టెట్ అభ్యర్థులకు సూచనలు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఈ నెల 10 నుంచి 21వ తేదీ వరకూ నిర్వహించనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు హాజరయ్యే అభ్యర్థులకు జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మ పలు సూచనలు చేశారు. ఈ పరీక్షలు జిల్లాలో రెండు సెంటర్‌లలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మోడ్‌లో జరుగుతాయి. హాల్ టికెట్‌లో అభ్యర్థి పేరు, రిజిస్ట్రేషన్ నంబర్ సరిగ్గా ఉన్నాయో లేదో తనిఖీ చేసుకోవాలి. పరీక్ష ప్రారంభానికి 90 నిమిషాల ముందు అభ్యర్థులను పరీక్షా కేంద్రం లోపలికి అనుమతిస్తారు. హాల్ టికెట్ వెరిఫికేషన్ కోసం కనీసం ఒక ఒరిజినల్, చెల్లుబాటు అయ్యే ఫొటో గుర్తింపు కార్డుతో పాటు సమర్పించాలి. హాల్ టికెట్లో ఫోటో లేని అభ్యర్థి రెండు లేటెస్ట్ పాస్‌పోర్ట్ సైజు ఫొటోలను తీసుకురావాలి. అభ్యర్థులు ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను పరీక్ష హాలులోకి తీసుకెళ్లడం పూర్తిగా నిషేధం. పరీక్షా సమయంలో ఏవైనా సాంకేతిక సమస్యలు ఉంటే వెంటనే ఇన్విజిలేటర్‌కు తెలపాలి. హాల్ టికెట్‌లో గాని, నామినల్ రోల్‌లో గాని ఏమైనా తప్పులు ఉంటే సరైన ధ్రువపత్రాలు సంబంధిత డిపార్ట్ మెంటల్ ఆఫీసర్‌కు అందజేసి సీసీఎన్‌ఆర్‌లో నమోదు చేయించుకోవాలి.
భీమడోలు: స్థానిక భీమడోలు పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం రాత్రి వివాహిత ఫిర్యాదు మేరకు గృహహింస కేసు నమోదు చేశారు. వివరాల ప్రకారం.. సూరప్పగూడెంకు చెందిన వినీలకు, ఖమ్మం జిల్లా ఆశ్వారావుపేట మండలం నారాయణపురం గ్రామానికి చెందిన నిర్మల సురేష్‌తో 15 ఏళ్ల కితం వివాహమైంది. వారికి ఇద్దరు ఆడపిల్లలు. అయితే ఈ ఏడాది జనవరి 28వ తేదీన సురేష్ అనుమానంతో వేధిస్తూ చిత్రహింసలకు గురిచేశాడని, ఇందుకు కుటుంబ సభ్యులు కూడా సహకరించారని వినీల ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై ఆమె అక్కడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మంగళవారం భీమడోలు పోలీస్‌స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేయడంతో సురేష్‌తో పాటు అతని కుటుంబ సభ్యులపై గృహహింస కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎస్‌కే మదీనా బాషా తెలిపారు.
భీమడోలు: ట్రాన్స్‌ఫార్మర్‌లోని రాగి వైరు చోరీపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల ప్రకారం ఏలూరుకు చెందిన డాక్టర్ యర్రమిల్లి లక్ష్మీకామేశ్వరికి పొలసానిపల్లి పంచాయతీ శివారు ఆంజనేయనగరంలో ఏడు ఎకరాల కొబ్బరి, ఖోఖో పొలంలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఉంది. ఈ నెల 7వ తేదీ రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ట్రాన్స్‌ఫార్మర్‌లోని రాగి వైరును అపహరించారు. భీమడోలు ఏఈ శివాజీకి మంగళవారం బాధితురాలు ఫిర్యాదు చేశారు. ఏఈ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎస్‌కే మదీనా బాషా తెలిపారు.
దెందులూరు: కర్రసాములో ఏపీ చాంపియన్‌షిష్ – 2025 సింగల్ స్టిక్ (కర్ర) పోటీ విభాగంలో వేగవరం గ్రామానికి చెందిన మోర్ల భగత్ సామ్రాట్ గోల్డ్ మెడల్ సాధించాడు. గుంటూరు జిల్లాలో బుధవారం జరిగిన ఏపీ సౌత్ జోన్ సేలాంబం చాంపియన్‌షిప్–2025 లో భగత్ తన అద్భుత నైపుణ్యాన్ని ప్రదర్శించి చాంపియన్‌షిప్ సాధించడం పట్ల కోచ్ వెంకన్న పలువురు అతడిని అభినందించారు.


