ్చే అవకాశాలూ ఉంటాయి.  వారు కోమాలో ఉండే వ్యవధి కొద్ది రోజులు మొదలుకొని, కొన్ని వారాలూ లేదా నెలల వరకూ ఉండవచ్చు. కోమాలో ఉన్నవారు పూర్తిగా కళ్లు మూసుకునే ఉంటారు. కోమాలో ఉన్నవారికి నిద్ర, మెలకువ వంటి స్థితులు కలగవు. కోమా నుంచి బయటపడ్డా... కొందరిలో ఎలాంటి స్పందనలూ లేకుండా  జీవచ్ఛవం (వెజిటేటివ్‌ స్టేట్‌)లోనూ ఉండవచ్చు లేదా ఇప్పుడున్న వైద్యవిజ్ఞానం వల్ల చాలామంది మునపటి చైతన్యాన్నీ పొందే అవకాశాలు ఉన్నాయి. 

లాక్‌డ్‌–ఇన్‌ దశ : ఈ కండిషన్‌లో బాధితుడు మెలకువగానే ఉంటాడు. కానీ ఎంతగా ప్రయత్నించినా తన శరీరాన్ని  కదిలించలేడు. అంటే శరీరం పూర్తిగా పారలైజ్‌ అవుతుంది.  పర్‌సిస్టెంట్‌ వెజిటేటివ్‌ స్టేట్‌ (పీవీఎస్‌)లో బాధితుడికి మెదడు పైభాగం పూర్తిగా దెబ్బతిని, కింది భాగం మామూలుగానే ఉంటుంది. కానీ లాక్‌డ్‌–ఇన్‌ దశలో పై భాగం మామూలుగానే ఉండి, కింది భాగం (అంటే బ్రెయిన్‌ స్టెమ్‌) దెబ్బతింటుంది.  లాక్‌డ్‌ ఇన్‌ సిండ్రోమ్‌లో ఉన్న చాలామంది రోగులు తమ కనురెప్పల కదలికల ద్వారా సమాచారాన్ని తెలియజేస్తారు.

వీళ్లలోని కొందరిలో ముఖంలోని కొన్ని కండరాల్లోనూ కదలికలు ఉండవచ్చు. చాలామందిలో కాళ్లూ–చేతులపై నియంత్రణ (మోటార్‌ కంట్రోల్‌) ఉండకపోవచ్చు. అయితే ఇటీవల ఇలాంటి వారితో సంభాషించడానికీ / సమాచారాన్ని పంచుకోవడాని (కమ్యూనికేషన్‌)కి అనేక రకాల ఆధునిక ఉపకరణాలు అందుబాటులోకి వచ్చాయి. 

బ్రెయిన్‌ డెడ్‌ : ఈ స్థితిలో బాధితులకు మెదడులోని సెరిబ్రల్‌ హెమిస్ఫియర్స్‌తో పాటు బ్రెయిన్‌ స్టెమ్‌ పూర్తిగా దెబ్బతింటుంది. ఫలితంగా మెదడు మరణిస్తుంది. ఈ పరిస్థితిని డాక్టర్లు ఇక ఏమాత్రం చక్కదిద్దలేరు. శరీరం బతికి ఉండి... మెదడు పూర్తిగా మరణించిన స్థితి ఇది. ఇలాంటి స్థితిలో కృత్రిమశ్వాసపై శ్వాసప్రక్రియ కొనసాగుతుంటే... అది తొలగించగానే బాధితుడు మరణిస్తాడు. బతికే అవకాశం ఏమాత్రమూ ఉండదు. అందుకే బ్రెయిన్‌డెడ్‌ పరిస్థితిలో ఉన్నవారి నుంచి డాక్టర్లు అవయవమార్పిడి (ట్రాన్స్‌ప్లాంటేషన్‌) కోసం అవసరమైన అవయవాలను సేకరిస్తారు.               ∙           

తలకు గాయం కాగానే పొరుగువారు చేయాల్సిన పనులు
తలకు గాయమైన వారిని సమతలంగా ఉండే పడకపై మెడ కదలకుండా పడుకోబెట్టాలి. 
తరలించే సమయంలో తలకు, వెన్నుకు అయిన గాయం మరింత రేగకుండా, తీవ్రం కాకుండా చూడాలి. 

చికిత్స విషయానికి వస్తే... ఏదైనా ప్రమాదంలో తలకు గాయం అయినప్పుడు మెదడుకు నష్టం జరిగిందా లేదా అన్న విషయం తక్షణం తెలియకపోవచ్చు. కాబట్టి ప్రమాదం జరిగిన గంటలోనే బాధితులను హాస్పిటల్‌కు తరలించగలిగితే... చాలావరకు ప్రాణాల కాపాడవచ్చు. దాంతో పాటు దుష్ప్రభావాలను (కాంప్లికేషన్స్‌ను) 
చాలావరకు అరికట్టవచ్చు. అందుకే దీన్ని గోల్డెన్‌ అవర్‌ అని పిలుస్తారు. అదే అరగంటలోపే తరలించగలిగితే... ఇంకా సమర్థమైన చికిత్స అందించవచ్చు. అందుకే ఆ సమయాన్ని ‘ప్లాటినమ్‌’ సమయంగా చెబుతారు. 

బాధితులకు ముందుగా ఎమర్జెన్సీ వైద్య సిబ్బంది నుంచి తక్షణ వైద్య సహాయం అందాలి. ఇది ప్రమాద సంఘటన స్థలం నుంచే లేదా కనీసం ఆసుపత్రికి తరలించగానే క్యాజువాలిటీలోనైనా ప్రారంభం కావాలి. ఎందుకంటే గాయం కారణంగా మెదడుకు జరిగిన నష్టాన్ని మళ్లీ భర్తీ చేయడం చాలా సందర్భాల్లో పూర్తిగా సాధ్యం కాకపోవచ్చు. అందుకే మనం చేయగలిగేది మెదడుకు మరింత నష్టం జరగకుండా చూసుకోవడం. ఒకవేళ గుండె స్పందనలు ఆగినట్లయితే వెంటనే కార్డియో పల్మునరీ రిససియేషన్‌ (సీఆర్‌పీ) చేయాలి. దాంతో గుండె స్పందనలు మళ్లీ మొదలై... మెదడుకు రక్తం అందేలా చూడాలి. ఫలితంగా మెదడుకు జరిగే నష్టమూ తగ్గుతుంది, ప్రాణమూ నిలబడుతుంది. ఇక ఆ తర్వాత చేయాల్సిన వివిధ చికిత్సలను డాక్టర్లు హాస్పిటల్‌లో కొనసాగిస్తారు.
చదవండి: Health Tips: పిల్లలు పక్క తడుపుతున్నారా? కారణాలివే! క్రాన్బెర్రీ జ్యూస్‌, అరటిపండ్లు.. ఇంకా ఇవి తినిపిస్తే మేలు!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top