ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయానికి దత్తత దేవాలయమైన లక్ష్మీపురంలోని శ్రీ సంతాన వేణుగోపాల జగన్నాధ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో జరుగుతున్న శ్రీనివాసుని కల్యాణ మహోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి స్వామివారికి గరుడోత్సవం కన్నులపండువగా జరిగింది. ఆలయం నుంచి పక్క గ్రామమైన తిమ్మాపురం వరకు ఉత్సవం నిర్వహించారు. ముందుగా ఉభయ దేవేరులతో స్వామివారిని గరుడ వాహనంపై ఉంచి ప్రత్యేక పుష్పాలంకారాలు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితుల వేద మంత్రోచ్ఛరణలు, భక్తుల గోవింద నామస్మరణల నడుమ జరిగిన ఈ ఉత్సవానికి తిమ్మాపురం ప్రజలు నీరాజనాలు అర్పించారు.


