భీమవరం (ప్రకాశం చౌక్): కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు నూతన పింఛన్ల మంజూరుపై దృష్టి పెట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దీంతో అర్హత కలిగి ఉన్నవారికి సైతం పింఛన్ మంజూరు కావడం లేదు. జిల్లాలో కొత్త పింఛన్ల మంజూరు కోసం అర్హత కలిగిన వారు దాదాపు 20 వేల మంది ఉన్నారు. వారిలో అధికంగా వృద్ధులు, దివ్యాంగులు ఉన్నారు. అలాగే కదలేని స్థితిలో ఉండి రూ.15 వేలు పింఛను మంజూరు చేయాలని కోరుతున్న వారు దాదాపు 500 నుంచి 1000 మంది వరకు ఉన్నారు. పింఛను పెంచి ఇస్తున్నామని సీఎం చంద్రబాబు, కూటమి నేతలు ప్రచారంతో ఊదరగొడుతున్నా వేలాది మంది అభ్యాగులకు కనీసం పింఛను మంజూరు కాక అవస్థలు పడుతున్నారు.
పింఛన్ల కోసం వినతుల వెల్లువ
ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో జరిగే జిల్లా స్థాయి పీజీఆర్‌ఎస్‌కు వచ్చే అర్జీల్లో అధిక శాతం అన్ని రకాల పింఛన్లకు సంబంధించి ఉంటున్నాయి. ఈ విషయం కూటమి ప్రభుత్వానికి తెలిసి కూడా కొత్త పింఛన్లు మంజూరు చేయకుండా కాలయాపన చేస్తోంది. జిల్లా నలుమూల నుంచి దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులు, ఆరోగ్యం దెబ్బతిన్న వారు పింఛను మంజూరు చేయండి మహోప్రభో అని దూర ప్రాంతాల నుంచి మండుటెండలో అవస్థలు పడుతూ కలెక్టరేట్‌కు వచ్చి అర్జీలు పెట్టుకుంటున్నారు. దీనిపై అధికారులు దరఖాస్తుదారులకు ఏం చెప్పాలో తెలియక సతమతమవుతున్నారు.
బతుకు దెరువు కోసం కష్టాలు
భర్త చనిపోయినవారు, వృద్ధాప్యంతో బాధపడుతున్నవారు, దివ్యాంగులు ప్రభుత్వం నుంచి పింఛను రాక బతుకు దెరువు కోసం అనేక కష్టాలు పడుతున్నారు. ఒక రోజు యోగా కోసం వందల కోట్లు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం.. నూతన పింఛన్లు మంజూరులో జాప్యం చేయడం సరికాదని పలువురు బహిరంగంగా విమర్శిస్తున్నారు.
కొత్త పింఛన్లు మంజూరు చేయని కూటమి ప్రభుత్వం
నూతన పింఛన్ల కోసం దాదాపు 20 వేల మంది ఎదురుచూపులు
పింఛన్లు మంజూరు చేయాలని అధికారుల చుట్టూ తిరుగుతున్న వైనం
దివ్యాంగుల పింఛను పెంచాలని లబ్ధిదారుల మొర


