అబ్బయ్యచౌదరిని అడ్డుకున్న పోలీసులు
పెదవేగి: కోటి సంతకాల ముగింపు కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరిని కొంతసేపు పోలీసులు అడ్డుకున్నారు. పెదవేగి మండలం కొండలరావుపాలెంలోని తన నివాసం నుంచి దెందులూరులో పార్టీ శ్రేణులతో కలసి ఏలూరు పార్టీ కార్యాలయానికి వెళ్లేందుకు సిద్ధమవ్వగా పెదవేగి సీఐ సీహెచ్ రాజశేఖర్ తన పోలీస్ సిబ్బందితో కొంతసేపు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అబ్బయ్యచౌదరి మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా శాంతియుత ర్యాలీకు వెళ్లేందుకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారని అని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడా లేని రూల్ దెందులూరులోనే ఎందుకు అని పోలీసులను అబ్బయ్యచౌదరి ప్రశ్నించడంతో పోలీసులు వెనక్కి తగ్గారు.
భీమవరం: భీమవరం పట్టణంలోని ఓ ప్రైవేటు విద్యా సంస్థ బస్సు బుధవారం రాత్రి అదుపు తప్పి కాలువలోకి ఒరిగిపోయింది. విద్యా సంస్థ నుంచి విద్యార్థులను తీసుకువెళుతుండగా అదుపుతప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో బస్సులోని విద్యార్థులు బస్సు అద్దాలు పగలకొట్టుకుని బయటపడ్డారు. ప్రమాదంలో విద్యార్థులు సురక్షితంగా బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.


