మనమే తలో చేయీ వేద్దాం !
ద్వారకాతిరుమల: ఎలాగో గోతులు పూడ్చరని అనుకున్నారో ఏమో.. కొందరు యువకులు క్షేత్రంలోని ప్రధాన రహదారిపై ఉన్న గోతులను బుధవారం స్వచ్ఛందంగా పూడ్చారు. వివరాల్లోకి వెళితే. ద్వారకాతిరుమల–భీమడోలు క్షేత్ర ప్రధాన రహదారి పలు చోట్ల ధ్వంసమైంది. దాంతో వివిధ ప్రాంతాల నుంచి వాహనాలపై వచ్చే భక్తులు నిత్యం ప్రమాదాల భారిన పడుతున్నారు. దీన్ని చూసి ప్రజలు స్వచ్ఛందంగా పలు చోట్ల మరమ్మతులు చేస్తున్నారు. రెండు రోజుల క్రితం సూర్యచంద్రరావుపేట వద్ద మలుపులో ఉన్న గోతులను స్థానికులు కాంక్రీటుతో పూడ్చారు. తాజాగా బుధవారం ద్వారకాతిరుమలలో రోడ్డుపై ఉన్న గోతులను మండలంలోని తిమ్మాపురంకు చెందిన కొందరు యువకులు కంకర రాళ్లతో పూడ్చారు. కనీసం అధికారులు వీటిపై తారు పోస్తే బాగుంటుందని స్థానికులు అంటున్నారు.
భీమవరం అర్బన్: మండలంలోని గొల్లవానితిప్ప జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడు సుధీర్‌బాబుపై భీమవరం రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం అతను విద్యార్థులను అసభ్యకరంగా తాకడంతో పాటు వేధించడంతో జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆయనను సస్పెండ్ చేశారు. ప్రధానోపాధ్యాయుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


