నూజివీడు: తెల్లవారుజాము సమయంలో వెళ్లిన ట్యాంకర్ నుంచి లీకై న యాసిడ్ రోడ్డుపై పడడంతో శనివారం ఉదయం మండలంలోని తుక్కులూరు దళితవాడ వాసులు కళ్ల మంటలతో తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. జంగంగూడెం వెళ్లే మార్గంలోని దళితవాడలో రోడ్డుపై యాసిడ్ పడగా తెల్లవారుజామున నిద్రలేచి బయటకు వచ్చిన వారికి తీవ్ర ఘాటైన వాసన రావడంతో పాటు కళ్లు మండిపోయాయి. అలా ప్రతి ఒక్కరికి కళ్లు మండుతుండటంతో వెంటనే రూరల్ పోలీసులకు విషయాన్ని తెలిపారు. దీంతో రూరల్ సీఐ జీ జ్యోతీబసు వెంటనే సమాచారాన్ని అగ్నిమాపక కేంద్రం సిబ్బందికి తెలిపి హుటాహుటిన తుక్కులూరులోని సంఘటనా స్థలానికి చేరుకొని ఆ మార్గంలో రాకపోకలను నిలిపివేశారు. అనంతరం అగ్నిమాపక కేంద్రం సిబ్బంది ఫైర్ ఇంజిన్‌తో వచ్చి యాసిడ్ పడిన రోడ్డుపై నీళ్లు కొట్టారు. దాదాపు రెండు గంటల సేపు శ్రమించిన అనంతరం యాసిడ్ ప్రభావం తగ్గుముఖం పట్టడం, కళ్ల మంటలు కూడా తగ్గడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.


