భీమడోలు: రోడ్డు దాటుతున్న ఇద్దరు వ్యక్తులను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. సూరప్పగూడెం జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. సూర్యాపేట జిల్లాకు చెందిన వరి కోత మెషీన్‌పై డ్రైవర్లుగా పని చేసేందుకు పంజాబ్ రాష్ట్రంలోని పత్వాల జిల్లా, స్వంతా గ్రామానికి చెందిన సర్‌ప్రీతిసింగ్, హర్యానా రాష్ట్రానికి చెందిన కురుక్షేత్ర జిల్లా సల్వాన కలణన్ విలేజ్‌కు చెందిన సుభాష్‌కుమార్ (39) ఈనెల 4వ తేదీన సూరప్పగూడెం వచ్చారు. వారు అదే గ్రామంలో ఓ ఇంట్లో నివాసముంటున్నారు. ఆదివారం అర్ధరాత్రి తర్వాత నిద్రపట్టకపోవడంతో వారిద్దరు జాతీయ రహదారిపై రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుభాష్‌కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. అతడి మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టమ్ నిమిత్తం తరలించారు. తీవ్ర గాయాలతో ఉన్న సర్‌ప్రీత్‌సింగ్‌కు మెరుగైన వైద్యం కోసం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఎస్సై మదీనా బాషా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సర్‌ప్రీత్‌సింగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు దాటుతుండగా ఢీకొట్టిన గుర్తు తెలియని వాహనం
ఒకరి దుర్మరణం, మరొకరికి తీవ్ర గాయాలు
సూరప్పగూడెం జాతీయ రహదారిపై ప్రమాదం


