బాలుడి పరిస్థితి విషమం.. కాలు విరిగిన మహిళ
ఉండి: చెరుకువాడలో మట్టి తరలిస్తున్న ట్రాక్టర్ ప్రమాదవశాత్తూ బోల్తా పడిన ఘటనలో ఓ చిన్నారికి ప్రాణాపాయం ఏర్పడగా మరో మహిళ కాలు విరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలోని వడ్డిగూడెం ప్రాంతంలో ఆక్వారైతులు తమకు వచ్చే పంట బోదెను పొక్లయినర్ సహాయంతో తవ్వకం చేస్తున్నారు. తవ్విన మట్టిని ప్రమాదం జరిగిన ప్రాంతానికి ఎదురుగా తెచ్చి రైల్వే స్టేషన్‌కు ఆనుకుని ఉన్న ఖాళీస్థలంలో ట్రాక్టర్‌ల సహాయంతో పోస్తున్నారు. అయితే అదే మట్టిని తనకు చెందిన ఖాళీస్థలంలో పోయాలని గుర్రం దావీదు అడగడంతో ఓ ట్రాక్టర్ డ్రైవర్ మట్టిని పోసేందుకు వచ్చాడు. మట్టి పోసే సమయంలో ట్రాక్టర్‌లో చిన్న సమస్య రావడంతో డ్రైవర్ ట్రాక్టర్ దిగి సరిచేస్తుండగా దావీదు ట్రాక్టర్ పైకి ఎక్కి ట్రక్‌ను పైకి లేపే క్రమంలో అదుపు తప్పి ట్రక్కు మట్టితో సహా ఒక పక్కకు ఒరిగిపోయింది. ఆ సమయంలో ఆ పక్కనే ట్రాక్టర్‌ను చూస్తున్న ముగ్గురు చిన్నారులపై కొబ్బరి ఆకులదడి, మట్టి పడిపోవడంతో చిక్కుకుపోయారు. గమనించిన స్థానికులు ముగ్గురు పిల్లల్ని బయటకు తీశారు. ఇందులో రెండేళ్ల బాలుడు దావులూరి అయాన్స్ ఆరోగ్య పరిస్థితి ఇబ్బందిగా మారిపోవడంతో హుటాహుటిన ఆకివీడులోని ప్రైవేటు ఆసుపత్రికి అనంతరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో భీమవరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అలాగే బంకమట్టి కాలిపై పడటంతో దావీదు భార్య మేరీ కాలు విరిగింది. ఆమెను కూడా భీమవరం ప్రైవేటు ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. మిగిలిన ఇద్దరు చిన్నారుల ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది లేదని స్థానికులు తెలిపారు. గుర్రం దావీదు భార్య మేరీ, బాలుడు దావులూరి అయాన్స్ కాళ్లకూరు నుంచి అమ్మమ్మ ఇంటికి వచ్చాడు.


