శ్రీవారి క్షేత్రం.. ముక్కోటికి ముస్తాబు
ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రం ముక్కోటికి ముస్తాబవుతోంది. ఈ ఏడు స్వామివారి ఉత్తర ద్వార దర్శనానికి వేలాది మంది భక్తులు తరలివస్తారని అంచనా వేస్తున్న ఆలయ అధికారులు అందుకు అనుగుణంగా భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో తాత్కాలిక క్యూలైన్ల నిర్మాణం, ఆలయానికి, పరిసరాలకు విద్యుద్దీప అలంకారాలు చేసే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కొబ్బరికాయలు కొట్టే ప్రదేశం నుంచి ఆలయ దక్షిణ (ప్రధాన) రాజగోపురం వరకు భక్తులు రాకపోకలు సాగించేందుకు వీలుగా ఆ ప్రాంతంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌ని నిర్మిస్తున్నారు. ముక్కోటి ఏకాదశి పర్వదినం ఈనెల 30న కావడంతో, ముందు రోజు 29న మధ్యాహ్నం 2.30 గంటల నుంచి నిర్వహించే గిరి ప్రదక్షిణకు సైతం ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఉత్తర ద్వార దర్శనానికి వచ్చే వీఐపీలతో పాటు, సాధారణ భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించే దిశగా ఏర్పాటు చేస్తున్నారు. గోవింద స్వాములు, స్థానికుల సౌకర్యార్థం ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేస్తున్నారు. రూ. 100, రూ.200 టికెట్లతో పాటు, శ్రీవారి ఉత్తర ద్వార దర్శనం ప్రత్యేక రూ.500 టికెట్‌లను భక్తులకు అందుబాటులో ఉంచినట్టు ఆలయ ఈఓ ఎన్‌వీఎస్‌ఎన్ మూర్తి తెలిపారు. భక్తులు గమనించాలని ఆయన కోరారు.
శరవేగంగా విద్యుద్దీప అలంకారాలు, క్యూలైన్ల నిర్మాణాలు
శ్రీవారి క్షేత్రం.. ముక్కోటికి ముస్తాబు


