ప్లాస్టిక్‌ భవంతి

Amazing building made from 1.5 million plastic bottles withstands fires and earthquakes - Sakshi

ప్లాస్టిక్‌ చెత్త ప్రపంచవ్యాప్త సమస్య. పేరుకుపోతున్న ప్లాస్టిక్‌ చెత్తలో రీసైక్లింగ్‌ జరుగుతున్నది చాలా తక్కువే! రీసైక్లింగ్‌ చేసిన ప్లాస్టిక్‌ను అర్థవంతంగా వినియోగించు కుంటున్న సందర్భాలు మరింత అరుదు.రీసైక్లింగ్‌ చేసిన ప్లాస్టిక్‌ను అర్థవంతంగా వినియోగించుకున్న తీరుకు ఈ ఫొటోలో కనిపిస్తున్న భవనమే ఉదాహరణ. ఇది తైవాన్‌ రాజధాని తైపీ నగరంలో ఉంది. ‘ఎకో ఆర్క్‌’ పేరిట నిర్మించిన ఈ భవంతి ముందు భాగంలోని నిర్మాణమంతా రీసైక్లింగ్‌ చేసిన ప్లాస్టిక్‌ బాటిళ్లతో చేపట్టడం విశేషం. ఏకంగా పదిహేను లక్షల ప్లాస్టిక్‌ బాటిళ్లతో ఈ నిర్మాణం చేపట్టారు. 

వాడి పడేసిన ప్లాస్టిక్‌ బాటిళ్లను నేరుగా వాడకుండా, వాటిని కరిగించి, మళ్లీ బాటిల్స్‌గా తయారు చేసి ముందుభాగం నిర్మాణానికి ఉపయోగించారు. వీటిని ఒకేరకమైన ఆకృతిలో, ఒకే పరిమాణంలో తయారు చేశారు. దీనివల్ల వీటిని సులువుగా ఉక్కుఫ్రేమ్‌లో ఒకదానినొకటి జోడించి, చతురస్రాకారపు ప్యానెళ్లుగా అసెంబుల్‌ చేసి, పటిష్ఠంగా భవంతిని నిర్మించారు. భవనంలోని మిగిలిన భాగాలను రీసైకిల్డ్‌ ప్లాస్టిక్‌ ఇటుకలతో నిర్మించారు.ఈ భవంతికి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది.

ఇందులో రాత్రివేళ వెలిగే 40వేల ఎల్‌ఈడీ బల్బులకు కావలసిన మొత్తం విద్యుత్తును సోలార్‌ ప్యానెల్స్, విండ్‌ మిల్స్‌ ద్వారా అక్కడికక్కడే ఉత్పత్తి చేస్తారు. ప్లాస్టిక్‌ బాటిళ్లు పారదర్శకంగా ఉండటం వల్ల పగటివేళలో వెలుతురు కోసం విద్యుత్‌ బల్బులు వాడాల్సిన అవసరం దాదాపుగా ఉండదు. కాబట్టి దీనివల్ల వాతావరణంలోని కర్బన ఉద్గారాల సమస్య కూడా పెద్దగా ఉండదు.కాంక్రీట్‌ భవంతితో పోల్చుకుంటే, దీని బరువు సగాని కంటే తక్కువగానే ఉంటుంది.

అలాగని దీని దారుఢ్యాన్నేమీ తక్కువ అంచనా వేయడానికి లేదు. ఎందుకంటారా? తుపానులు చెలరేగినప్పుడు గంటకు 130 కిలోమీటర్ల వేగంతో వీచే పెనుగాలులనైనా ఈ భవంతి ఇట్టే తట్టుకోగలదు. అగ్నిప్రమాదాల నుంచి రక్షణ కోసం, నిప్పు తగులుకోకుండా దీనికి ప్రత్యేకమైన రసాయన కోటింగ్‌ కూడా పూశారు. కాబట్టి, తుపానులు, అగ్నిప్రమాదాల వల్ల ఈ భవంతికి వచ్చే ముప్పేమీ ఉండదు.తైపీలో ఏడేళ్ల కిందట జరిగిన అంతర్జాతీయ ప్రదర్శన కోసం అర్థర్‌ హువాంగ్‌ అనే డిజైనర్‌ ఈ భవంతిని ప్రత్యేకంగా డిజైన్‌ చేశాడు. తైవాన్‌లో ఏటా చెత్తలోకి చేరుకుంటున్న 45 లక్షల ప్లాస్టిక్‌ బాటిళ్లను పునర్వినియోగంలోకి తెచ్చే ఉద్దేశంతో ఆయన ఎంతో శ్రమతో, పట్టుదలతో ఈ భవంతికి రూపకల్పన చేశాడు. దీని నిర్మాణం కోసం 3 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.25 కోట్లు) ఖర్చయింది.
 ఇస్మాయిల్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top