తెలుగు తల్లీ, అదుగోనమ్మా..! | Sakshi
Sakshi News home page

తెలుగు తల్లీ, అదుగోనమ్మా..!

Published Wed, Jan 31 2024 4:46 PM

177th Thyagaraja Aradhana Festival Thiruvaiyaru - Sakshi

తెలుగు తల్లీ, అదుగోనమ్మా
త్యాగయ్య నాదోపాసన
రవళిస్తున్నది
నీకు భూపాలమై!

కర్ణాటక సంగీతం ముమ్మూర్తుల్లో ఒకరైన శ్రీమాన్ త్యాగరాజు 177వ ఆరాధనోత్సవాలు తిరవైయ్యారులో ఘనంగా జరిగాయి. "విదులకు మ్రొక్కెద సంగీత కోవిదులకు మ్రొక్కెద" అంటూ నాదోపాసనతో నిధికన్నా రాముని సన్నిధి చాల సుఖమని అనుకుని ఆపై "ఏ నోము ఫలమో నీ నామామృత / పానము అను సోపానము‌ దొరికెను" అని తెలుసుకుని జీవించారు; నాదబ్రహ్మమై జీవిస్తున్నారు త్యాగరాజు. వారు పాడింది మనం వినలేకపోయాం. వారి సంగీతం సుఖమైంది మనకు చదువయింది. "సామగాన సార్వభౌమ స్వామి త్యాగరాజ నామ" అంటూ అమృతవర్షిణి‌ రాగంలో రూపక తాళంలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఒక కీర్తన చేశారు.

కర్ణాటకసంగీతం త్యాగయ్య వల్ల పరిపుష్టమై‌ంది.‌ తెలుగుకు గర్వకారణమైంది. "చల్లని భక్తి",‌‌‌ "స్మరణే సుఖము", "కులములెల్ల కడతేఱినట్లు",‌ "పరమానందమనే కమలముపై" వంటివి అన్న త్యాగరాజు గొప్పకవి కూడా. వారు రాసింది చదవగలిగే భాగ్యం మనకు అందింది.‌ సంగీతం కోసమే అన్నా వారి నోటి వెంట గొప్ప కవిత్వమూ పలికింది.

"భావాభావ మహానుభావ శ్రీరామచంద్ర
భావజనక నా భావము తెలిసియు..."

"తన తలుపు తీసినట్టి ఒకరింటికి
తాఁ గుక్కల తోలు రీతిగాదో"

"తవిటికి రంకాడబోతె కూటి
తపిల కోతి కొంపోయినట్టుగాదో"

"రాగము తాళము రక్తి భక్తి జ్ఞాన
యోగము మఱి యనురాగము లేని
భాగవతు లుదర శయనులేగాని..."

"మనసు స్వాధీనమైన యా ఘనునికి
మఱి మంత్రతంత్రములేల"

"యజ్ఞాదులు సుఖమను వారికి సము
లజ్ఞానులు కలరా ఓ మనసా"

"చీమలో బ్రహ్మలో శివకేశవాదులలో
ప్రేమ మీర మెలఁగుచుండే బిరుదు వహించిన సీతారామ..."

"ఏఱు నిండి పాఱిన పాత్రకు తగు నీరు వచ్చుగాని"

"లేమి దెల్ప పెద్దలెవరు లేరో" (ఇది ఇవాళ్టి తెలుగు‌ కవిత్వానికి‌, భాషకు, సమాజానికి ఈ మాట సరిగ్గా పొసుగుతుంది)

"శాంతము లేక సౌఖ్యము లేదు"

ఇవి, ఇలాంటివి ఇంకొన్నీ అన్న వాగ్గాన (వాగ్గేయ) కారులు త్యాగరాజు.

రాముణ్ణి "సప్తస్వర నాదాచల దీపం" గా పరిగణించి ఆ వెలుగులో "సంగీత శాస్త్రజ్ఞానము సారూప్య సౌఖ్యదమే మనసా" అని అన్న త్యాగరాజు తెలుగుభాషకు సంగీతం పరంగానే కాదు కవిత్వం పరంగానూ వరవరం.

"సామ గాన సార్వభౌమ స్వామి త్యాగరాజ నామ"
అంటూ మంగళంపల్లి బాలమురళికృష్ణ నుతిస్తే తెలుగువాళ్లం మనం

"కవన సాగర పూర్ణసోమ
స్వామి త్యాగరాజ నామ" అంటూ కూడా త్యాగరాజును స్తుతిద్దాం.

--రోచిష్మాన్, 
9444012279

(చదవండి: అయోధ్య ప్రాణ ప్రతిష్ట వేళ.. తెలుగు వారు గర్వపడే విషయం!)

Advertisement
 
Advertisement