కలెక్టరేట్‌ ఎదుట నిరసన | - | Sakshi
Sakshi News home page

కలెక్టరేట్‌ ఎదుట నిరసన

Apr 14 2026 7:58 AM | Updated on Apr 14 2026 7:58 AM

కలెక్టరేట్‌ ఎదుట నిరసన వేధిస్తున్న అధ్యాపకులపై చర్యలు తీసుకోవాలి పర్వతారోహణకు దివ్యాంగ విద్యార్థి శ్రీవారి దేవస్థానం ఈఓగా వేండ్ర

ఏలూరు (టూటౌన్‌): ఆక్రమణలు తొలగించాలని, అక్రమ హోర్డింగ్‌లు తొలగించాలని ఎన్ని సార్లు ఫిర్యాదులు చేసినా నగరపాలక సంస్థ అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఓ ఫిర్యాదుదారురాలు సోమవారం పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమంలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై కలెక్టర్‌ తగిన రీతిలో స్పందించలేదంటూ గోదావరి సమావేశ మందిరం ఎదుట నేలపై కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. కలెక్టర్‌ అధికారులకు వత్తాసు పలికేలా మాట్లాడుతున్నారని, తన గోడు పట్టించుకోవడం లేదన్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, మున్సిపల్‌ కమిషనర్‌ దాటవేత ధోరణిలో సమాధానం ఇస్తున్నారంటూ విమర్శించారు. అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో స్వర్ణలతను పోలీసులు అదుపులోకి తీసుకుని స్థానిక త్రీ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. న్యాయం చేయమని కోరితే అరెస్టులు చేస్తారా? అంటూ సదరు మహిళ అధికారుల తీరును దుయ్యబట్టారు. ఈ విషయంపై తాను చట్టపరంగా పోరాటం చేస్తానని తెలిపారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): నూజివీడు ట్రిపుల్‌ ఐటీ (ఆర్‌జీయూకేటీ)లో పీయూసీ విద్యార్థినులను వేధిస్తున్న అధ్యాపకులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి కే.లెనిన్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం స్థానిక ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ట్రిపుల్‌ ఐటీ యాజమాన్యం విద్యార్థినుల భద్రతను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని, ముగ్గురు అధ్యాపకుల వేధింపులపై తగిన చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తోందని ఆరోపించారు. విద్యార్థినులకు అనుచిత సందేశాలు పంపుతూ, మానసిక వేధింపులకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బాధిత విద్యార్థినులు ఉన్నతాధికారులకు నేరుగా ఫిర్యాదు చేసినా, కేవలం ఇంటర్నల్‌ కంప్లైంట్‌ కమిటీకి విచారణ అప్పగించి, నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పి కాలయాపన చేస్తోందన్నారు. అధ్యాపకులే వేధింపులకు పాల్పడుతుంటే, విద్యార్థులు ఎవరిని నమ్ముకోవాలని, ఈ క్యాంపస్‌లో విద్యార్థినులు భయంతో, అసౌకర్యంతో చదువుకోవాల్సి వస్తోందన్నారు. ముగ్గురు అధ్యాపకులను తక్షణం సస్పెండ్‌ చేయాలని, ఇంటర్నల్‌ కంప్లైంట్‌ కమిటీ నివేదిక కోసం రోజుల తరబడి వేచి ఉండకుండా 7 రోజుల్లోగా పూర్తి చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

పెంటపాడు: పెంటపాడు ప్రభుత్వ పోస్టుబేసిక్‌ పాఠశాలలో పదోతరగతి చదువుతున్న దివ్యాంగ విద్యార్థి అన్నంనీడి సత్యనారాయణ లడక్‌ హై ఆల్టిట్యూడ్‌ శిక్షణకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా సాహస యాత్రకు బయలుదేరుతున్న విద్యార్థిని ప్రత్యేకంగా సోమవారం అభినందించారు. స్కూల్లో 10వ తరగతి చదువుతున్న సత్యనారాయణ చదువులో చురుగ్గా ఉంటాడు. దీంతో పాటు విలీన ఉపాధ్యాయిని సాయి స్వరూప బోధనలో పర్వతారోహణపై ఆసక్తి పెంచుకున్నాడు. సాయి స్వరూప మాట్లాడుతూ డిసెంబర్‌ 26న అమలాపురం, కడపలో జరిగిన శిక్షణలో ప్రతిభ చూపిన సత్యనారాయణ గండికోట అడ్వెంచర్స్‌ స్పోర్ట్స్‌ అకాడమీ ఆధ్వర్యంలో నెలరోజుల పాటు శిక్షణ పొందాడన్నారు. తుది స్దాయిలో రాష్ట్రానికి చెందిన 25 మంది దివ్యాంగ విద్యార్థులతో పోటీపడి ఉన్నతశిక్షణకు ఎంపికై న సత్యనారాయణను ప్రత్యేకంగా అభినందించారు.

ద్వారకాతిరుమల: అన్నవరం దేవస్థానం ఈఓగా పనిచేస్తున్న వేండ్ర త్రినాథరావును ద్వారకాతిరుమల చినవెంకన్న దేవస్థానానికి పూర్తి అదనపు బాధ్యతలతో ఈఓగా నియమిస్తూ సోమవారం జీఓ జారీ చేశారు. త్రినాధరావుకు ద్వారకాతిరుమల దేవస్థానం ఈఓగా సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవం ఉంది. ఆయన హయాంలోనే క్షేత్రంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరిగాయి.

Advertisement
 
Advertisement
Advertisement