వృద్ధుడి అదృశ్యం | - | Sakshi
Sakshi News home page

వృద్ధుడి అదృశ్యం

Jun 17 2026 12:40 AM | Updated on Jun 17 2026 12:40 AM

వృద్ధుడి అదృశ్యం రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి అస్వస్థతతో ఉపాధి కూలీ మృతి గిరిజన పాఠశాలల రేషనలైజేషన్‌పై నిరసనలు విద్యా సంస్థల బస్సులపై కేసులు

భీమడోలు: మండలంలోని పూళ్లకు చెందిన వృద్ధుడు కొత్తపల్లి జార్జి (60) అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యులు మంగళవారం పోలీసులను ఆశ్రయించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం పూళ్లకు చెందిన కొత్తపల్లి జార్జి అనే వృద్ధుడు ఉపాధి హామీ పథకం సొమ్మును ఏలూరులోని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాకు వెళ్లి తెచ్చుకుంటానని చెప్పి ఇంటి నుంచి వెళ్లాడు. అయితే రెండు రోజులుగా అతను కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆచూకీ కోసం చేసిన ప్రయత్నాలు చేశారు. అయితే ఎలాంటి ఫలితం లేకపోవడంతో వృద్ధుడు కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై మదీనా బాషా తెలిపారు.

కుక్కునూరు: మండలంలోని బోనగిరి గ్రామం వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఛత్తీస్‌గడ్‌ రాష్ట్రానికి చెందిన పోడియం మోటు (35) అనే వ్యక్తి మృతి చెందాడు. కుక్కునూరు ఎస్సై రాజారెడ్డి చెప్పిన వివరాలు ప్రకారం మృతుడు జామాయిల్‌ మొక్కలు తీసుకెళ్లే వాహనంపై పని చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో మొక్కలు తీసుకువెళుతున్న వాహనంపై మోటు కూర్చుని ఉండగా భద్రాచలం నుంచి అశ్వారావుపేట వెళ్తున్న ఆటో మొక్కల వాహనాన్ని ఢీకొంది. దీంతో వాహనంపై నుంచి పడిపోయిన మోటుకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు చికిత్స నిమిత్తం భద్రాచలం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మోటు మృతి చెందినట్లు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వివరించారు.

వేలేరుపాడు: మండలంలోని జిన్నెలగూడెం గ్రామంలో మంగళవారం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనుల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు రవ్వ గణేష్‌ పొలంలో ఉపాధి పనులు చేస్తుండగా, తురసం జోగారావు (62) అనే కూలీ అకస్మాత్తుగా అస్వస్థతకు గురై కుప్పకూలిపోయాడు. వెంటనే తోటి కూలీలు ఆయనను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు అప్పటికే జోగారావు మృతి చెందినట్లు ధ్రువీకరించారని వేలేరుపాడు ఎంపీడీవో తెలిపారు.

బుట్టాయగూడెం: గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ప్రభుత్వం చేపట్టిన రేషనలైజేషన్‌ను వ్యతిరేకిస్తూ బుట్టాయగూడెం మండలం మారుమూల గ్రామాలైన పులిరామన్నగూడెం, రెడ్డికోపల్లి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో చేపట్టిన నిరసన కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. పాఠశాల పునఃప్రారంభం నుంచి మంగళవారం వరకూ పాఠశాలలు తెరవకుండా గేట్లకు తాళం వేసి నిరసన కార్యక్రమాన్ని గ్రామస్తులు చేపట్టారు. వంటావార్పు కార్యక్రమం కొనసాగిస్తున్నారు. పాఠశాల ప్రారంభమై నాలుగు రోజులు గడుస్తున్నా ఆయా పాఠశాలల్లో అడ్మిషన్లు నిలిచిపోయాయి. విద్యార్థులకు విద్యాబోధన నిలిచిపోయింది. గ్రామస్తులు పాఠశాల గేట్లకు తాళాలు వేయడంతో పాఠశాలలకు వస్తున్న 20 మంది ఉపాధ్యాయులు ఆ పరిసర ప్రాంతాల్లో చెట్ల కింద, బల్లలపైన కుర్చునే పరిస్థితి నెలకొంది. తమకు అధికారులు పాత పద్ధతిలోనే నిర్వహిస్తామని రాతపూర్వకంగా రాసి ఇచ్చే వరకూ తాము చేపట్టిన నిరసన కార్యక్రమం నిలుపుదల చెయ్యమంటూ గ్రామస్థులు తెగేసి చెప్తున్నారు. పులిరామన్నగూడెం, రెడ్డికోపల్లి పాఠశాలల్లో గ్రామస్తులు చేస్తున్న నిరసన కార్యక్రమానికి అటు పీడీఎస్‌యూ విద్యార్థి సంఘం, గిరిజన సంఘాలు మద్దతు తెలిపాయి. అలాగే మంగళవారం వైఎస్సార్‌సీపీ ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులు కూడా మద్దతు తెలిపారు. పులిరామన్నగూడెం చేరుకుని అక్కడ గ్రామస్తులతో కలిసి పాఠశాల వద్ద నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తెల్లమ రమణ, వైస్‌ ఎంపీపీ గగ్గులోతు మోహన్‌రావు, ఎంపీటీసీ సభ్యులు గాలి దుర్గారావు, మొడియం వెంకమ్మ, మడకం వెంకటలక్ష్మి, ఉయికే రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): నిబంధనలను ఉల్లఘించిన 32 ప్రైవేటు విద్యాసంస్థల బస్సులపై కేసులు నమోదు చేశామని ఉప రవాణా కమిషనరు షేక్‌ కరీమ్‌ మంగళవారం తెలిపారు. విద్యాసంస్థలు పునఃప్రారంభమైన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా సోమ, మంగళవారాల్లో వివిధ ప్రైవేటు విద్యాసంస్థల బస్సులను తనిఖీలు చేశామన్నారు. భద్రతా నియమాలు, నిబంధనలకు అనుగుణంగా ఉన్న బస్సుల్లో మాత్రమే విద్యార్థులను తరలించాలని యాజమాన్యాలకు సూచించారు. ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ఆయన తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement