మంచి మాట: అభిప్రాయం కాదు... అవగాహన

Awareness is freedom for man and good for society - Sakshi

వ్యక్తి తన వ్యక్తిత్వానికి అతీతంగా వస్తుతత్త్వానికి, ఉన్న విషయానికి మాలిమి అవాలి. అనుకోవడం నుంచి తెలుసుకోవడానికి పయనించాలి. అభిప్రాయం నుండి అవగాహనలోకీ చేరాలి. అనుకోవడం అంటేనే తెలివిడిలేనితనం. ‘ఇది నా అభిప్రాయం‘ అనడం ఒక మనిషి అవగాహనా రాహిత్యాన్ని తెలియజేస్తూంటుంది. విషయం, వాస్తవం, సత్యం ఇవి మనిషి మనిషికీ మారవు. అభిప్రాయాలే వేర్వేరుగానూ, రకరకాలుగానూ ఉంటాయి. ఒక విషయం గురించి ఏదో అనుకోవడం ఏమిటి? విషయాల్ని తెలుసుకోవడం లేదా తటస్థంగా ఉండడం అన్నదే సరైనది.

లోకంలో ప్రతి ఒక్కరూ అభిప్రాయపడడం గొప్ప అనుకుంటూంటారు. ముఖ్యంగా ప్రపంచంలో ఉన్న 67% మధ్యతరగతి వ్యక్తులు అభిప్రాయపడుతూ బతుకుతూంటారు. అభిప్రాయాలు మనిషి అశక్తతకు, తెలివిడిలేనితనానికి వ్యక్తీకరణలు. అభిప్రాయపడడం అన్నది మధ్యతరగతి మాంద్యంగానూ, జాడ్యంగానూ ఉంది. అందువల్ల గందరగోళం తప్పితే మరొకటి ఉండదు. ఉపిరి పీల్చుకోవడం తరువాత ఒక వ్యక్తి తప్పకుండా చేసే పని అభిప్రాయపడడమే. మనుషులకు తప్పితే ఏ జంతువుకూ అభిప్రాయాలుండవు. అందుకే జంతువుల్లో లేని అశాంతి మనుషుల్లో మాత్రమే ఉంది.
 
‘ఇది నా అభిప్రాయం’, ‘నేను ఏమనుకుంటున్నానంటే‘,
‘నేను చెప్పేదేమిటంటే’...
అనే స్థితి నుండీ, స్థాయి నుండీ మధ్య తరగతి మనిషి ఇంకా ఎదగలేదు.
మనిషి అవగాహనకూ అతీతంగా తన అభిప్రాయాల వల్లా,  ఏదో అనుకోవడం వల్లా తన ఎదుగుదలకు తానే అడ్డుపడుతున్నాడు.
ఒక కుటుంబంలోని వ్యక్తుల అభిప్రాయాల వల్లా, ఏదేదో అనుకోవడం వల్లా ఆ కుటుంబాలు ఛిద్రమైన సందర్భాలు ఎన్నెన్నో ఉన్నాయి. అభిప్రాయపడడం, అనుకోవడం ఒక మానసిక బలహీనత.

హిట్లర్‌ అభిప్రాయాల వల్ల రెండవ ప్రపంచ యుద్ధం వచ్చి మొత్తం మానవాళికి పెనుహాని జరిగింది.
అభిప్రాయపడడం కూడా మూర్ఖత్వంలాగే అపాయకరమైనదే! కొన్ని సందర్భాల్లో మూఢనమ్మకంలాగా కీడు చేసేదే! నా అభిప్రాయం మేరకు అనేది ప్రపంచానికి మేలు చేసినది కాకపోగా అనర్థాల్ని కలిగించింది, మనుషుల మధ్య అంతరాల్ని పెంచింది. మనస్పర్థలను సృష్టించింది. ఈ చింతనతో ఎన్నో దశాబ్దుల క్రితం నుండీ అంతర్జాతీయ సంస్థలు ప్రపంచానికీ, మానవాళికీ అత్యవసరమయ్యే ఎన్నో ఉత్పాదనల్ని ఉత్పత్తి చేసి అందుబాటులోకి తెచ్చాయి, సగటు మనిషికి హితాన్ని చేకూర్చాయి.

చూడడం, వినడం, అవగతం చేసుకోవడం, చెప్పడం ఇవి మనిషికి సరిగ్గా అలవడలేదు. వ్యక్తిగత అభిప్రాయాలూ, ఉద్దేశాల వల్ల సాటి మనిషికీ, సమాజానికీ ప్రయోజనం ఉండదు. అభిప్రాయాలు, ఉద్దేశాలు, అనుకోవడం ఇవి కాదు ఎరుక, అవగాహన, విజ్ఞతలే కావాలి. ఒకరి ఎరుక, అవగాహన మరొకరికీ, సమాజానికీ ఉపయోగపడతాయి. ఈ ప్రపంచానికి మేలు చేసినవన్నీ అవగాహనలే, వాస్తవాలే, సత్యాలే.

ఒక వైద్యుడి చదువు లేదా ఎరుక మాత్రమే రోగికి అవసరమవుతుంది. ఒక అధ్యాపకుడికి ఎరుక ఉన్నప్పుడు మాత్రమే విద్యార్థికి సరైన విద్య వస్తుంది. ’రెండు రెళ్లు నాలుగు’ అన్న ఎఱుకను మాత్రమే ఉపాధ్యాయుడు విద్యార్థికి అందజెయ్యాలి. అదే విద్యార్థికి కావాల్సింది. ఆ రెండురెళ్లు నాలుగు అన్నది అవగాహన. ఆ అవగాహనే ఒక వ్యక్తి జీవనానికి తోడ్పడేది.
ఇలా ఏ విషయంలోనైనా ఎరుకవల్ల వచ్చే లేదా వచ్చిన అవగాహన మాత్రమే మేలు చేస్తుంది.

అభిప్రాయం అనేది పూర్తిగా వ్యక్తిగతం. ఎవరి అభిప్రాయాలు వాళ్లవి. అభిప్రాయాలు సార్వత్రికమైనవి కావు అపై సార్వజనీనమైనవీ కావు. మనం సరిగ్గా ఉండాలంటే మనకు ఉండాల్సింది అభిప్రాయాలు కాదు అవగాహనలు. బతకడం అంటే అభిప్రాయాల్ని మోసుకుంటూ ఉండిపోవడమా? కాదు. బతకడం అంటే తెలుసుకుని అవగాహనతో సాగడం.

అభిప్రాయపడడం ఒక వ్యక్తికి ఆరంభదశ కావచ్చు. కానీ వ్యక్తి అక్కడే ఉండిపోకూడదు. తన అభిప్రాయాన్ని వాస్తవం లేదా ఉన్న విషయంతో సరిపోల్చి చూసుకోవాలి.  తాను అనుకున్న దానికి ఏ మాత్రం ఉనికి ఉంది అన్నదాన్ని పరిశీలించగలగాలి. ఉదాహరణకు ఒక వ్యక్తికి ఒక గాయకుడు గొప్ప గాయకుడు అన్న అభిప్రాయం ఉంటే ఆ గాయకుడి సామర్థ్యాన్ని, గాయకుడి వ్యాప్తిని, తరువాతి తరం వాళ్లపై ఆ గాయకుడి ప్రభావాన్ని, పరిశీలించగలిగితే ఆ గాయకుడు గొప్ప గాయకుడు అన్న  అభిప్రాయం సరైనదా కాదా అనేది తెలిసిపోతుంది.

విజ్ఞానశాస్త్రవేత్తల ఆవిష్కరణలను పరిశీలిస్తే మనకు అవగాహన అన్నది ఏమిటో అర్థమై పోతుంది. విజ్ఞాన శాస్త్రవేత్తలు ఒక అభిప్రాయంతోనో, ఏదో ఒకటనుకునో  మొదలుపెడతారు. ప్రయోగాలు, ఆలోచనలు, పరిశీలనలు చేస్తూ, చేస్తూ తమను తాము మార్చుకుంటూ, సరిచేసుకుంటూ ఒక దశలో వాళ్లు సరైన ఆవిష్కరణలు చెయ్యగలుతారు. ఆ ఆవిష్కరణ జరిగాక అది అవగాహన అవుతుంది. ఆ అవగాహనే లోకానికి ఉపయోగ పడేదవుతుంది.
అవగాహన మనిషికి స్వేచ్ఛను ఇస్తుంది. సాటి మనిషికి, సమాజానికి మేలు చేస్తుంది. శాంతిని ఇస్తుంది. ఈ సత్యాన్ని బుద్ధిలోకి తీసుకుందాం. అభిప్రాయాలకు అతీతంగా ‘బతకడం’ నేర్చుకుందాం.

అభిప్రాయపడడం ఒక వ్యక్తికి ఆరంభదశ కావచ్చు. కానీ వ్యక్తి అక్కడే ఉండిపోకూడదు. తన అభిప్రాయాన్ని వాస్తవం లేదా ఉన్న విషయంతో సరిపోల్చి చూసుకోవాలి. తాను అనుకున్న దానికి ఏ మాత్రం ఉనికి ఉంది అన్నదాన్ని పరిశీలించగలగాలి. 

– రోచిష్మాన్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top