విశ్రాంత జీవనానికి ఏబీసీడీలు.. డాక్టర్‌ కిరణ్‌ చద్దా

ABCDs for retirement Says Dr Kiran Chadha - Sakshi

‘పదవీ విరమణ తర్వాత సృజనాత్మకమైన నిధిని కనుక్కొన్నాను’ అంటున్నారు రిటైర్డ్‌ ఐఎఎస్‌ అధికారి డాక్టర్‌ కిరణ్‌ చద్దా. ఏడుపదుల వయసు విశ్రాంత జీవనాన్ని అర్థవంతంగా మార్చుకుంటూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. పెట్రోలియం, ఇనుప ఖనిజం సబ్జెక్టులలో రెండు పీహెచ్‌డీలు చేసి డాక్టరేట్‌ పొందారు. రచయితగా, మోటివేషనల్‌ స్పీకర్‌గానూ కొనసాగుతున్న కిరణŠ  చద్దా ముప్పై ఆరేళ్ల్ల ఉద్యోగ జీవితాన్నీ, ఆ తర్వాత విశ్రాంత జీవనాన్ని మన కళ్లకు కడుతున్నారు.

పెట్రోలియం, వాణిజ్యం, రక్షణ, మహిళా–శిశు సంక్షేమ శాఖలలో పనిచేసిన అనుభవం ఆమె సొంతం. ఆడపిల్లలకు పెద్దగా ఉపాధి అవకాశాలు లేని కాలంలో కేంద్ర ప్రభుత్వ అధికారిగా రాణించింది. ఉద్యోగ నిర్వహణలో ఉన్నప్పుడు తన జీవన విధానం గురించి వివరిస్తూ – ‘పర్వతారోహణ అంటే చాలా ఇష్టం. కానీ, ఒంటరిగా వెళ్లలేను. నా భర్త హర్ష్‌ చద్దా పోలీస్‌ అధికారి అవడంతో నాతో వచ్చేంత సమయం అతనికి లేదు. కానీ, హిమాలయాలపై ఉన్న ప్రేమతో బృందాలతో కలిసి ట్రెక్కింగ్‌ చేశాను. పిల్లలు హాస్టల్‌లో చదివేవారు. సెలవులు ఉన్నప్పుడు వారితో గడిపేంత సమయం నాకు ఉండేదికాదు. ఎన్నో అభిరుచులుండేవి. కానీ, విధి నిర్వహణలో వాటన్నింటినీ పక్కన పెట్టేయాల్సి వచ్చింది’ అంటూ తీరిక లేకుండా విధులను నిర్వర్తించిన రోజులను గుర్తుకుతెచ్చుకుంటారు ఆమె.

పేదను కాను...
పదవీ విరమణ తీసుకున్నాక పరిస్థితులను వివరిస్తూ ‘రిటైర్‌ అయ్యాక ఢిల్లీ నుంచి డల్హౌసీకి కుటుంబంతో పాటు వెళ్లిపోయాం. పిల్లలు వారి జీవితాల్లో స్థిరపడ్డారు. నేనూ, నా భర్త హిమాచల్‌ ప్రదేశ్‌లోని డల్హౌసీలో  స్థిరపడ్డాం. అక్కడే చదవును కొనసాగించి రెండు పీహెచ్‌డీలు చేశాను. 2017లో ‘డల్హౌసీ త్రూ మై ఐస్‌’ పుస్తకం రాశాను.  ‘క్లీన్‌ డల్హౌసీ క్లీన్‌ డల్హౌసీ’ పేరుతో ఎన్జీవో ఏర్పాటుచేశాను. దీని ద్వారా నేనున్న ప్రాంతంలో పరిశుభ్రత కోసం పనిచేశాను. రెండేళ్ల క్రితం నా భర్త గుండెపోటుతో మరిణించాడు. దాంతో చాలా కుంగిపోయాను. నా జీవితంలో అవి చాలా చెడు దినాలు. అయితే, ఈ ప్రపంచంలో నాకేమాత్రం నచ్చని పదాలు రెండు.. వితంతువు, పేదరికం. నేను దేంట్లోనూ ‘పేద’ కాదని నిరూపించుకోవాలనుకున్నాను.

సాధనతోనే సాధ్యం
వారానికి రెండు సార్లు యోగా, పియానో క్లాసులు తీసుకుంటాను. పంజాబీ పాటలు పాడతాను. యూ ట్యూబ్‌లో మోటివేషనల్‌ వీడియోలను తయారుచేసి అప్‌లోడ్‌ చేస్తాను. నా కవితలను చదువుతాను. నేను ఇప్పుడు ఎబిసిడి లను అమలులో పెడుతున్నాను.  ఎ– (ఎబిలిటీ) సామర్థ్యం, బి–(బింజ్‌ అలెర్ట్‌) అప్రమత్తం, సి–(కమిట్‌మెంట్‌) నిబద్ధత, డి–(డిసిప్లీన్‌) క్రమశిక్షణ. ఈ నియమాలను ఆచరణలో పెడితే ఏమైనా సాధించవచ్చు. ఈ నాలుగు విషయాలను అస్సలు అలక్ష్యం చేయను.

అందువల్లే చదవాలనే నా అభిరుచిని కొనసాగించాను. ఈ కొత్త సంవత్సరంలో కూడా చాలా పుస్తకాలు చదవాలని, రాయాలని నిర్ణయించుకున్నాను. ఇప్పటికీ వార్తాపత్రికలు చదువుతుంటాను. లాక్‌డౌన్‌ సమయంలో 23 రోజుల్లో 150 కవితలు రాశాను. రోజూ నాకు తెలుసున్నవారితో కొంత సమయమైనా గడపడానికి కేటాయిస్తాను. లేటెస్ట్‌గా వస్తున్న డ్రెస్సులను ధరిస్తున్నాను. నాకు నచ్చిన లిపిస్టిక్‌ వేసుకుంటున్నాను. నా గోళ్లకు రంగురంగుల పాలిష్‌ వేసుకుంటున్నాను.  

నా వయసు ఏడుపదులు దాటి ఉండవచ్చు. కానీ, నా అభిరుచులన్నీ 17 ఏళ్ల అమ్మాయికి తక్కువేమీ లేవు. టీవీ చూస్తూ సమయాన్ని వృథా చేసుకోను. ఏదైనా ఉపయుక్తమైన పని చేయాలనుకుంటున్నాను. నాకు పంజాబీ సంగీతం, గజల్స్, జోక్స్‌ అంటే చాలా ఇష్టం. విచారంగా ఉండటానికి సమయమే లేదు’’ అని వివరిస్తారు ఈ విశ్రాంత ఉద్యోగి. విధి నిర్వహణలో ఉన్నవారూ ఆచరణలో పెట్టదగిన అమూల్యమైన విషయాలను కిరణ్‌ చద్దా తన జీవితం ద్వారా కళ్లకు కడుతున్నారు.
 
నా వయసు ఏడుపదులు దాటి ఉండవచ్చు. కానీ, నా అభిరుచులన్నీ 17 ఏళ్ల అమ్మాయికి తక్కువేమీ లేవు. టీవీ చూస్తూ సమయాన్ని వృథా చేసుకోను. ఏదైనా ఉపయుక్తమైన పని చేయాలనుకుంటున్నాను. నాకు పంజాబీ సంగీతం, గజల్స్, జోక్స్‌ అంటే చాలా ఇష్టం. విచారంగా ఉండటానికి సమయమే లేదు.
– కిరణ్‌ చద్దా

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top