12 నుంచి సాఫ్ట్‌బాల్ అంతర జిల్లాల టోర్నమెంట్
వీరవాసరం: ఆంధ్రప్రదేశ్ 69వ స్కూల్ గేమ్స్ అండర్ 17 బాలబాలికల సాఫ్ట్ బాల్ అంతర జిల్లాల టోర్నమెంట్ పోటీలు ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు వీరవాసరం మద్దాల రామకృష్ణమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు నిర్వహించనున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ అధ్యక్షుడు జుత్తిగ శ్రీనివాస్, కార్యదర్శులు పీఎస్‌ఎన్ మల్లేశ్వరరావు, బాజీంకి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ పోటీల్లో ఉమ్మడి 13 జిల్లాల బాల బాలికల జట్లు నుంచి సుమారు 416 మంది క్రీడాకారులు పాల్గొంటారన్నారు. వీరందరికీ భోజన వసతి సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు.
భీమడోలు: ఓ ఇంటిలో చోరీకి పాల్పడిన నేరానికి గాను ముద్దాయి అన్నేవారిగూడెంకు చెందిన గుర్రాల సురేష్‌కు మూడు నెలల సాధారణ జైలు శిక్ష, రూ.500 జరిమానా విధిస్తూ భీమడోలు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎన్‌ఎస్ ప్రియదర్శిని బుధవారం తీర్పునిచ్చారు. దుద్దేపూడి పంచాయతీ పరిధిలోని అన్నేవారిగూడెంకు చెందిన గుర్రాల సురేష్ అదే గ్రామానికి చెందిన తుంగ రాంబాబు ఇంట్లో రాత్రి వేళ చొరబడి దొంగతనానికి పాల్పడ్డాడు. భీమడోలు పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి కోర్టు విచారణలో ఏపీపీ టి.శశికళ వాదనలు వినిపించగా, ఎస్సై ఎస్‌కే మదీనా బాషా సాక్షులను హాజరుపర్చారు.
ఏలూరు (టూటౌన్): రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవాలని రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి డేగా ప్రభాకర్ డిమాండ్ చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ఏలూరు ఏరియా సమితి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కార్యాలయం వద్ద ఽబుధవారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ధాన్యం, మొక్కజొన్న, పత్తి పంటలను మద్దతు ధరలకు కొనుగోలు చేయాలని, కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ పథకంతో పాటు బ్యాంకు రుణాలు ఇవ్వాలని, ధరలు పడిపోయి నష్టపోతున్న అరటి, నిమ్మ, బత్తాయి రైతులను ఆదుకోవాలని, వెంటనే ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లించాలని, ఉచిత పంటల బీమా పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, బండి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


