పోషకాహారంపై పర్యవేక్షణ కరువు | - | Sakshi
Sakshi News home page

పోషకాహారంపై పర్యవేక్షణ కరువు

Apr 14 2026 7:40 AM | Updated on Apr 14 2026 7:40 AM

కనీస సమాచారం లేదు

వారం రోజులుగా నిల్వ ఉన్న అంగన్‌వాడీ కోడిగుడ్లు

ద్వారకాతిరుమల: కొన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు, గర్భిణులకు, బాలింతలకు అందాల్సిన పౌష్టికాహారం పక్కదారి పడుతోంది. దాంతో లబ్దిదారులకు అవి సక్రమంగా అందడం లేదు. ద్వారకాతిరుమల మండలం వేంపాడులోని బీసీ కాలనీలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రానికి చెందిన కోడిగుడ్లు సోమవారం ఓ ఇంట్లో దర్శనమించ్చాయి. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామంలోని బీసీ కాలనీకి చెందిన అంగన్‌వాడీ కేంద్రానికి, జెడ్పీ ఉన్నత పాఠశాలకు కలిపి గత మంగళవారం ఉదయం సప్లయర్‌ సుమారు 600 కోడిగుడ్లను సరఫరా చేశాడు. ఆ సమయంలో కేంద్రానికి వెళ్లే రహదారి నిర్మాణంలో ఉండటంతో వ్యాన్‌ డ్రైవర్‌ ఆ కోడిగుడ్లను, హైస్కూల్‌కు సంబంధించిన చిక్కీలను గ్రామంలోని సరిహద్దు సుజాత ఇంట్లో పెట్టాడు. ఈ విషయన్ని అప్పుడే వారికి తెలియజేశాడు. దాంతో హైస్కూల్‌ ప్రధానొపాధ్యాయురాలు గౌతమి సూచనలతో ఆ పాఠశాల సిబ్బంది 400 గుడ్లను అదేరోజు సాయంత్రం తీసుకెళ్లిపోయారు. అంగన్‌వాడీ టీచర్‌ మాత్రం కోడిగుడ్లను తీసుకెళ్లలేదు. దాంతో గుడ్లను తీసుకెళ్లాలని అంగన్‌వాడీ టీచర్‌కు సుజాత పలుమార్లు సూచించింది. అయినా ఆమె స్పందించకపోవడంతో వారం రోజులుగా 200 కోడి గుడ్లు సుజాత ఇంట్లోనే మూలనపడి ఉన్నాయి.

పొంతనలేని సమాధానాలు : దీనిపై గుడ్లు సప్లయర్‌ గాబు నాగు, మరి కొందరు పొంతనలేని సమాధానాలు చెబుతున్నారు. అంగన్‌వాడీ టీచర్‌ గత బుధవారం ఫోన్‌ చేసి గుడ్లు రాలేదని చెప్పగా, పరిశీలించి మళ్లీ పంపుతానని సమాధానం ఇచ్చినట్టు నాగు తెలిపాడు. మళ్లీ ఆమె ఫోన్‌ చేయకపోవడంతో గుడ్లు అందాయని అనుకున్నానని పేర్కొన్నాడు. తాను అంగన్‌వాడీ టీచర్‌కు పలుమార్లు తెలిపానని, అయితే ఆమె నాకు అప్పగించకుండా, గుడ్లు అక్కడ దింపితే ఎలా.. తీసుకెళ్లనని సమాధానమిచ్చినట్టు సుజాత చెబుతోంది. ఈ గుడ్లు హెచ్‌.లింగపాలెం, చవలవారిగూడెం, వేంపాడు గ్రామాల్లోని అంగన్‌వాడీ కేంద్రాలకు సంబంధించినవి కావడంతో ఎవరికి వారు తీసుకెళ్లి ఉంటారులే అని టీచర్లు ముగ్గురూ గుడ్లు వదిలేశారని కొందరు అంటున్నారు.

సుజాత ఇంట్లో ఉన్న అంగన్‌వాడీ కోడిగుడ్లు

వేంపాడు గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రం

వ్యాన్‌ డ్రైవర్‌ కనీసం సమాచారం ఇవ్వకుండా సుజాత ఇంటి వద్ద గుడ్లు దింపేశాడు. ఈ నెల 10న అంగన్‌వాడీ ఆయా సుజాత ఇంటికి వెళ్లి అడగ్గా.. ఆమె గుడ్లు లేవని సమాధానం ఇచ్చినట్టు టీచర్‌ తెలిపింది. సమాచారం లోపం వల్ల ఈ సమస్య తలెత్తింది.

– మేరీ, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌

Advertisement
 
Advertisement
Advertisement