అరవైలో అల్లికలు

60 years Woman Turned Her Passion for Crochet into Toy Business - Sakshi

లక్షల్లో ఆదాయం

అభిరుచి ఏ వయసులోనైనా మనకు ఆదాయ వనరుగా మారవచ్చు. గుర్తింపును తీసుకురావచ్చు. ఈ మాటను ‘లక్ష’రాల నిజం చేసి చూపుతోంది ఆరు పదుల వయసులో ఉన్న కంచన్‌ భదానీ అనే గృహిణి. జార్ఖండ్‌ రాష్ట్రంలో ఉండే కంచన్‌ ఏడాది క్రితం వరకు గృహిణి. ఇప్పుడు వ్యాపారవేత్తగా మారింది. అదీ తనకు బాగా నచ్చిన అల్లికల బొమ్మలతో.

యేడాదిలోనే రూ.14 లక్షల రూపాయలు సంపాదించడమే కాకుండా, యాభై మంది గిరిజన మహిళలకు ఉపాధి కల్పిస్తూ తన సత్తా ఏంటో నిరూపించింది. ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్న కంచన్‌కు వచ్చిన ఈ ఆలోచన గురించి ఎవరైనా అడిగితే ఎన్నో విషయాలు వెలిబుచ్చుతుంది.

‘‘వస్త్ర పరిశ్రమ ఎంతో వేగవంతంగా మారిపోతోంది. అయినా ఇప్పటికీ ఇళ్లలో చేతితో కుట్టే ఎంబ్రాయిడరీకి, అల్లిన వస్తువులకు ఎనలేనంత డిమాండ్‌ ఉంది. ఒకప్పుడు తల్లులు, అమ్మమ్మలు చాలా సాధారణంగా రోజువారీ ఇంటి పనులు పూర్తి చేసిన తర్వాత టేబుల్‌ క్లాత్‌లు, సోఫా కవర్లు, బొమ్మల వరకు అనేక అలంకార వస్తువులను తయారుచేసేవారు. అలాంటి వస్తువులు కాలక్రమంలో తగ్గిపోతున్నాయి. ఇది గమనించే 2021లో ‘లూప్‌హూప్‌’ పేరుతో క్రోచెట్‌ బొమ్మల యూనిట్‌ను స్టార్ట్‌ చేశాను. దీనికి ముందు 50 మంది గిరిజన మహిళలకు క్రోచెట్‌ కళలో శిక్షణ ఇచ్చి, వారికి వర్క్స్‌ ఇస్తుండేదాన్ని. కోల్‌కతాలో పుట్టిన పెరిగిన నేను మా అమ్మమ్మ, అత్తలు తయారుచేసే క్రోచెట్‌ బొమ్మలు, టేబుల్‌ క్లాత్‌ తయారు చేయడం చూసి నేర్చుకున్నాను. ఆ రోజుల్లో ప్రతి ఆడపిల్లకు కుట్లు, అల్లికలు నేర్పేవారు.

► స్కూల్లోనూ నైపుణ్యం..
ఇంట్లోనే కాదు, స్కూల్లోనూ క్రోచెట్‌ వస్తువుల తయారీలో శిక్షణ ఉండేది. దీంతో ప్రాక్టీస్‌ బాగా అయ్యింది. పెళ్లయ్యాక పట్టణప్రాంతానికి వెళ్లాల్సి రావడం, బాధ్యతలు పెరగడంతో పై చదువులకు వెళ్లలేకపోయాను. కానీ, వచ్చిన క్రోచెట్‌ కళను ఇష్టంగా చేస్తుండేదాన్ని. మా వారి ఉద్యోగరీత్యా మేం జార్ఖండ్‌లోని జుమ్రీ తెలయాకు మారినప్పుడు అక్కడ గిరిజన స్త్రీలను చూశాను. వారు గనులలో పనులు చేసేవారు. రోజువారి కూలీ ఏ మాత్రం వారికి సరిపోదు. వారి బాధలను చూసి, ఏదైనా మార్పు తీసుకురాగలిగితే బాగుంటుందని ఆలోచించేదాన్ని. ఏదైనా చేస్తాను అనుకుంటాను, కానీ, ఏం చేయాలో కచ్చితంగా తెలిసేది కాదు.

► కుటుంబ బాధ్యతలలో..
ముగ్గురు పిల్లల తల్లిగా నాకు ఇంటి బాధ్యతలు ఎక్కువే ఉండేవి. ఎప్పుడూ తీరికలేకుండా ఉండేదాన్ని. దీంతో నా సామాజిక ఆకాంక్షలపై దృష్టి పెట్టలేకపోయేదాన్ని. పిల్లలు పెద్దయ్యి, వారి జీవితాల్లో స్థిరపడ్డాక నా అభిరుచిని కొనసాగించాలనే ఆలోచన పెరిగింది. క్రోచెట్‌ నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్న మహిళలకు అప్పుడప్పుడు క్లాసులు తీసుకునేదాన్ని. 2021లో మా పిల్లలతో కూర్చొని చర్చిస్తున్నప్పుడు ఈ క్రోచెట్‌ బొమ్మల తయారీ పెద్ద ఎత్తున చేసి, అమ్మకాలు జరిపితే బాగుంటుందనే ఆలోచన వచ్చింది.

► సోషల్‌ మీడియాలో..
క్రోచెట్‌ బొమ్మల అమ్మకాలను ఆన్‌లైన్‌ ద్వారా చేయాలనే ఆలోచనతో వెబ్‌సైట్, సోషల్‌ మీడియా సెటప్స్‌కి మా పిల్లలు సాయం చేశారు. నేను గిరిజన మహిళలకు క్రొచెట్‌ వర్క్‌ నేర్పిస్తూ, వారితో ఈ బొమ్మలను తయారుచేయిస్తుంటాను. యాభై మంది గిరిజన మహిళలు తమ ఇళ్ల వద్దే ఉంటూ సౌకర్యంగా ఈ పనులు చేస్తుంటారు. నా దగ్గర కావల్సిన మెటీరియల్‌ తీసుకెళ్లి, బొమ్మలతో వస్తారు. ఒక్కొక్కరు రోజుకు 2–3 గంటల క్రోచెట్‌ అల్లిక చేస్తే నెలకు ఐదు వేల రూపాయలు వస్తాయి. మా జట్టులో ఉండే కొందరు నెలలో 30 బొమ్మలకు పైగా చేస్తారు. దీంతో ఇంకొంత ఆదాయం పెరుగుతుంది. ఆ విధంగా ఏడాది కాలంలో మూడు వేల బొమ్మలను అమ్మగలిగాను. పద్నాలుగు లక్షల రూపాయలు సంపాదించగలిగాను. చదువుకునే పిల్లలు, తీరిక ఉండే గృహిణుల్ని ఈ పనిని ఎంచుకుంటున్నారు.

► మృదువైన   బొమ్మలు
తాబేళ్లు, కుందేళ్లు, ఆక్టోపస్‌లు, ఏనుగులు, మనుషుల బొమ్మలు వీటిలో ప్రధానంగా ఉంటాయి. వెబ్‌సైట్, సోషల్‌మీడియా, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌ వంటి ప్లాట్‌ఫారమ్‌లలోనూ ఈ బొమ్మలు అందుబాటులో ఉన్నాయి. ఏ పదార్థాలనూ వృథా చేయకుండా ఉన్నితో వీటిని తయారుచేస్తాం. పసిపిల్లలు వీటితో ఆడుకోవడం చాలా ఇష్టపడతారు. ఆదివాసీ సమాజం కోసం ఏదైనా చేయాలన్న నా కల ఇలా తీరడం సంతోషంగా ఉంది. ఏదైనా పనిని ప్రారంభించడానికి అభిరుచి ఉండాలి కానీ, వయసుపైబడటం ముఖ్యం కాదని నమ్ముతున్నాను’’ అని వివరిస్తుంది కంచన్‌.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top