జంగారెడ్డిగూడెం వాటర్‌ స్పోర్ట్స్‌ జట్టు విజయకేతనం | - | Sakshi
Sakshi News home page

జంగారెడ్డిగూడెం వాటర్‌ స్పోర్ట్స్‌ జట్టు విజయకేతనం

Apr 14 2026 7:40 AM | Updated on Apr 14 2026 7:40 AM

జంగారెడ్డిగూడెం వాటర్‌ స్పోర్ట్స్‌ జట్టు విజయకేతనం విద్యాసంస్థల అనుమతులను నిర్ధారించుకోవాలి ఆస్పత్రికి భౌతికకాయం అప్పగింత

జంగారెడ్డిగూడెం: ఆంధ్రప్రదేశ్‌ శాప్‌ లీగ్స్‌–2026లో భాగంగా నిర్వహించిన వాటర్‌ స్పోర్ట్స్‌లో జంగారెడ్డిగూడెం జట్టు పతకాలు సాధించినట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్‌ఏ అజీజ్‌ తెలిపారు. ఈ నెల 11, 12 తేదీల్లో జరిగిన జంగారెడ్డిగూడెం కేకేఎం ఎర్రకాలువ జలాశయంలో జిల్లా స్థాయి వాటర్‌ స్పోర్ట్స్‌లో జంగారెడ్డిగూడెం జట్టు ప్రతిభ చూపి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారన్నారు. అలాగే రాష్ట్రస్థాయిలో కయాకింగ్‌, కానోయింగ్‌, రోయింగ్‌, డ్రాగన్‌ బోడ్‌ పోటీల్లో అండర్‌–15, అండర్‌–18 విభాగాల్లో 11 బంగారు, 5 వెండి, 2 రజత పతకాలు సాధించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా క్రీడాకారులను పలువురు అభినందించారు.

భీమవరం: తమ పిల్లలను ప్రైవేటు విద్యాసంస్ధల్లో చేర్చే తల్లిదండ్రులు ఆయా విద్యాసంస్థలకు అనుమతులు ఉన్నదీ లేనిదీ నిర్ధారించుకుని, అనుమతులు ఉన్న విద్యాసంస్ధల్లోనే చేర్చాలని జిల్లా విద్యాశాఖాధికారి ఇ నారాయణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో కొన్ని ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు రానున్న విద్యాసంవత్సరం ప్రారంభ అనుమతులు లేకుండా, భవన నిర్మాణాలు పూర్తికాకుండా అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారని, అలాగే ముఖ్యకూడళ్లలో పెద్ద పెద్ద హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇటువంటి వాటిని అడ్డుకోడానికి మండల విద్యాశాఖాఽధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అనుమతులు లేని విద్యాసంస్థల హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు పెట్టుకోడానికి పంచాయతీ, మునిసిపల్‌ అధికారులు అనుమతులు జారీ చేయవద్దని నారాయణ కోరారు.

చింతలపూడి: ఎరగ్రుంటపల్లి గ్రామానికి చెందిన పాములపాటి నారాయణరెడ్డి సతీమణి కమల (86) గత మూడు వారాలుగా అనారోగ్యంతో ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందారు. ఆమె భౌతికకాయాన్ని ఏలూరులోని ఆశ్రం వైద్య కళాశాలకు దానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు ఆమె కుటుంబ సభ్యులు. కమల కుమారుడు, సింగరేణి విశ్రాంత అధికారి పి. శ్యామ్‌ సుందర్‌ రెడ్డి, కుమార్తెలు కంఠం సరళ, జగ్గవరపు సుధారాణి, పాములపాటి రాధారాణి కలిసి కమల భౌతికకాయాన్ని ఆశ్రం వైద్యకళాశాలకు అప్పగించారు.

Advertisement
 
Advertisement
Advertisement