న్యూస్‌రీల్
సొంత జాగా లేక కష్టాలు
● శ్మశాన వాటికల్లో అన్నీ సమస్యలే
● పట్టించుకోని ప్రజాప్రతినిధులు
మంగళవారం శ్రీ 14 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
ఆనందరావుపేటలో కూలి పనులు చేసుకుని జీవిస్తున్నాం. గ్రామంలో ఎవరైన మరణిస్తే వారిని శ్మశానానికి తీసుకెళ్ళడం పెద్ద ప్రహసనంలా మారింది. ఎంత మంది కలెక్టర్లు, ప్రజాప్రతినిధులకు చెప్పినా సమస్య పరిష్కరించడం లేదు.
– దండే సైమాన్‌రాజు,
మాజీ సర్పంచ్, ఆచవరం
మాది పూర్తిగా దళిత గ్రామం. శ్మశానానికి స్థలం లేక కొల్లేరు అభయారణ్యంలో సమాధి చేస్తున్నాం. వర్షకాలంలో పూర్తిగా నీట మునుగుతుంది. గత్యంతరం లేక రోడ్డు పక్కనే సమాధి చేస్తున్నాం. అటవీశాఖ అధికారులు మెరక తోలుకోడానికి అవకాశం కల్పించాలి.
– జంగం సుగుణరావు,
మాజీ సర్పంచ్, మణుగునూరులంక
కై కలూరు: చివరి మజిలీలోనూ సామన్యుడికి కష్టాలు తప్పడం లేదు. శ్మశాన వాటికల్లో సమస్యలతో అంత్యక్రియలు ప్రహసనంగా మారాయి. మృతదేహాలను పూడ్చడానికి జాగా లేక రోడ్లపైనే ఉంచి ధర్నాలు చేసే పరిస్థితి కనిపిస్తోంది. శ్మశానాలకు వెళ్లేందుకు నడకమార్గం లేక పంట పొలాల్లోంచే కిలోమీటర్లు మృతదేహాలను మోసుకెళ్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్ళు కావస్తున్నా శ్మశానాల్లో ఇబ్బందులుపై దృష్టి సారించలేదు. గ్రామాల్లో ఎవరైనా మరణిస్తే.. పెద్ద చావే అన్నట్లుగా ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కై కలూరు నియోజకవర్గంలో కై కలూరు, కలిదిండి, మండవల్లి, ముదినేపల్లి మండలాల్లో కలపి మొత్తం 110 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అనేక గ్రామాల్లో ఇప్పటికీ శ్మశాన వాటిక సమస్యలు ఉన్నాయి. జనాభా రెండింతలు పెరిగింది. గతంలో కేటాయించిన శ్మశాన వాటికల్లో స్థలాలు సరిపోవడం లేదు. దీనికి తోడు స్థలాల క్రయవిక్రయాల వల్ల శ్మశాన వాటికలకు వెళ్ళే పుంతలు ఆక్రమణలకు గురయ్యాయి. కొన్ని గ్రామాలు అక్కడ పరిస్థితులను బట్టి కొంత దూరంలో నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. పూర్వపు శ్మశాన వాటికలకు వెళ్లాలంటే కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది.
కొల్లేరు పొంగితే సమాధులు మునకే..
మండవల్లి మండలం మణుగునూరులంకలో 270 కుటుంబాలు జీవిస్తున్నాయి. శ్మశాన వాటిక లేదు. గత్యంతరం లేక రోడ్డు సమీపంలోని కొల్లేరు అభయారణ్యంలో మృతదేహాలను సమాధి చేస్తున్నారు. వర్షాల సమయంలో కొల్లేరు పొంగి సమాధులు పూర్తిగా నీట మునుగుతున్నాయి. శ్మశాన వాటిక ఎత్తు పెంచుదామంటే అటవీశాఖ అధికారులు నిబంధనలు ఒప్పుకోవని హెచ్చరిస్తున్నారు. జిల్లా కలెక్టరు వినతులు పంపినా సమస్య పరిష్కారం కాలేదు.
దారి లేక పొలాల్లోంచే..
కై కలూరు మండలం ఆచవరం పంచాయతీ ఆనందరావుపేటలో 9, 10 వార్డులు ఉన్నాయి. దాదాపు 120 కుటుంబాలు నివసిస్తున్నాయి. పూర్వం ఆనందరావుపేట ఊరు ప్రారంభంలో ఉండేది. కలరా ప్రబలడంతో అందరూ ఊరికి దూరంగా వచ్చి నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. దీంతో పాత గ్రామం శ్మశానానికి వెళ్ళాలంటే కిలోమీటరు వెళ్ళాల్సి వస్తుంది. రహదారి లేకపోవడంతో వరి పొలాల మద్య నుంచి మృతదేహాలను తరలిస్తున్నారు. పొలం యజమానులకు ఆనందరావుపేట వాసులకు మృతదేహాల తరలింపు విషయంలో ఎప్పడు గొడవ జరుగుతూనే ఉంది. రహదారికి కొంత భూమిని ప్రభుత్వం కొనుగోలు చేస్తే సమస్య పరిష్కారమవుతోంది.
కై కలూరు మండలం ఆలపాడు శివారు సోమేశ్వరంలో 1500 మంది నివసిస్తున్నారు. పాత సోమేశ్వరంలో 48 సెంట్ల శ్మశాన స్థలం ఉంది. కొన్నాళ్ళకు జాతీయ రహదారి సమీపంలోని కాలనీకి వచ్చారు. ఇటీవల రైల్వే శాఖ డబుల్ ట్రాక్ ఏర్పాటు చేసింది. ఇదే కాకుండా సోమేశ్వరం వద్ద ఫ్లైఓవర్ నిర్మించారు. మృతదేహాలను ట్రాక్ దాటి తీసుకువెళ్ళలేకపోతున్నారు. హైవేకు చెందిన ఉపయోగించని కొంత భూమిలో మృతదేహాలను పూడ్చుతున్నారు. సమీపంలో చెరువు లీజుదారుడు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాడు.


