దొడ్డిదారిన శ్రీవారి దర్శనాలు | - | Sakshi
Sakshi News home page

దొడ్డిదారిన శ్రీవారి దర్శనాలు

Feb 15 2026 7:32 AM | Updated on Feb 15 2026 7:32 AM

దొడ్డిదారిన శ్రీవారి దర్శనాలు

దొడ్డిదారిన శ్రీవారి దర్శనాలు

దొడ్డిదారిన శ్రీవారి దర్శనాలు

పరిశీలిస్తాం..

పలువురు సెక్యూరిటీ సిబ్బంది చేతివాటం

హోంగార్డు, మహిళా సెక్యూరిటీ గార్డును పట్టుకున్న అధికారులు

ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయంలో కొందరు ఆలయ, సెక్యూరిటీ సిబ్బంది దొడ్డిదారిన భక్తులను దర్శనాలకు పంపుతూ కాసులు దండుకుంటున్నారు. ఈ నెల 11న ఓ హోంగార్డు భక్తుల నుంచి డబ్బులు తీసుకుని, దర్శనాలకు పంపుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్‌ అయ్యాయి. దాంతో అతడిని దేవస్థానం అధికారులు మాతృ సంస్థకు అప్పగించారు. అలాగే మరో ఘటనలో మహిళా హోంగార్డును విధుల నుంచి తొలగించారు. వివరాల్లోకి వెళితే.. చిన్నతిరుపతిగా పేరొందిన ద్వారకాతిరుమల దివ్య క్షేత్రాన్ని నిత్యం వేలాది మంది భక్తులు సందర్శిస్తున్నారు. వారికి మెరుగైన సేవలు అందించేందుకు ఆలయ అధికారులు నిరంతరం శ్రమిస్తున్నారు. కొందరు సిబ్బంది సంపాదనే ధ్యేయంగా పనిచేస్తున్నారు. ధనికుల నుంచి డబ్బులు తీసుకుని అడ్డదారిలో వారిని దర్శనాలకు పంపుతూ శ్రీవారి ఆదాయానికి గండి కొడుతున్నారు. ముఖ్యంగా భక్తులు రద్దీ ఎక్కువగా ఉండే శని, ఆదివారాలు, ఇతర పర్వదినాల్లో ఈ వ్యాపారాన్ని జోరుగా సాగిస్తున్నారు.

పట్టించిన నిఘానేత్రం..

ఆలయ తూర్పు రాజగోపురం వద్ద విధులు నిర్వర్తిస్తున్న ఓ హోంగార్డు ఈనెల 11న కొందరు భక్తుల నుంచి డబ్బులు తీసుకుని ఆలయంలోకి పంపాడు. ఆలయంలో విధులు నిర్వర్తిస్తున్న కొందరు ఉద్యోగులు వారిని రిసీవ్‌ చేసుకుని దర్శనాలు చేయించినట్టు తెలుస్తోంది. సీసీ కెమేరాల్లో రికార్డ్‌ అయిన ఈ దృశ్యాలను పరిశీలించిన అధికారులు సదరు హోంగార్డును మాతృ సంస్థకు పంపించివేశారు. ఆ మరుసటి రోజే దేవస్థానానికి చెందిన ఓ మహిళా సెక్యూరిటీ గార్డు భక్తుడి వద్ద డబ్బులు తీసుకుని, దర్శనానికి పంపుతూ అధికారులకు పట్టుబడింది. దాంతో ఆమెను విధుల నుంచి తొలగించారు. సెక్యూరిటీ సిబ్బంది సిఫార్సులతో వెళుతున్న భక్తులను ఆలయంలోకి పంపుతున్న సిబ్బంది ఎవరనేది అధికారులు తేల్చడం లేదు. తీగలాగితే తమకు కావాల్సిన సిబ్బంది డొంక ఎక్కడ కదులుతుందోనన్న భయంతోనే అధికారులు కిమ్మనకుండా ఉండిపోతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

టికెట్లు రీప్రింట్‌

శ్రీవారి ఆలయంలో దర్శనం టికెట్లు రీప్రింట్‌ జరుగుతున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రూ.500 అంతరాలయ దర్శనం టికెట్‌తో పాటు, మిగిలిన దర్శనం టికెట్లను కూడా రీప్రింట్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆన్‌లైన్‌లో వస్తున్న టికెట్లను డౌన్‌లోడ్‌ చేసి, వాటిని రీప్రింట్‌ చేసి, భక్తులకు విక్రయిస్తూ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నట్టు సమాచారం. కొందరు టికెట్లు విక్రయించే సిబ్బంది, వాటిని స్కాన్‌ చేసే సిబ్బంది లాలూచీ పడి ఈ దందాను సాగిస్తూ, జేబులు నింపుకుంటున్నారు. దేవస్థానం అధికారులు దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

ద్వారకాతిరుమల శ్రీవారి క్షేత్రం

ఆలయ తూర్పు రాజగోపురం వద్ద ఈ నెల 11న హోంగార్డు డబ్బులు తీసుకుని భక్తులను దర్శనాలకు పంపుతున్నట్టు సీసీ టీవీ కెమెరాల్లో రికార్డ్‌ అయ్యింది. దాంతో అతడిని మాతృ సంస్థకు సరెండర్‌ చేశాం. మరో మహిళా సెక్యూరిటీ గార్డును విధుల నుంచి తొలగించాం. టికెట్ల రీప్రింట్‌ వ్యవహారాన్ని పరిశీలిస్తాం.

– డీవీ భాస్కర్‌, శ్రీవారి దేవస్థానం ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement