మట్టి తవ్వకాలపై రైతుల కన్నెర్ర | - | Sakshi
Sakshi News home page

మట్టి తవ్వకాలపై రైతుల కన్నెర్ర

Apr 14 2026 7:40 AM | Updated on Apr 14 2026 7:40 AM

పెనుగొండ: మట్టి మాఫియా మరోసారి అక్రమ తవ్వకాలకు ప్రయత్నించడంతో రైతులు అడ్డుకున్నారు. సోమవారం ఆచంటలో నక్కల డ్రెయిన్‌లో మరోసారి తవ్వకాలు ప్రారంభించడంతో పార్టీలకతీతంగా నాయకులు, పరిసర ప్రాంత రైతులు భారీగా తరలివెళ్లి అడ్డుకొన్నారు. నక్కల డ్రెయిన్‌ను అభివృద్ధి చేయడం మాని, అక్రమ తవ్వకాలకు పాల్పడుతూ రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ తీవ్ర విమర్శలు చేశారు. అనుమతులు తీసుకున్నామంటూ మట్టి మాఫియా చెప్పడంతో రైతులు వాగ్వాదానికి దిగారు. కొందరు టీడీపీ నాయకుల ఒత్తిడితో పోలీసులు రంగ ప్రవేశం చేసి రైతులను సముదాయించడానికి ప్రయత్నించారు. రైతులు మాత్రం తవ్వకాలకు ససేమిరా అన్నారు. అక్రమ తవ్వకాలు నిలపాలంటూ మంత్రికి వినతిపత్రం అందించినా అధికారులు సహకరించడం లేదన్నారు. మట్టిని యథేచ్చగా తవ్వుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తప్పుడు వినతి పత్రాలు తయారుచేసి తవ్వకాలకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. అక్రమ తవ్వకాలు నిలపకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. హైకోర్టు అడ్వకేట్‌ ఐ.రామానుజం తవ్వక ప్రాంతాన్ని పరిశీలించారు. మట్టి తోడేళ్లు విలయ తాండవం చేస్తున్నా జిల్లా అఽధికారులు చర్యలు తీసుకోక పోవడం దారుణమని విమర్శించారు. నక్కల డ్రెయిన్‌లో తవ్వకాలకు ఎలాంటి అనుమతులు లేవని డ్రెయిన్స్‌ శాఖ ఏఈ సాయి తెలిపారు. ఎవరికీ అనుమతులు ఇవ్వలేదని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement