కార్పొరేట్ల ప్రయోజనాల కోసమే అధీక్షక్ బిల్లు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసమే కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ శిక్షా అధీక్షక్ బిల్లు 2025ను తీసుకువచ్చిందని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు మండిపడ్డారు. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో శనివారం స్థానిక కోటదిబ్బ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద బిల్లు ప్రతులను దహనం చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు మాట్లాడుతూ గతంలో 2018లో ప్రవేశపెట్టిన హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా బిల్లును, ఇప్పుడు వికసిత్ భారత్ శిక్షా అధీక్షక్ పేరుతో మార్చి ఒకే నియంత్రణ సంస్థను తీసుకురావడం ద్వారా ఉన్నత విద్యా రంగాన్ని కేంద్రీకరించడమే ఈ బిల్లు లక్ష్యమన్నారు. రాష్ట్రాల్లోని విద్యా సంస్థలపై కేంద్రం తన భావజాలాన్ని రుద్దడానికి, వాటిపై పట్టు సాధించడానికి ఈ బిల్లును ఒక సాధనంగా ఉపయోగించుకునే ప్రమాదం ఉందన్నారు. తక్షణమే ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ నగర అధ్యక్షుడు ఎస్.శివాజీ, ఉపాధ్యక్షుడు ఎం.జయంత్, సహాయ కార్యదర్శి ఎం.శివ, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


