
80వ విక్టరీ డే పరేడ్ సందర్భంగా శత్రు భీకర అస్త్రశస్త్రాల ప్రదర్శన
తొలిసారిగా అత్యంత అధునాతన ఆయుధాలతో పరేడ్
పరేడ్‌లో పాల్గొన్న పుతిన్, కిమ్, అమెరికా బద్ధ వ్యతిరేక దేశాల అగ్రనేతలు
బీజింగ్/హాంకాంగ్: అసాధారణ రక్షణరంగ పాటవంతో అత్యాధునీకరించిన అస్త్రశస్త్రాలతో చైనా ఎదురులేకుండా ఎదుగుతోందని ఆ దేశ అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ప్రకటించారు. రెండో ప్రపంచయుద్ధంలో జపాన్‌పై గెలుపునకు గుర్తుగా జరిపిన 80వ విజయోత్సవ పరేడ్ ఇందుకు వేదికైంది. టారిఫ్‌లతో స్నేహితులు, శత్రువులు అనే తేడా లేకుండా ఇష్టారీతిన ఆధిపత్య బలప్రదర్శన చేస్తున్న అగ్రరాజ్యాధినేత ట్రంప్ వైఖరిని ధిక్కరించేలా జిన్‌పింగ్ ప్రసంగం సాగింది.
చైనా సైన్యానికి సెంట్రల్ మిలటరీ కమిషన్ సారథిగా సర్వసైన్యాధ్యక్షుడి హోదాలో జిన్‌పింగ్ ప్రసంగించారు. ‘‘ మానవత్వం అనేది ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూడక తప్పదని చరిత్ర మనకు ఏనాడో చెప్పింది. చైనా పునరుజ్జీవానికి పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఎప్పటికప్పుడు వ్యూహాత్మక తోడ్పాటునందిస్తోంది. అది ప్రపంచ శాంతి, అభివృద్ధికి సైతం ఎంతగానో సాయపడుతోంది.
దేశ సార్వభౌమత్వం, ఐక్యత, ప్రాదేశిక సమగ్రతను కంటికి రెప్పలా కాపాడేందుకు చైనా మిలటరీ స్వశక్తితో ఉక్కు సంకల్పంతో శత్రు దుర్భేద్యంగా తయారైంది. ఆధునిక చరిత్రలో రెండో ప్రపంచయుద్ధంలో జపాన్ సేనలను మట్టికరిపించడం ద్వారా చైనా తొలిసారిగా విదేశీ దురాక్రమణలను విజయవంతంగా అడ్డుకుంది. మానవ నాగరికత, ప్రపంచశాంతి సంరక్షణ, యుద్ధంలో త్యాగాలతో చైనా ప్రజలు ఈ క్రతువులో కీలక పాత్ర పోషించారు.
అందరం సమానం, శాంతి సామరస్యంతో జీవనం సాగిద్దామనే భావన ఒక్కటే ప్రపంచదేశాలను యుద్ధాల బాటలో నడవకుండా ఆపుతుంది. నేడు మానవత్వం అనేది కఠిన సవాళ్లను ఎదుర్కొంటోంది. ఇప్పుడు ఏదో ఒక్కటే ఎంచుకోవాలి. శాంతి కావాలా యుద్ధం కావాలా? చర్చలా లేదా ఘర్షణలా? యుద్ధాలకు దిగితే రక్తసిక్తమైన మరుభూమి మినహా మనకేం మిగలదు’’ అని జిన్‌పింగ్ వ్యాఖ్యానించారు.
భూమండలాన్ని కవర్ చేసే భారీ క్షిపణి
పరేడ్‌లో తొలిసారిగా ద్రవరూప ఇంధనంతో పనిచేసే ఖండాతర వ్యూహాత్మక అణ్వస్త్ర ఆయుధం డీఎఫ్–5సీను ప్రదర్శించారు. దీని లక్ష్య పరిధి ఏకంగా 20,000 కిలోమీటర్లు. అంటే ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా శత్రువును శబ్దం కంటే 10 రెట్లు ఎక్కువ వేగంతో దూసుకొచ్చి తుదముట్టిస్తుంది. ఇంతటి వేగంతో రావడంతో దీనిని అడ్డుకునే శత్రుదేశాల గగనతల రక్షణ వ్యవస్థలు సంసిద్ధమయ్యేందుకు సరిపడా సమయం చిక్కదు. ఆలోపే ఇది లక్ష్యను తుత్తునియలు చేస్తుంది. పైగా ఇది ఒకేసారి 10 వేర్వేరు దిశల్లోని లక్ష్యాలను ఛేదించేలా 10 వార్‌హెడ్‌లను ప్రయోగించగలదు.
నభూతో నభవిష్యతి
గతంలో ఎన్నడూ మీడియాకంట పడని, అత్యంత నూతన తరం ఆయుధాలు, అణ్వస్త్ర బాలిస్టిక్ క్షిపణులు, యుద్ధట్యాంక్‌లు, జలాంతర డ్రోన్లు, ఎలక్ట్రానిక్ యుద్ధ పరికరాలు, ఐదో తరం యుద్ధవిమానాలను చైనా తొలి సారిగా ప్రదర్శించింది. బీజింగ్‌లోని ప్రఖ్యాత తియా న్మెన్‌స్క్వేర్ కూడలి మీదుగా ఈ పలు రకాల ఆయుధ వ్యవస్థల పరేడ్ సాగింది. నభూతో నభవిష్యతి అన్న రీతిలో జరిగిన ఈ పరేడ్‌ను చూసేందుకు జనం లక్షలాదిగా తరలివచ్చారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో, ఇండోనేసి యా అధ్యక్షుడు ప్రబోబో సుబియంతో, కాంబోడియా రాజు నోరోడోమ్ సిహమోనీ, వియత్నాం అధ్యక్షుడు లూంగ్ కూంగ్, మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం, మయ న్మార్ సైనిక నేత సీనియర్ జనరల్ మిన్ ఆంగ్ లాంగ్, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, కజకిస్తాన్ అధ్యక్షుడు
కాసిం జోమార్త్ తొకయేవ్, జింబాబ్వే అధ్యక్షుడు ఎమర్సన్ నాంగాగ్వా, కాంగో అధ్యక్షుడు డెనిస్ ససూ ఎన్‌గిసో, క్యూబా అధ్యక్షుడు మెగేల్ డియాజ్ క్యానెల్, అజర్‌బైజార్ అధ్యక్షుడు ఇల్హామ్ అలియేవ్ సహా 26 దేశాల అగ్రనేతలు బీజింగ్‌లో జరిగిన ఈ విక్టరీ పరేడ్‌లో ముఖ్య అతిథులుగా పాల్గొని పరేడ్‌లో అత్యాధునిక ఆయుధ సంపత్తిని స్వయంగా తిలకించారు.
పరేడ్‌కు హాజరైనవారు..
లేజర్ వెపన్, అండర్‌వాటర్ డ్రోన్లు
పెద్ద హెచ్‌జెడ్–155 రకం వాహనంపై నుంచి ప్రయోగించే శ్వేతవర్ణ భారీ ఎల్‌వై–1 లేజర్ ఆయుధాన్ని చైనా ప్రదర్శించింది. ఇది శత్రువుల ఆయుధాలు, ఆయుధ వ్యవస్థలను ముక్కలు ముక్కలుగా కోసేస్తుంది. ఇది సముద్రజలాలపై యుద్ధ్దరీతులను మార్చేయడం ఖాయమని చైనా రక్షణనిపుణులు చెప్పారు. దీంతోపాటు గాల్లోంచి ప్రయోగించి చిన్నపాటి జేఎల్–1 అణ్వస్త్రసామర్థ్యమున్న క్షిపణిని ప్రదర్శించారు.
దీంతోపాటు ఇదే సామర్థ్యమున్న ఇతర వేరియంట్లు డీఎఫ్–51, డీఎఫ్–31లనూ చూపించారు. వైజే–17 యాంటీషిప్ మిస్సైల్, డీఎఫ్–61 క్షిపణి, 5,000 కి.మీ.ల దూరాలను ఛేదించే డీఎఫ్–26డీ మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణిని ప్రదర్శించారు. యుద్ధవిమానాలు జే–20, జే–20ఏ, జే–20ఎస్, జే–35ఏలను ప్రదర్శించింది.
తమ జాడ శత్రువులకు చిక్కకుండా రహస్యంగా ఎగిరొచ్చే( స్టెల్త్ సామర్థ్యమున్న) ఐదో తరం అన్ని వేరియంట్ల యుద్ధవిమానాలను ఇలా ఒకే పరేడ్‌లో ప్రదర్శించడం ఇదే తొలిసారి. ప్రపంచంలో జే–20ఏ మోడల్ యుద్ధవిమానంలో మాత్రమే ఇద్దరు పైలట్లు కూర్చునే వీలుంది. ఇవిగాక సీజే–1000 వాహనం నుంచి ప్రయోగించే సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి, నౌక నుంచి ప్రయోగించే క్రూయిజ్ మిస్సైల్, గగనతలం నుంచి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణులనూ ప్రదర్శించారు.
నీటిలో నిఘా అవసరాలకు వాడే డ్రోన్లనూ చూపించారు. హెచ్‌క్యూ20, హెచ్‌క్యూ–22ఏ, హెచ్‌క్యూ–29 వంటి గగనతల రక్షణ వ్యవస్థ, ఎలక్ట్రానిక్ ఉపకరణాలనూ ప్రదర్శించారు. హైపర్‌సోనిక్ గ్లౌడ్ క్షిపణిని సైతం అడ్డుకునే హెచ్‌క్యూ–19 గగనతల రక్షణ వ్యవస్థను ప్రదర్శించారు. టైప్–100 యుద్ధ ట్యాంక్‌ను ప్రదర్శించింది. ఈ ట్యాంక్‌ను అత్యంత తెలివైన ట్యాంక్‌గా చెబుతారు. సమన్వయం చేసుకొంటూ దాడులు చేయగలదని చైనా పేర్కొంది.
12,000 కిలోమీటర్లు ప్రయాణించే డాంగ్‌ఫెంగ్–61 ఖండాంతర క్షిపణిని ప్రదర్శించింది. 60 అడుగుల పొడవైన సముద్ర డ్రోన్ ‘ఏజేఎక్స్002’ ఈసారి పరేడ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. లాంగ్ రేంజ్ బాంబర్‌లు సైతం బీజింగ్ గగనతలంపై చక్కర్లు కొట్టాయి. నౌకలను నీటిలో ముంచేసే క్షిపణులను ఈ బాంబర్ నుంచి ప్రయోగించవచ్చు. హెచ్‌ఎస్‌యూ 100 అండర్‌వాటర్ డ్రోన్‌నూ చూపించారు. కృత్రిమ మేధ సాయంతో దాడిచేసే డ్రోన్లు, జీజే–11 స్టెల్త్ డ్రోన్లను సైతం ప్రదర్శించారు.