కేంద్ర సాహిత్య అకాడెమికి ఘన గౌరవం! | Sakshi
Sakshi News home page

కేంద్ర సాహిత్య అకాడెమికి ఘన గౌరవం!

Published Mon, Mar 18 2024 3:23 PM

Author Ma Sharma Special Story Kendra Sahitya Akademi - Sakshi

అవును,మనం వింటున్నది నిజమే!ఈ ఉత్సవం పెద్ద చరిత్ర సృష్టించింది, రికార్డుల పంట పండించింది, భారతదేశానికి,కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖకు మునుపెన్నడు లేని పెద్ద ప్రతిష్ఠను తెచ్చిపెట్టింది. ఇది చిన్న ఉత్సవం కాదు, మహోత్సవం,సారస్వత మహాయజ్ఞం. ఈ మహాయగాన్ని నిర్వహించింది 'కేంద్ర సాహిత్య అకాడెమి'. దీనిని నడిపింది ఆ సంస్థ కార్యదర్శి కె.శ్రీనివాస్. ఈ శ్రీనివాస్ పదహారణాల మన తెలుగువాడు. కృష్ణా తీరంవాడు, దివిసీమవాడు,కవిసీమవాడు. దశాబ్దాల కేంద్ర సాహిత్య అకాడెమి చరిత్రలో కార్యదర్శి హోదాను పొందిన మొట్టమొదటి తెలుగువాడు శ్రీనివాస్.

అకాడెమి ప్రయాణంలో ఈ స్థాయిలో సాహిత్య మహోత్సవాలు జరగడం గొప్ప చరిత్ర. 'ప్రపంచ అతి పెద్ద సాహిత్య మహోత్సవం ' పేరుతో దిల్లీలో, కేంద్ర సాహిత్య అకాడెమి ప్రాంగణంలో,రవీంద్ర భవన్ లో ఈ మార్చి 11 వ తేదీ నుంచి 16 వ తేదీ వరకూ వేడుకలు ఘనంగా జరిగాయి.పోయిన ఏడాది కూడా జరిగాయి. ఈసారి ప్రత్యేకత ఏంటంటే? 'ఐన్ స్టీన్ వరల్డ్ రికార్డ్స్', దుబాయ్, 'వరల్డ్ బుక్ అఫ్ రికార్డ్స్',లండన్ నుంచి ఘనమైన గుర్తింపు లభించింది. కేంద్ర సాహిత్య అకాడెమి సంస్థకు,అధిపతి కె.శ్రీనివాస్కు కూడా విశేషమైన అభినందనలు అందాయి.

ఒక్కరోజులోనే, అతిపెద్ద సంఖ్యలో, అనేక భాషలవారు వివిధమైన సారస్వతాన్ని వినిపించినందుకు 'వరల్డ్ బుక్ అఫ్ రికార్డ్స్ ', లండన్ గొప్ప రికార్డుగా నమోదు చేస్తూ సర్టిఫికెట్ పంపించింది. 1100 మంది ప్రతినిధులు 175 భాషలకు ప్రాతినిధ్యం వహిస్తూ,190 సెషన్స్ గా, వరుసగా 6రోజుల పాటు సారస్వత మహోత్సవంలో పాల్గొనడాన్ని అపూర్వమైన విశేషంగా అభివర్ణిస్తూ దుబాయ్ కి చెందిన ప్రతిష్ఠాత్మకమైన సంస్థ 'ఐన్ స్టీన్ వరల్డ్ రికార్డ్స్ ' ఈ ఉత్సవాన్ని ప్రపంచ స్థాయిలో అద్భుతమైన విషయంగా భావిస్తూ సర్టిఫికెట్స్ అందజేసింది.భాషా,సాహిత్య, సాంస్కృతిక ప్రేమికులకు గొప్ప ఆనందాన్నిచ్చే గొప్ప సందర్భం, సంరంభం మన దేశరాజధానిలో వెల్లివిరిసాయి. 'సామాజిక న్యాయం' అనే మాట ఈమధ్య మనం తరచుగా వింటున్నాం.

సామాజిక న్యాయంతో పాటు సాహిత్యానికి కూడా ఈ మహోత్సవంలో గొప్ప న్యాయం జరిగింది. ప్రతి ఏటా జరుగుతోంది, ఈ ఏడు మరింత విశేషంగా జరిగింది.సాహిత్యంలోని విభిన్న ప్రక్రియలకు ప్రాతినిధ్యం కల్పించిన వేళ,ఆ యా రూపాలకు తత్ తుల్యమైన గౌరవం కూడా దక్కింది. దేశంలోని అనేక భాషల వాణి వినపడడమే కాక,లింగవివక్షకు తావులేకుండా అందరికీ సమ ప్రాతినిధ్యం లభించింది. కవితలు,కథలు,చిన్న కథలు, కళలు,సమీక్షలు,విమర్శలు,చర్చలు ఒకటేమిటి? ఈ ఆరురోజుల్లో ఎన్నో జరిగాయి. లబ్దప్రతిష్ఠులే కాక,మాన్యులు, సామాన్యులు,అతి సామాన్యులకు కూడా ఈ వేడుకలకు ఆహ్వానం అందింది. ఒక్కొక్క సభా వేదికకు ఒక్కొక్క మహనీయుని పేరు పెట్టి, ఆ మాననీయులకు నీరాజనం పలికారు. మహాకవి వాల్మీకి, వేదవ్యాసుడు,మీరాబాయి, కబీర్,శంకరదేవుడు,తులసీదాస్, తిరువాళ్వార్ వంటి మహానీయులను వేదికల ద్వారా తలచుకొని,తలపులలో నిలుపుకొని,నమస్కరించుకొనే సౌభాగ్యం కూడా ఈ వేదికల ద్వారా ప్రాప్తమైంది.

కళలకు సాహిత్యం అవసరమా? మహిళాసాధికారికత, బాలసాహిత్యం,యువసాహితి, అనువాదం,అస్మిత,చదువరితనం, రచించే శక్తి,అభిరుచి, సమకాలీన సాహిత్య సరళులు, గిరిజన భాషా,సాహిత్య, సంస్కృతులు,నవల,నవలిక, నాట్యం,నాటకం, సారస్వత గమనంలో సవాళ్లు, భారతీయుల ఇంగ్లిష్ రచనా నిపుణత,ఈ -బుక్స్, ఆడియో బుక్స్, ప్రచురణకర్తలు ఎదుర్కొంటున్న సవాళ్లు, కవిత్వంలో స్త్రీ, సాహిత్యం అందించే ఆనందం, ప్రేరణ,ప్రభావం, సరిహద్దుల అవతల భారతీయ సాహిత్యం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, మన సారస్వత వారసత్వ వైభవం, విద్య అందించే సృజన, జనపదాలు, జానపదకథలు, కవిత్వ వ్యవసాయం, స్వాతంత్య్రానికి పూర్వం సాహిత్యం, భక్తి ఉద్యమ కవిత్వం, భావోద్వేగాలు, రచయితలతో ముఖాముఖీ, రామకథావిశేషాలు, మన ఘన సాంస్కృతిక వారసత్వం, మన మహాకావ్యాలు, మన తత్త్వ గ్రంథాలు, తాత్వికత,సైన్స్ ఫిక్షన్, సాహిత్యం సమకూర్చే విలువలు, ఆత్మకథలు,మీడియా, భిన్నత్వంలో ఏకత్వం, ఇతిహాసాలు,పురాణాలు, అణగారిన వర్గాల ఆలోచనా ధోరణులు,దళిత సాహిత్యం, వందేళ్ల భారత సాహిత్యం, భారతీయ భాషల సంరక్షణ, భిన్న స్వరాల్లో భారతీయ కవిత్వం, మౌఖిక సాహిత్యం, స్వాతంత్ర్యానంతర సాహిత్య సృష్టి... ఇలా ఎన్నో అంశాలను,రంగాలను స్పృశిస్తూ ఈ సంబరాలు అంబరాన్ని అంటాయి.

ఇదే వేదికలపై 'కేంద్ర సాహిత్య అకాడెమి -2023' అవార్డుల ప్రదానోత్సవం కూడా ఘనంగా నిర్వహించారు. ఈ ఎంపిక ప్రక్రియలో 24 భాషీయులు పురస్కార ఘన గౌరవాన్ని అందుకున్నారు. అందులో మన తెలుగువారైన తల్లావఝల పతంజలిశాస్త్రి కూడా ఉండడం మనకు ముదావహం. సినిమా సాహిత్యంపై ప్రఖ్యాత ఉర్దూ కవి,రచయిత,గీతకారుడు గుల్జార్ ప్రసంగం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వేడుకల్లో మాటవిడుపుగా మధ్య మధ్యలో సాగిన నృత్య,నాటక, సంగీత రూపక ప్రదర్శనలు కొంగ్రొత్త విందులను చిందించాయి.

ఈ ఉత్సవాలతో పాటు గతంలో సిమ్లాలో,భోపాల్ లో నిర్వహించిన ' ఉన్మేష ఉత్సవాలు' రంగరంగ వైభవంగా జరిగాయి. ఈ ఆరు రోజుల ఉత్సవాలకు ఆహ్వానించిన ప్రతిఒక్కరికీ అన్ని ఖర్చులు,భోజన,వసతి,పారితోషిక వగైరాలన్నింటినీ అకాడెమి భరించింది. ఎన్నో వ్యయప్రయాసలతో నిర్వహించిన ఈ సాహిత్య మహోత్సవం అపూర్వ పర్వంగా అందగించింది. భారతీయ భాషా,సాహిత్య, సాంస్కృతులకు పెద్ద దివిటీలు పట్టిన శుభఘడియలు ఈ ఆరు దినములు. ప్రతి ఏటా ఇలాగే జరిగితే మన సారస్వత శోభ ప్రభాసమానమవుతుంది. 'ఆజాదీ కా అమృతోత్సవ్' లో భాగంగా జరిగిన ఉన్మేష ఉత్సవాలు కూడా ఆగకుండా జరగాలి. ఇంతటి చారిత్రక సభల ప్రభలు కట్టిన కేంద్ర సాహిత్య అకాడెమికి వీరతాళ్లు వేద్దాం.


-రచయిత మా శర్మ, సీనియర్‌ జర్నలిస్టు

(చదవండి: తెలుగు తల్లీ, అదుగోనమ్మా..!)

Advertisement
Advertisement