శ్రీవారి హుండీలో టాయ్ కరెన్సీ నోట్లు
ద్వారకాతిరుమల: శ్రీవారి హుండీలో టాయ్ కరెన్సీ నోట్లు బయటపడ్డాయి. మంగళవారం ద్వారకాతిరుమలలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన చినవెంకన్న దేవస్థానం ప్రమోద కల్యాణ మండపంలో హుండీల నగదు లెక్కింపును నిర్వహించారు. ఆ సమయంలో సిబ్బందికి టాయ్ కరెన్సీ రూ.500 నోట్లు కట్ట (రూ.50 వేలు) కనిపించింది. తీరా చూస్తే ఆ నోట్లపై సీరియల్ నెంబర్ ఉండాల్సిన చోట అన్నీ సున్నాలే ఉన్నాయి. అలాగే మరోపక్క శ్రీఫుల్ ఆఫ్ ఫన్‌శ్రీ అని, శ్రీమనోరంజన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాశ్రీ అని ఉంది. దాంతో అవాక్కయిన సిబ్బంది వాటిని టాయ్ కరెన్సీగా గుర్తించారు. అధికారులకు చూపించి, వాటిని పక్కన పడేశారు. ఇదిలా ఉంటే కొందరు భక్తులు ఇప్పటికీ రద్దయిన పాత కరెన్సీ నోట్లను హుండీలో వేస్తున్నారు. చెల్లని నోట్లు వేయడం వలన స్వామివారి సేవలకు ఎలా పనిచేస్తాయని పలువురు అంటున్నారు.


