● కిటికీ అద్దంతో మణికట్టు కోసి హత్యకు పాల్పడిన వైనం
● భార్యపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో దారుణం
తాడేపల్లిగూడెం రూరల్: మండలంలోని వెంకట్రామన్నగూడెంలో సోమవారం సాయంత్రం దారుణ హత్య చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన దెయ్యాల సూర్యనారాయణ (50) చేతి మణికట్టుపై కిటికీ అద్దంతో కోసి అదే గ్రామానికి చెందిన నాయుడు అలియాస్ కిషోర్ హత్యకు పాల్పడ్డాడు. తీవ్ర రక్తస్రావమైన సూర్యనారాయణ అక్కడ నుంచి గ్రామంలోని ఒక ఇంటి అరుగుపై కుప్పకూలి మృతి చెందాడు. రక్తపు మడుగులో ఉన్న సూర్యనారాయణను చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఆ వెంటనే రూరల్ సీఐ భీమేశ్వర రవికుమార్, ఎస్సై రవికుమార్ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడు సూర్యనారాయణ ఒక ప్రైవేట్ సెక్యూరిటీ సర్వీస్‌లో పనిచేస్తుండగా, నిందితుడు కిషోర్ స్థానికంగా ఒక చికెన్ సెంటర్‌లో పనిచేస్తున్నాడు. కిషోర్ భార్యపై సూర్యనారాయణ అనుచిత వ్యాఖ్యలు చేయడమే ఈ దారుణానికి కారణంగా తెలుస్తోంది. ఈ హత్యతో ప్రశాంతంగా ఉన్న గ్రామం ఉలిక్కిపడింది. మృతుని కుటుంబ సభ్యుల రోదనలతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. హత్యకు గల పూర్తి కారణాలు తెలియవలసి ఉంది.


