ప్రజా ఉద్యమానికి నాంది
● ఏలూరు జిల్లాలో 3.60 లక్షల సంతకాలు
● ఈ నెల 15న ఏలూరు నుంచి తాడేపల్లికి..
ఏలూరు టౌన్: టీడీపీ సర్కారు పునాదులు కదిలేలా వైఎస్సార్‌సీపీ ప్రజా ఉద్యమానికి నాంది పలికిందని.. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేపట్టిన కోటి సంతకాల సేకరణ నిరసన జ్వాలల సెగ టీడీపీ ప్రభుత్వ కోటకు అంటుకుంటుందని... ప్రజలంతా సీఎం చంద్రబాబు తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని వైఎస్సార్‌సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు అన్నారు. ఏలూరు పార్టీ జిల్లా కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పార్టీ జిల్లా కార్యాలయానికి కోటి సంతకాల సేకరణ ప్రత్రాలను అందజేశారు. సుమారు 3.60 లక్షల సంతకాల పత్రాలను జిల్లా అధ్యక్షులు డీఎన్నార్; ఏలూరు పార్లమెంట్ పరిశీలకులు, ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాధ్, ఏలూరు పార్లమెంట్ ఇన్‌ఛార్జ్, యువజన విభాగం జోనల్–2 వర్కింగ్ ప్రెసిడెంట్ కారుమూరి సునీల్‌కుమార్, బీసీ సెల్ జోనల్–2 వర్కింగ్ ప్రెసిడెంట్ నౌడు వెంకటరమణకు అందజేశారు.
ప్రజలే బుద్ధి చెబుతారు: డీఎన్నార్
దూలం నాగేశ్వరరావు మాట్లాడుతూ.. జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో గ్రామాల్లో ప్రజలకు టీడీపీ విధానాలపై అవగాహన వచ్చిందన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ ఐదేళ్ళ పాలనలో కేంద్రాన్ని ఒప్పించి ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుమతులు తెచ్చారని గుర్తు చేశారు. స్వాతంత్య్రం వచ్చాక కేవలం 12 మెడికల్ కాలేజీలు ఉంటే... గత ఐదేళ్ళలో ఏకంగా 17 మెడికల్ కాలేజీలు తేవటం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. టీడీపీ హయాంలో సీఎం చంద్రబాబు చేస్తున్న దుష్టపన్నాగాలపై ప్రజలకు అవగాహన వచ్చిందని, సరైన రీతిలో బుద్దిచెబుతారని స్పష్టం చేశారు. ఏలూరు పార్లమెంట్ ఇన్‌చార్జి కారుమూరి సునీల్‌కుమార్ మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేద, మధ్య తరగతి వర్గాల ప్రజల సంక్షేమం, ఆరోగ్యం కోసం ఆలోచిస్తూ రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు తీసుకువచ్చారని చెప్పారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయటంతోపాటు, తెలుగు జాతికి అత్యంత కీలకమైన స్టీ ల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు సహకరించడం సిగ్గుచేటన్నారు. మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ ... వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేద పిల్లలు డాక్టర్ కావాలనే కలను సాకారం చేసేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకువచ్చారని తెలిపారు. దెందులూరు నియోజకవర్గంలో శాంతియుతంగా ర్యాలీ చేసుకునేందుకు అవకాశం లేకుండా ... రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ హౌస్ అరెస్ట్ చేయటం నీచమైన చర్య అన్నారు.
ప్రైవేటీకరణకు ప్రజలు వ్యతిరేకం
ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే, సమన్వయకర్త పుప్పాల వాసుబాబు మాట్లాడుతూ.. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేటీకరణ చేయడాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. ప్రజలకు ఉచిత వైద్యాన్ని దూరం చేసేలా టీడీపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ ఆఽధీనంలోనే మెడికల్ కాలేజీలు ఉండాలని ప్రజలు కోరుతున్నారని చెప్పారు. ఏలూరు సమన్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకాష్ మాట్లాడుతూ... ప్రజల్లో చైతన్యం వచ్చిందని, ప్రతీ ఒక్కరూ టీడీపీ ప్రభుత్వం చేస్తోన్న కుట్రలను గ్రహిస్తున్నారని తెలిపారు. జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజల్లో మంచిపేరు వస్తుందనే అక్కసుతోనే మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్నారని ఆరోపించారు. ఈ నెల 15న ఏడు నియోజకవర్గాల నుంచి నేతలు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలతో జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహిస్తామని డీఎన్‌ఆర్ స్పష్టం చేశారు. కోటి సంతకాల పత్రాలను ఒక వాహనంలో ఉంచి సమన్వయకర్తలు, పరిశీలకులతో కలిసి శివారు వరకూ భారీ ర్యాలీ చేపడతామని తెలిపారు.


